అతిథి దేవో… భద్రత లేదో – ఇండోర్‌ లో విదేశీ మహిళా క్రికెటర్లకు వేధింపులు

  • ఆస్ట్రేలియా మహిళా జట్టుకు చేదు అనుభవం
  • అంతర్జాతీయంగా పరువు తీస్తున్న ఇండియా
  • భద్రత కల్పించకుండా కన్నీరు కార్చిన బీసీసీఐ

సహనం వందే, ఇండోర్:
క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడటానికి భారత్‌కు వచ్చిన విదేశీ మహిళా క్రీడాకారులకు భద్రత కరువైంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ మహిళా ప్రపంచకప్ సందర్భంగా ఇండోర్‌ లో బస చేసిన ఆస్ట్రేలియా మహిళా జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లను ఓ మతిలేని వ్యక్తి వేధించడం దేశంలో మహిళా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు గురువారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హోటల్ నుంచి ఓ కేఫ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న ఆ ఇద్దరు క్రీడాకారుల వద్దకు బైక్‌పై వచ్చిన ఓ ఆగంతకుడు వారిని అనుచితంగా తాకడమే కాకుండా వేధించినట్లు సమాచారం. ఈ ఘటన క్రీడాలోకంలో కలకలం రేపింది.

పోలీసుల వేగంతోనే సరికాదు…
ఈ దారుణంపై ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సెక్యూరిటీ అధికారులు వెంటనే ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని గుర్తించి అరెస్టు చేశామని అదనపు ఉప పోలీస్ కమిషనర్ రాజేష్ దండోటియా మీడియాకు వివరించారు. నిందితుడిపై పలు క్రిమినల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. కేవలం అరెస్టు చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు… భద్రతా వైఫల్యాలకు బాధ్యులు ఎవరు?

కన్నీరు కార్చిన బీసీసీఐ
ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఈ ఘటనను ఆయన ఎంతో బాధాకరమైన, అరుదైన ఉదంతమని అభివర్ణించడం విమర్శలకు తావిస్తోంది. ‘మధ్యప్రదేశ్ పోలీసులు నిందితుడిని వేగంగా పట్టుకోవడం అభినందనీయం. న్యాయం జరిగేలా చట్టం తన పని తాను చేసుకుపోతుంద’ని ఆయన అన్నారు. బీసీసీఐ ఇకపై తమ భద్రతా ప్రోటోకాల్‌లను సమీక్షించి అవసరమైతే మరింత బలోపేతం చేస్తుందని హామీ ఇచ్చారు. విదేశీ గడ్డపై ఇలాంటి ఘటన జరిగితే దేశ పరువు ఎక్కడికి పోయేది? కేవలం మాటలతో సరిపుచ్చకుండా, పటిష్ఠమైన భద్రత కల్పించడంలో భారత క్రికెట్ బోర్డు పూర్తిగా విఫలమైందనేది అక్షర సత్యం.

క్రీడాంగణం నుంచి కంచె వరకు
ప్రపంచ వేదికలపై భారత్ ప్రతిష్ఠను పెంచేందుకు వచ్చే క్రీడాకారులకు కూడా పటిష్ఠమైన భద్రత కల్పించలేకపోవడం సిగ్గుచేటు. ఆటగాళ్లు తమ హోటల్ నుంచి సాధారణంగా నడుచుకుంటూ వెళ్లేందుకు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు అతిథి దేవో భవ అనే మాటలతో అతిథులను గౌరవించిన ఈ నేలపై నేడు వేధింపులు, అవమానాలు ఎదురవుతుంటే యావత్ దేశం తలదించుకోవాలి. బీసీసీఐ వెంటనే దీనిపై అంతర్జాతీయంగా క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో దేశంలో జరిగే ఏ టోర్నమెంట్‌కైనా ఆటగాళ్లు రావడానికి భయపడే ప్రమాదం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *