కాలిన బతుకులు… కదలని ప్రభుత్వాలు – కర్నూలు బస్సు మంటలపై విచారణ అంతంతే

  • యాజమాన్యాన్ని అరెస్టు చేయని దుస్థితి
  • ఇప్పటికీ వి.కావేరి ఓనరును టచ్ చేయలేదు
  • డ్రైవరును అరెస్ట్ చేసి తూతూ మంత్రపు చర్య
  • యాజమాన్యానికి రాజకీయాలకు లింకుందా?

సహనం వందే, హైదరాబాద్:
కర్నూలు బస్సు దగ్ధంలో 19 మంది సజీవ దహనం అయితే వి.కావేరి యాజమాన్యాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు టచ్ చేయడానికి ఎందుకు వెనకాడుతున్నాయి? వి కావేరి ట్రావెల్స్ యాజమాన్యాన్ని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ దుర్ఘటనకు కేవలం డ్రైవర్‌ను మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు. బస్సులో అనేక లోపాలకు, నిబంధనల ఉల్లంఘనలకు యాజమాన్యానిదే పూర్తి బాధ్యత కాదా? చిన్నపాటి గొడవలకే సామాన్యులను అరెస్టులు చేసి జైలుకు పంపించే ప్రభుత్వాలు… ఇంతటి ఘోరానికి కారణమైన బస్సు యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. యాజమాన్యానికి రాజకీయ పలుకుబడి ఉందా అన్న చర్చ కూడా ప్రస్తుతం జోరుగా సాగుతోంది.

వి కావేరీ పలుకుబడేంటి?
వి కావేరీ (వేమూరి కావేరీ) ట్రావెల్స్‌ చాలా ప్రముఖమైన బ్రాండ్‌గా చెలామణి అవుతోంది. ఈ ట్రావెల్స్ గ్రూప్‌ యాజమాన్యానికి అన్ని రకాలుగానూ పలుకుబడి ఉండడం వల్లనే వారిని కనీసం టచ్ చేయడానికి కూడా ప్రభుత్వాలు వెనకాడుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్, అనుమతుల విషయంలో స్పష్టమైన లోపాలు ఉన్నట్లు తేలినా వారిని అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటనే సందేహాలు బలంగా ఉన్నాయి. డ్రైవర్ కూడా తప్పుడు లైసెన్స్ తో విధులు నిర్వహించాడనే విషయం వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ నియామకం, వారి అర్హతలకు సంబంధించి పూర్తి బాధ్యత యాజమాన్యానిదే అయినప్పుడు వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?

యజమాని వేమూరి వినోద్ కుమార్ పరారీ?
తెలుగు రాష్ట్రాలలో కావేరీ ట్రావెల్స్ సంస్థకు మంచి పేరు ఉంది. గతంలో కావేరీ ట్రావెల్స్ పేరుతో సంస్థ నడపగా అందులో ఉన్న ముగ్గురు భాగస్వాములు విడిపోవడంతో తెలంగాణలోని పటాన్‌చెరు కేంద్రంగా వేమూరి కావేరీ ట్రావెల్స్‌ ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్నారు. తెలంగాణ రవాణాశాఖ రికార్డుల ప్రకారం ఈ కంపెనీ యజమానిగా వేమూరి వినోద్ కుమార్ పేరు ఉంది. ఈయన స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పామూరు. అయితే వినోద్ కుమార్‌తో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు. యజమాని వినోద్ కుమార్‌ పరారీలో ఉండడంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

నిబంధనల ఉల్లంఘనే పెట్టుబడిగా!
వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన సుమారు 70 బస్సులు వివిధ రూట్లలో నడుస్తున్నాయని కంపెనీ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఏపీలోని వివిధ నగరాలకు, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, పుణె, శిర్డీ వంటి ఇతర రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలకు ఈ బస్సులు తిరుగుతున్నాయి. అయితే ఈ సంస్థకు చెందిన బస్సులు ఎక్కువగా ఒడిశా, నాగాలాండ్, దాద్రా అండ్‌ నగర్ హవేలి ఇతర రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో స్లీపర్ బస్సులకు రిజిస్ట్రేషన్ లేకపోవడం, ఆ తర్వాత అనుమతులు వచ్చినా పన్ను ఎక్కువగా ఉండటంతో ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు ఇలా ఇతర రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ చేయిస్తుంటారు. నిబంధనలను ఉల్లంఘించి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *