ప్రాణం తీసిన ప్రామిస్ – ఆశ పెట్టకండి… చావు చూడకండి

  • మాటమీద నిలబడగలిగే వాగ్దానాలే చేయండి
  • మనసును కదిలించే ఓ పేదోడి చావు కథ

చలికాలపు ఒక రాత్రి… ఓ కోటీశ్వరుడు తన ఇంటి సమీపంలో తీవ్రమైన చలిలో ఉన్న ఒక నిరుపేద వృద్ధుడిని చూశాడు. ఆ వృద్ధుడి ఒంటి మీద కనీసం ఒక కోటు కూడా లేదు. అది చూసి ఆ కోటీశ్వరుడు ‘అయ్యో తాతయ్యా! ఈ చలిలో మీరు కోటు కూడా లేకుండా ఎలా ఉన్నారు?’ అని అడిగాడు. దానికి ఆ వృద్ధుడు ‘నాకు అలవాటైపోయింది బాబూ… కోటు లేకపోయినా ఈ చలిని తట్టుకునేలా మనసుని దృఢంగా చేసుకున్నాను’ అని బదులిచ్చాడు.

ఆ వృద్ధుడి మాటలకు చలించిపోయిన కోటీశ్వరుడు ‘కొద్దిసేపు ఇక్కడే ఉండండి. నేను ఇంటి లోపలికి వెళ్లి మీకోసం ఒక కోటు తీసుకొస్తాను’ అని చెప్పాడు. ఆ కోటీశ్వరుడి దయకు వృద్ధుడు చాలా సంతోషించి ‘సరే బాబూ..‌. నేను మీకోసం ఎదురు చూస్తుంటాను’ అన్నాడు.

మరిచిపోయిన కోటీశ్వరుడు…
కానీ కోటీశ్వరుడు ఇంటికి వెళ్ళాక తన పనుల్లో పడిపోయి ఆ వృద్ధుడికి ఇచ్చిన మాటను పూర్తిగా మర్చిపోయాడు. రాత్రంతా ఆ వృద్ధుడు చలిలో గజగజ వణుకుతూ కోటు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. తెల్లారి కోటీశ్వరుడికి వృద్ధుడు గుర్తుకొచ్చి బయటికి వెళ్ళాడు. కానీ అప్పటికే చలికి తట్టుకోలేక ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ వృద్ధుడి చేతిలో ఒక ఉత్తరం ఉంది. అందులో ఇలా రాసి ఉంది:

‘మహాశయా… నాకు చలిని తట్టుకోవడానికి వెచ్చని దుస్తులు లేనప్పుడు నా మానసిక శక్తి నన్ను బ్రతికించింది. కానీ మీరు సాయం చేస్తానని వాగ్దానం చేసిన తర్వాత నేను మీ మాట మీద ఆశ పెట్టుకుని ఆ మానసిక బలాన్ని కోల్పోయాను. మీరు ఇచ్చిన ఆశ నన్ను చంపేసింది.’

మాట ఇస్తే నిలబడండి…
ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది: మనం నిలబెట్టుకోలేని వాగ్దానాలను ఎప్పుడూ చేయకూడదు. మీకు అది చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ అవతలివారికి అది జీవితం మొత్తం కావచ్చు. మీరు మాటమీద నిలబడగలిగే వాగ్దానాలను మాత్రమే చేయండి.

సహనం వందే, హైదరాబాద్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *