‘క్లినిక్’లోనే కిక్కు… ఆర్ఎంపీకి లక్కు – ఖమ్మంలో ఆర్ఎంపీ వైద్యుడికి లిక్కర్ షాప్

  • కేటాయింపు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన కలెక్టర్
  • సొంత క్లినిక్ లోనే బార్… మందుల హుషార్
  • నివ్వెర పోతున్న ఆర్ఎంపీలు… డాక్టర్లు

సహనం వందే, హైదరాబాద్:
ప్రజారోగ్యంలో ఉన్న ఓ ఆర్ఎంపీ వైద్యుడికి అదృష్టం తలుపు తట్టింది. ఖమ్మం జిల్లాలో జరిగిన మద్యం దుకాణాల కేటాయింపులో ఆ ఆర్ఎంపీకి ఏకంగా షాపే దక్కింది. ఆ డాక్టరయ్య చేసిన పనేంటో తెలుసా? కేవలం మూడు లక్షల రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించి.‌‌.‌‌. ఒకే ఒక్క అప్లికేషను వేశాడు. అంతే! లక్కీ డ్రాలో ఆ దైవం కరుణించినట్లుగా షాపు అతని సొంతమైంది. తన అదృష్టాన్ని చూసి ఆ ఆర్ఎంపీ మురిసిపోతుంటే… జిల్లా కలెక్టరు అనూదీప్ స్వయంగా కేటాయింపు పత్రాన్ని అందించారు. ‘మందు’ (వైద్యం) ఇచ్చే చేతికి… ఇప్పుడు ‘మందు’ (మద్యం) పోసే అవకాశం దక్కడంతో ఆయన పంట పండిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు మూడు చోట్ల మాత్రమే ఇలా ఒకే ఒక్క దరఖాస్తుతో షాపులు దక్కాయి.

రెండు ‘మందు’లతో ఆదాయం డబుల్
ఇంతకాలం జబ్బులతో బాధపడేవారికి మందు (మెడిసిన్) ఇస్తూ వచ్చిన ఈ డాక్టరయ్య… ఇకపై మరో రకమైన మందు (లిక్కర్) కూడా అమ్ముతారు. ఒకవైపు ఆరోగ్యం పాడుచేసుకున్న వారికి వైద్యం… మరోవైపు లిక్కర్ షాపులో ఆరోగ్యం పాడుచేసుకునేందుకు సరుకు – రెండు రకాల పనులు చేస్తారు. ఇది అతనికి రెండు కోణాల్లో ఆదాయాన్ని డబుల్ చేస్తుంది. ఇకపై ఆయన దగ్గరకు వచ్చే కస్టమర్లు తమకు ఏ ‘మందు’ కావాలో కాస్త వివరంగా చెప్పాల్సి ఉంటుంది.

ఆర్ఎంపీలు అంటే అగ్గి మీద గుగ్గిలం అవుతున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇప్పుడు ఈ విషయంలో ఎలాంటి కామెంట్స్ చేస్తుందో చూడాలి. ఆర్ఎంపీలపై కేసులు పెడుతూ వస్తున్న మెడికల్ కౌన్సిల్ ఈ ఆర్ఎంపీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మున్ముందు చూడాల్సి ఉంటుంది. అతని ఆర్ఎంపీ క్లినిక్ పై దాడి చేసి కేసులు పెడుతుందా లేదా అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

దరఖాస్తుల సునామీ… కొందరికే జాక్‌పాట్
తెలంగాణ రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాల కోసం మొత్తం 95,137 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో దుకాణానికి సగటున 36 దరఖాస్తులు. కొందరు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి వందల అప్లికేషన్లు వేసినా ఎవరికి దక్కాలో వారికే దక్కాయి. కరీంనగర్‌లో ఓ వ్యక్తి కేవలం ఒక్క దరఖాస్తు వేసినా… అక్కడ ఉన్న 34 అప్లికేషన్లలో అతని పేరు రావడంతో ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడంటే లక్కీ డ్రా ఎంతమందికి లాటరీ తగిలిందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 19 దుకాణాలకు మాత్రం సింగిల్ డిజిట్ దరఖాస్తులు మాత్రమే రావడంతో వాటికి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు. షాపులు దక్కినవారు నవంబరు 2025 నుండి అక్టోబరు 2027 వరకు మద్యం అమ్మకాలు జరుపుకుంటారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *