మార్క్సిజం… మస్కిజం – మార్క్స్, మస్క్ ల లక్ష్యం సంపద పంపిణీయే

  • సామాజిక విప్లవం వర్సెస్ సాంకేతిక విప్లవం
  • రోబో యుగంలో ఉద్యోగాలు ఊడుతాయ్…
  • కానీ అందరికీ ఉచితంగా సంపద అందుతుంది
  • ఎలాన్ మస్క్ ఈ కొత్త ప్రతిపాదనపై చర్చలు
  • ఉత్పత్తి సాధనాలు ఉన్న వారి దగ్గరే సంపద
  • కాబట్టి ప్రజలకు అందదంటున్న విశ్లేషకులు

సహనం వందే, హైదరాబాద్:
కారల్ మార్క్స్ ప్రతిపాదించిన కమ్యూనిజం సిద్ధాంతం, ఎలాన్ మస్క్ ఊహించిన రోబో యుగం— ఈ రెండు దృక్పథాలూ ఆర్థిక అసమానతలకు చెక్ పెట్టి సంపద సమృద్ధిని లక్ష్యంగా చేసుకున్నాయి. మార్క్స్ అందించిన ఎవరి సామర్థ్యానికి తగ్గట్టు పని, ఎవరి అవసరానికి తగ్గట్టు సంపద పూర్తిస్థాయిలో అనుభవించడం అనే సూత్రం… మస్క్ ప్రతిపాదించిన యూనివర్సల్ హై ఇన్‌కం ఆలోచనతో ఆశ్చర్యకరంగా పోలి ఉంది. రెండు ఆలోచనల అంతిమ లక్ష్యం ఒకటే. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక స్వేచ్ఛ, సంపద అందేలా చూడటం. అయితే ఈ స్వేచ్ఛను సాధించేందుకు వారు ఎంచుకున్న మార్గాలు మాత్రం పూర్తిగా భిన్నమైనవి.

సంపద సమృద్ధి… సమాన పంపిణీ
మార్క్స్ కమ్యూనిజం, మస్క్ రోబో యుగం రెండూ సమాజంలో సంపద సమృద్ధిని బలంగా నమ్ముతాయి. మార్క్స్ దృష్టిలో ఉత్పత్తి వనరులు సామాజిక నియంత్రణలో ఉంటాయి. శ్రామిక శక్తి ద్వారా సృష్టించే సంపద సమానంగా పంపిణీ అవుతుంది. మస్క్ దృష్టిలో, రోబోలు, ఏఐ అనే సాంకేతికతలు ఉత్పత్తిని ఆకాశానికి చేర్చి ఆ సంపదను సమాజానికి పంచుతాయి. ఈ రెండు విధానాలూ అసమానతలను తగ్గించి ఆర్థిక వ్యవస్థకు కొత్త నిర్వచనాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తాయి. మార్క్స్ శ్రమ దోపిడీని అంతం చేయడానికి ఉత్పత్తి వనరుల సామాజికీకరణ గురించి మాట్లాడితే, మస్క్ రోబో ఆధారిత ఉత్పాదకత ద్వారా అసమానతలను అధిగమించాలని చెబుతున్నాడు.

రోబో సంపద: టెక్ దిగ్గజాల గుప్పిట్లోనా?
సంపద సృష్టి సాంకేతికంగా రోబోల చేతుల్లోకి వెళితే… పంపిణీపై నియంత్రణ కొద్దిమంది టెక్ దిగ్గజాల చేతుల్లో కేంద్రీకృతమయ్యే ప్రమాదం ఉంది. మార్క్స్ పెట్టుబడిదారీ విధానంలో ఉత్పత్తి వనరులపై కొద్దిమంది గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించాడు. మస్క్ ఊహించిన రోబో యుగంలో టెస్లా వంటి సంస్థలు రోబోలను, ఏఐని నియంత్రిస్తే సంపద అసమానంగా పంచే అవకాశం ఉంది. ఈ పరిస్థితి మార్క్స్ హెచ్చరించిన పెట్టుబడిదారీ లోపాలకే దర్పణంలా నిలుస్తుంది. దీనినే విశ్లేషకులు ‘పోస్ట్-లేబర్ ఒలిగార్కీ’ అని పిలుస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రోబో పన్ను, సంపద పునఃపంపిణీ వంటి కఠినమైన రాజకీయ, ఆర్థిక విధానాలు అవసరం.

శ్రమ బంధమా? స్వేచ్ఛా జీవితమా?
పని, సంపద మధ్య సంబంధాన్ని పునర్మించాలని మార్క్స్, మస్క్ ఇద్దరూ కోరుకున్నారు. మార్క్స్ దృష్టిలో పని మనిషి సామర్థ్యాన్ని, గుర్తింపును వ్యక్తం చేస్తే… మస్క్ ప్రపంచంలో పని అనవసరం. మనిషి కళలు, ఆవిష్కరణలు, అంతరిక్ష పరిశోధనల వైపు మళ్లుతాడని ఆయన ఊహిస్తున్నారు. మస్క్ ప్రతిపాదించిన సర్వసాధారణ గొప్ప ఆదాయం మనిషికి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చినా ఆ ఆదాయం ప్రభుత్వాలు లేదా టెక్ సంస్థలపై ఆధారపడటాన్ని సృష్టిస్తుంది. ఇది మనిషిని స్వతంత్రుడిని చేయకుండా కొత్త రకమైన ఆధారపడటాన్ని సృష్టిస్తుందని, ఇది మార్క్స్ శ్రమ దోపిడీగా చూసిన దానికి మరో రూపమని విమర్శకులు అంటున్నారు.

విప్లవం, సాంకేతికత దారులు
మార్క్స్ సామాజిక విప్లవం ద్వారా సమానత్వాన్ని ఆశిస్తే, మస్క్ అత్యున్నత సాంకేతిక విప్లవం ద్వారా దాన్ని సాధించాలని చూస్తున్నాడు. మార్క్స్ ఆలోచన సామాజిక ఆధారితమైతే, మస్క్ ఆలోచన సాంకేతిక సామర్థ్యంపై నిలుస్తుంది. మస్క్ రోబో యుగం స్వర్గమా లేక సంక్షోభమా అనేది సాంకేతిక, రాజకీయ, సామాజిక సవాళ్లను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటుందనే దానిపై ఆధారపడి ఉంటుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *