- వి.కావేరి బస్సుల అక్రమాల అసలు రూపం
- అవినీతిలో కూరుకుపోయిన అధికారులు
- ఇష్టారాజ్యంగా అనుమతులిస్తూ అక్రమాలు
సహనం వందే, హైదరాబాద్:
కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు మంటల్లో 19 మంది మాడి మసైపోయారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. సీటింగ్ బస్సుగా రిజిస్ట్రేషన్ పొందిన ఈ వాహనాన్ని స్లీపర్ బస్సుగా మార్చి రవాణా నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించిన వైనం బయటపడింది. 2018లో తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించిన ఈ బస్సు 2023లో డయ్యూ డామన్‌లో ఎన్ఓసీతో మరో రిజిస్ట్రేషన్ పొంది నేషనల్ పర్మిట్ సాకుతో రోడ్లపై దూసుకెళ్లింది. ఒడిశాలోని రాయగడలో ఆల్టరేషన్ చేయించి 43 సీట్లకు అనుమతి తీసుకుని స్లీపర్‌గా మార్చారు. అధికారుల కుమ్మక్కుతోనే ఈ అరాచకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
పెండింగ్ చలాన్లతో పరుగులు…
ఈ బస్సుపై ఏకంగా 16 పెండింగ్ చలాన్లు ఉన్నాయని తనిఖీల్లో వెల్లడైంది. ఒక వాహనంపై పదికి మించిన చలాన్లు ఉంటే యజమానిపై చార్జిషీట్ నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలన్న నిబంధనను అధికారులు గాలికి వదిలేశారు. అంతేకాదు చలాన్లు చెల్లించకుండా కోర్టుకు హాజరుకాకుండా ఈ బస్సు రోడ్లపై స్వైరవిహారం చేసింది. రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం, యాజమాన్యం నిర్వాకం కలిసి ఈ దుర్ఘటనకు దారితీసినట్లు స్పష్టమవుతోంది.
అధికారులతో కుమ్మక్కు…
రాయగడ ఆర్టీఏ అధికారులు సీటింగ్ బస్సుకు ఆల్టరేషన్ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ అనుమతిని స్లీపర్ బస్సుగా మార్చడానికి దుర్వినియోగం చేసిన వేమూరి కావేరి యజమాన్యం నిబంధనలను ఉల్లంఘించింది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం కూడా అధికారులకు లంచం ఇచ్చినట్టు తెలిసింది. ఈ ఆల్టరేషన్ వ్యవహారం ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్లు అధికారులను లోబరుచుకుని నిబంధనలను ఎలా తుంగలో తొక్కుతున్నారో చూపిస్తోంది. ఇలాంటి అక్రమాలు కొనసాగడం వల్లే ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి.
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం…
వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం 19 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్ల అరాచకాలను బహిర్గతం చేసింది. సీటింగ్ బస్సుగా రిజిస్ట్రేషన్ చేయించి స్లీపర్‌గా మార్చడం ద్వారా ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టిన ఈ యజమాన్యం, అధికారుల సహకారంతోనే ఈ అక్రమాలకు పాల్పడింది. రవాణా శాఖ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ పెండింగ్ చలాన్లను చెల్లించకుండా రోడ్లపై బస్సులను నడపడం దారుణం. ఈ ఘటన రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని… ప్రైవేటు ట్రావెల్స్ యజమానుల అత్యాశను బట్టబయలు చేసింది.