- విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ఫిదా
- పట్టుమని ఏడేళ్లు లేని బాలుడి ప్రతిభ
- సీఎం బాబు గోత్రనామాలతో అర్చన
సహనం వందే, రణస్థలం:
కలిశెట్టి అప్పలనాయుడు… విజయనగరం ఎంపీ. ఆయన స్టైలే వేరు. పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్లడం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి చేదోడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం పట్ల ఆయనకు ఎనలేని ప్రేమ. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా చంద్రబాబుకు ప్రియ శిష్యుడుగా ఉన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ఏ దేవాలయంలో అర్చనలు చేసినప్పటికీ తమ కుటుంబ సభ్యుల గోత్రనామాల కంటే ముందు నారా చంద్రబాబు నాయుడి కుటుంబ గోత్ర నామాలతో అర్చన చేయించి తర్వాత తమ కుటుంబ సభ్యుల పేర్లతో అర్చన చేయించడం ఆనవాయితీ.
ఏడేళ్ల మేనల్లుడు… అవాక్కయిన అందరూ
ఆశ్చర్యమేంటంటే మంగళవారం అప్పలనాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాకుళం జిల్లాలోని తన మండలం రణస్థలంలో ఈశ్వరుడి దేవాలయంలో అర్చన నిర్వహించారు. అతనితోపాటు ఆయన ఏడేళ్ల మేనల్లుడు ప్రణవిత్ సాయి మణికంఠ కూడా ఉన్నాడు. అర్చన చేయడానికి పూజారి గోత్రనామాలు అడగగా… అప్పలనాయుడు చెప్పడానికి ముందే ఆయన మేనల్లుడు సాయి వెంటనే కలుగజేసుకొని చంద్రబాబు నాయుడు కుటుంబ గోత్ర నామాలు చెప్పాడు. నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ లు… పునుగునిళ్ల గోత్ర నామాలను గలగలా చెప్పడంతో అక్కడి వారంతా అవాక్కయ్యారు. మేనల్లుడి మెమరీకి అప్పలనాయుడు మురిసిపోయారు.