- వారి మొత్తం ఆస్తి 13.4 ట్రిలియన్ డాలర్లు
- బిలియనీర్లలో అమెరికా… తర్వాత చైనా టాప్
- ఇండియాలో 40 మంది… జర్మనీలో 70 మంది
- సంపద సృష్టి వెనుక దాగున్న సామాజిక చీలిక
సహనం వందే, వాషింగ్టన్:
ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల ఆస్తులు రికార్డు స్థాయికి చేరాయి. ఇది సంపద కేంద్రీకరణ ఏ స్థాయిలో ఉందో కళ్ళకు కడుతోంది. ప్రపంచ ఆర్థిక మార్కెట్ల ఉత్సాహం పెరగడంతో 2024లో బిలియనీర్ల సంఖ్య ఏకంగా 3,508కి చేరింది. ఈ ధనవంతుల మొత్తం ఆస్తి 13.4 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. ఇది అంతకుముందు సంవత్సరం కంటే 10.3 శాతం పెరిగింది. స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకోవడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ల సూచిక వెల్లడించింది. అయితే ఈ గణాంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న తీవ్ర అసమానతలను… ముఖ్యంగా పేద, ధనిక మధ్య పెరుగుతున్న అంతరాన్ని స్పష్టంగా ఎత్తి చూపుతున్నాయి. కొద్దిమంది చేతుల్లోనే ప్రపంచ సంపద పోగవుతోందనడానికి ఇంతకంటే బలమైన సాక్ష్యం అవసరం లేదు.
అమెరికా ఆధిపత్యం…
ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశంగా అమెరికా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అమెరికాలో ఏకంగా 1135 మంది బిలియనీర్లు ఉండగా… వారి మొత్తం ఆస్తి 5.7 ట్రిలియన్ డాలర్లు. అంటే ప్రపంచంలోని మొత్తం బిలియనీర్ల సంపదలో దాదాపు 43 శాతం ఒక్క అమెరికాలోనే కేంద్రీకృతమై ఉంది. అమెరికా తరువాత స్థానంలో చైనా ఉంది. అక్కడ 321 మంది బిలియనీర్లు… సుమారు 1.3 ట్రిలియన్ డాలర్ల సంపద ఉంది. అమెరికాతో పోలిస్తే చైనాలో బిలియనీర్ల సంఖ్య దాదాపు మూడో వంతు మాత్రమే కావడం అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పట్టును తెలియజేస్తోంది. భారత్ లో40 మంది బిలియనీర్లు, జర్మనీ 70, రష్యా 46 మంది బిలినియర్లు ఉన్నారు.

సంపద సృష్టి వెనుక దాగున్న సామాజిక చీలిక!
ఈ సంవత్సరం బిలియనీర్ల సంఖ్య, వారి ఆస్తి రికార్డు స్థాయికి చేరడం ఆర్థిక పునరుద్ధరణకు సంకేతమని ఒక కోణం నుంచి వాదించినా… ఇది సామాజిక అసమానతలను తీవ్రతరం చేస్తోందని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. అమెరికాలో ముఖ్యంగా సాంకేతికత (టెక్), ఆర్థిక (ఫైనాన్స్) విభాగాలు బిలియనీర్లను తయారు చేయడంలో ప్రధాన పాత్ర పోషించాయి, అదే చైనాలో ఎలక్ట్రానిక్స్, రిటైల్ రంగాలు దోహదపడ్డాయి. ఈ ట్రెండ్ ద్వారా కింది స్థాయి ప్రజల ఆదాయాలు పెరగకుండా కేవలం పై స్థాయిలోనే సంపద పోగవుతోందని స్పష్టమవుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థలో అసమాన పంపిణీకి అద్దం పడుతోంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నప్పటికీ ఆ లాభాలు కేవలం కొందరికి మాత్రమే దక్కుతున్నాయి, సామాన్య ప్రజలు మాత్రం పెరుగుతున్న ధరలతో, ఉద్యోగ సమస్యలతో సతమతమవుతున్నారు. రాబోయే సంవత్సరాలలో ఈ అసమానతలు మరింత పెరిగితే సామాజిక సంక్షోభాలు తప్పవని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.