- రవాణాశాఖ మంత్రి పొన్నం వ్యాఖ్యల కలకలం
- బంగారం ధర మూడురెట్లు పెరిగిందని వ్యాఖ్య
- జూబ్లీహిల్స్ ఎన్నికలవేళ అనవసర రాద్ధాంతం
సహనం వందే, హైదరాబాద్:
రాష్ట్రంలో ఎంతో వాడీవేడిగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన తులం బంగారం ఇవ్వడం సాధ్యం కాదని ఆయన కామెంట్స్ చేయడంపై విమర్శలు వెలుగుతున్నాయి. దీంతో మహిళల తులం బంగారం ఆశ అడియాశగా మారింది. మహాలక్ష్మి పథకం పేరుతో కొత్తగా పెళ్లయిన వారికి పసిడి బహుమతి అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించినా ఆ హామీ ఇప్పుడు గాలిలో దీపమైంది. ఉప ఎన్నికల సమయంలో ఒక కీలకమైన మంత్రి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.
పసిడి ధరల పెంపుతో భారం…
తమ మాట మార్చుకోవడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన కారణం విస్మయానికి గురిచేస్తోంది. హామీ ఇచ్చిన సమయంలో తులం బంగారం ధర సుమారు రూ. 50 వేలు ఉండేది. ఇప్పుడు అది ఏకంగా రూ. లక్షన్నరకు చేరువలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పెరిగిన భారం ప్రభుత్వానికి మోయలేనిదని ఆయన స్పష్టంగా చెప్పేశారు. ఆర్థిక కష్టాల పేరు చెప్పి ఇచ్చిన హామీ నుంచి సులభంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే రెండేళ్లు దాటినా కల్యాణలక్ష్మి పథకంలో లబ్ధిదారులకు బంగారం దక్కడం లేదు.
మహిళల తీవ్ర ఆవేదన
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ కీలక హామీపై నమ్మకం పెట్టుకున్న రాష్ట్రవ్యాప్త మహిళలు ఇప్పుడు మోసపోయినట్టు భావిస్తున్నారు. అమలు చేయలేని హామీలు ఇచ్చి ఓట్లు దండుకున్నారని, అధికారం చేజిక్కించుకున్నాక మాట తప్పారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను నమ్మక ద్రోహం చేసిందని, పేద మహిళల ఆశలతో ఆడుకుందని ఆవేదన చెందుతున్నారు. ఇది కేవలం హామీ రద్దు మాత్రమే కాదు… పాలకపక్షం విశ్వసనీయత కోల్పోవడానికి నిదర్శనం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతిపక్షం నిప్పులు… రాజకీయంగా నష్టం
బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు. అసాధ్యమైన వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారని… కేవలం అధికారం కోసమే ఇంతటి అబద్ధాలు ఆడారని మండిపడుతున్నారు. బంగారం ధరల పెరుగుదలను అదునుగా చేసుకుని మాట మార్చుకోవడం తగదని ఆరోపిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం… ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పెద్ద దెబ్బ. ఇప్పటికే అనేక హామీల అమలులో జాప్యంపై విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు తులం బంగారం రద్దు నిర్ణయం వ్యతిరేకతను మరింత పెంచనుంది. రాబోయే జూబ్లీహిల్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అంశం ప్రతిపక్షాల చేతికి ప్రధాన అస్త్రంగా మారే అవకాశం ఉంది.
ఆర్థిక ఇక్కట్ల ఇబ్బందుల్లో ప్రభుత్వం…
ఉచిత బస్సు ప్రయాణాలు, పెంచిన పింఛన్లు, గ్యాస్ సబ్సిడీ, బియ్యం పంపిణీ వంటి ఆరు పథకాల అమలు ప్రభుత్వ ఖజానాపై భారీ భారం మోపుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలవుతుండటంతో దీర్ఘకాలిక అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కొరత ఏర్పడి పనులు నిలిచిపోతున్నాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తులం బంగారం వంటి భారీ వ్యయంతో కూడిన హామీల నుంచి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందన్నది వాస్తవం. నమ్మకద్రోహం పేరుతో ప్రతిపక్షం ప్రచారం మొత్తుకుంటుంటే ప్రభుత్వం మాత్రం పరిస్థితులు మారాయన్న సాకులు చెబుతోంది. ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో మరికొన్ని రోజులు హాట్ టాపిక్‌గా కొనసాగే అవకాశం ఉంది.