- కొనుగోలుదారులను ఆకర్షిస్తున్న బ్రాండ్
- దీన్నే అవకాశంగా తీసుకున్న మోసగాళ్ళు
- మోసాల సుడిగుండంలో రియల్ ఎస్టేట్
- హైదరాబాద్ ట్రంప్ టవర్ పై నీలి నీడలు
సహనం వందే, న్యూఢిల్లీ:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రాండ్‌తో కూడిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు భారత్ అతిపెద్ద విదేశీ మార్కెట్‌గా మారింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ (గూర్గావ్)లో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రెండు లగ్జరీ ప్రాజెక్టులతో పాటు… ఇప్పుడు హైదరాబాద్‌లోని కోకపేట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ ప్రకటన రియల్ ఎస్టేట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. 63 అంతస్తులతో సుమారు రూ. 3,500 కోట్ల పెట్టుబడితో ఈ టవర్లు నిర్మాణం కానున్నాయని డెవలపర్లు చెబుతున్నారు. ఈ భారీ విస్తరణ భారత రియల్ ఎస్టేట్‌లో అమెరికా ప్రభావాన్ని పెంచుతున్నా దీని వెనుక ఉన్న స్థానిక భాగస్వాములు, పరిశ్రమలోని లోపాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
మోసాల సుడిగుండంలో రియల్ ఎస్టేట్…
ట్రంప్ ఆర్గనైజేషన్‌కు భాగస్వాములుగా ఉన్న భారత రియల్ ఎస్టేట్ మోగల్స్‌పై మనీ లాండరింగ్, సెక్యూరిటీస్ మోసం, లంచం, పన్ను ఎవేషన్, వినియోగదారులను మోసగించడం వంటి పలు తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ట్రంప్ ప్రాజెక్టులతో నేరుగా సంబంధం లేకపోయినా ఈ భాగస్వాముల చరిత్ర భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమలో పాతుకుపోయిన అవినీతి, మోసాల తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఒకవైపు కొనుగోలుదారులు తమ కష్టార్జితాన్ని పెట్టి మోసపోతుంటే… మరోవైపు ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం కోల్పోతోంది. విదేశీ బ్రాండ్‌లు కూడా ఇలాంటి నేర చరిత్ర ఉన్న స్థానిక భాగస్వాములతో కలిసి పనిచేయడం ఆ బ్రాండ్ విశ్వసనీయతపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది.
హైదరాబాద్ గోల్డెన్ మైల్: లీగల్ చిక్కులు
ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ ప్రకటించిన హైదరాబాద్‌లోని కోకపేట ప్రాంతం ఇప్పటికే అధిక ధరల ప్రాంతంగా మారింది. 4 ఎకరాల్లో సుమారు 400 లగ్జరీ అపార్ట్‌మెంట్‌లు ఇక్కడ నిర్మాణం కానున్నాయి. వీటి ధరలు రూ. 4 కోట్ల నుంచి మొదలవుతాయని అంచనా. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే దేశంలోనే అత్యంత ఎత్తైన ట్రంప్ టవర్స్‌గా నిలుస్తుందనే ప్రచారం ఉంది. అయితే ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే లీగల్ చిక్కులు మొదలయ్యాయి. భూమి యజమాని ప్రాజెక్టుకు అంగీకారం ఇవ్వలేదని… భూమి మోసపూరితమైనదని ఆరోపిస్తూ పబ్లిక్ నోటీసు జారీ చేశారు. ట్రంప్ వంటి అంతర్జాతీయ బ్రాండ్ ప్రాజెక్ట్‌కు ఇలాంటి సమస్యలు రావడం ఆలస్యాన్ని, పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచే అవకాశం ఉంది.
ప్రభుత్వ చర్యలు నామమాత్రం…
భారత రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం లేకపోవడం, భూ వివాదాలు, మనీ లాండరింగ్ వంటి సమస్యలు కొత్తవి కావు. రేరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్) ఉన్నప్పటికీ దాని అమలు బలహీనంగా ఉండటం వల్ల మోసాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ట్రంప్ వంటి ప్రపంచ స్థాయి బ్రాండ్‌లు దేశంలోకి అడుగుపెడుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం అవినీతిపై, మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే విదేశీ పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో దేశీయ భాగస్వాముల అక్రమాల వల్ల ట్రంప్ వంటి పెద్ద బ్రాండ్లు కూడా మోసాల మయలో చిక్కుకొని పరిశ్రమ ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఉంది. లగ్జరీ ప్రాజెక్టుల ఆకర్షణ పెరుగుతున్న కొద్దీ కొనుగోలుదారులు తమ పెట్టుబడుల భద్రత గురించి మరింత అప్రమత్తంగా ఉండాలి.