స్మార్ట్ సర్జరీ.‌‌.. ‘బ్రెస్ట్’ రికవరీ- రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స

  • ఆంకోప్లాస్టీ… వండర్ థెరపీ!
  • రొమ్ము తొలగించకుండానే చికిత్స
  • ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో అందుబాటు
  • రోగులకు వరమంటున్న డా. రమేష్ మాటూరి
  • అక్టోబర్ రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల
  • ‘సహనం వందే’కు ప్రత్యేక ఇంటర్వ్యూ

సహనం వందే, హైదరాబాద్:
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక విధానాలను ఎంఎన్ జే క్యాన్సర్‌ ఆసుపత్రి అందుబాటులోకి తెచ్చింది. రొమ్ము క్యాన్సర్‌కు పెరుగుతున్న ముప్పు, చికిత్సలో నూతన విధానాలు, ప్రభుత్వ ఆసుపత్రుల పాత్రపై ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి సర్జికల్ ఆంకాలజీ అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ రమేష్‌ మాటూరితో ‘సహనం వందే’ ప్రత్యేక ఇంటర్వ్యూ…

సహనం వందే: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ ప్రమాద తీవ్రత ఎలా ఉంది? దీని పెరుగుదల ఆందోళన కలిగిస్తోందా?

డాక్టర్ రమేష్: భారతీయ మహిళలకు రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ఒకప్పుడు గర్భాశయ క్యాన్సర్ తర్వాత రెండో స్థానంలో ఉండేది. కానీ నేడు భారతదేశంలో మహిళల్లో కనిపించే అన్ని క్యాన్సర్లలో సుమారు పాతిక శాతం వాటాతో ఇది మొదటి స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం సుమారు 1,92,000 మంది మహిళలకు కొత్తగా ఈ వ్యాధి నిర్ధారణ అవుతుండగా… దాదాపు 98,000 మంది మహిళలు దీని కారణంగా మరణిస్తున్నారు. ఈ పెరుగుదల చాలా ఆందోళనకరం.

ఆంకోప్లాస్టీ ప్రత్యేక చికిత్స టీం సభ్యులతో డాక్టర్ రమేష్ మాటూరి

సహనం వందే: చాలా మంది భారతీయ మహిళలు వ్యాధి ముదిరిన తర్వాత చికిత్సకు వస్తున్నారని తెలుస్తోంది. ఈ ఆలస్యానికి ప్రధాన కారణాలు ఏమిటి?

డాక్టర్ రమేష్: దురదృష్టవశాత్తు చాలా మంది భారతీయ మహిళలు వ్యాధి ముదిరిన తర్వాత చివరి దశలోనే చికిత్స కోసం వస్తున్నారు. పాశ్చాత్య దేశాలలోలాగా క్యాన్సర్ రొమ్ముకే పరిమితమైన చిన్న దశలో ఇక్కడ గుర్తించడం లేదు. నగరాలలోనే ఎక్కువ క్యాన్సర్ కేంద్రాలు ఉండటం వల్ల ఆసుపత్రికి చేరుకోవడంలో ఆలస్యం జరుగుతోంది.

సహనం వందే: పాశ్చాత్య మహిళలతో పోలిస్తే మన మహిళల్లో చికిత్స తర్వాత మనుగడ రేటు తక్కువగా ఉండటానికి అసలు కారణం ఏమిటి?

డాక్టర్ రమేష్: పాశ్చాత్య దేశాల మహిళలతో పోలిస్తే భారతీయ మహిళలు చికిత్స తర్వాత తక్కువ మనుగడ రేటును కలిగి ఉండటానికి ప్రధాన కారణం ఆధునిక మందుల లభ్యతే. ప్రభుత్వ రంగంలోని అన్ని క్యాన్సర్ ఆసుపత్రులలో ఇమ్యునోథెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి అత్యాధునిక మందులు ఇంకా అందుబాటులో లేవు. ఎంఎన్ జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ వంటి కొన్ని ఆసుపత్రులు మాత్రమే రోగులందరికీ ఉచితంగా అత్యంత ఆధునిక మందులను అందిస్తూ నయం చేస్తున్నాము.

సహనం వందే: రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఎంఎన్ జే ఆసుపత్రి ప్రవేశపెట్టిన వినూత్న, అత్యాధునిక చికిత్సా విధానం గురించి వివరించగలరు?

డాక్టర్ రమేష్: ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో మేము ఆంకోప్లాస్టీ అనే రొమ్ము సంరక్షణ శస్త్రచికిత్సను అందించడంలో ముందున్నాము. ఈ పద్ధతిలో క్యాన్సర్‌కు చికిత్స చేస్తూనే మొత్తం రొమ్మును తొలగించకుండా ఉంచుతున్నాం. ఆధునిక ప్లాస్టిక్ సర్జరీ సూత్రాలను ఉపయోగించి కణితిని తొలగించిన తర్వాత రోగి సొంత శరీర కణజాలాలను ఉపయోగించి రొమ్మును పునర్నిర్మిస్తాము. దీని ఫలితంగా పునర్నిర్మించిన రొమ్ము దాదాపు సాధారణ రొమ్ము మాదిరిగానే కనిపిస్తుంది‌. ఇది రోగికి మానసికంగా ఎంతో సంతృప్తిని ఇస్తుంది. మేము ఇప్పటికే వందల మంది రోగులకు ఈ శస్త్రచికిత్స చేశాము.

సహనం వందే: మన రాష్ట్రంలో చాలా మంది మహిళలు ఇంకా రొమ్మును తొలగించుకుంటున్నారు. ఈ అధునాతన పద్ధతులపై సర్జన్లకు శిక్షణ ఇవ్వడానికి ఎంఎన్ జే ఆసుపత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?

డాక్టర్ రమేష్: దురదృష్టవశాత్తు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారిలో సుమారు 90 శాతం మంది మహిళలు తమ రొమ్ములను తొలగించుకుంటున్నారు. దీనికి సరైన శిక్షణ, బోధనా అవకాశాలు లేకపోవడమే కారణం. ముంబైలోని టాటా క్యాన్సర్ ఆసుపత్రిలో 40 శాతం మంది రోగులు రొమ్ములను తొలగించుకోవడం లేదు. ఈ అంతరాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి త్వరలో బ్రెస్ట్ ఆంకోప్లాస్టీ పద్ధతుల్లో ఎక్కువమంది సర్జన్లకు శిక్షణ ఇవ్వడానికి ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది.

సహనం వందే: క్యాన్సర్ రోగులకు చికిత్సను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకుంది?

డాక్టర్ రమేష్: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఎంఎన్ జే ఆసుపత్రి ఇటీవల ‘జిల్లా క్యాన్సర్ నియంత్రణ కార్యక్రమం’ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా రోగులు తమ గ్రామం లేదా పట్టణానికి దగ్గరగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోనే క్యాన్సర్ చికిత్సను కొనసాగించవచ్చు. ఇది పేద రోగులకు మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి చికిత్స మరింత త్వరగా, సులభంగా అందుబాటులోకి రావడానికి దోహదపడుతుంది.

సహనం వందే: పాశ్చాత్య దేశాల కంటే మన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ చిన్న వయస్సులోనే వస్తోంది. ఇది కుటుంబ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

డాక్టర్ రమేష్: భారతీయ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ సాధారణంగా పాశ్చాత్య దేశాల మహిళల కంటే తక్కువ వయస్సులోనే వస్తుంది. మన దగ్గర చాలా మందికి 50 ఏళ్ల కంటే తక్కువ వయస్సులోనే ఇది నిర్ధారణ అవుతుంది, పాశ్చాత్య దేశాలలో సాధారణ వయస్సు అరవై కంటే ఎక్కువ. చిన్న వయస్సులో క్యాన్సర్ వస్తే అది మరింత దూకుడుగా ఉండటంతో పాటు కుటుంబంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లలు తమ తల్లి సంరక్షణను కోల్పోతారు. భర్త ఆర్థికంగా ఇబ్బందులు పడవచ్చు. మహిళ ఉద్యోగం చేస్తుంటే అది కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

సహనం వందే: క్యాన్సర్ శస్త్రచికిత్స తర్వాత మహిళలు ఎదుర్కొనే భావోద్వేగ సమస్యలను తగ్గించడానికి మీ ఆసుపత్రి ఎలాంటి మానసిక సహకారం అందుచే కార్యక్రమాలను చేపడుతుంది?

డాక్టర్ రమేష్: ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స భావోద్వేగ ప్రభావాన్ని ఎదుర్కోవడంలో మహిళలకు సాయపడటానికి మేము హైదరాబాద్ విశ్వవిద్యాలయంతో కలిసి ఒక అధ్యయనాన్ని ప్రారంభించాము. రొమ్ము క్యాన్సర్ మహిళలకు మానసిక సలహా ఇవ్వడం దీని లక్ష్యం. క్యాన్సర్ శస్త్రచికిత్స కారణంగా మహిళలు, వారి భర్తల మధ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో కూడా మేము అధ్యయనం చేస్తున్నాము.

సహనం వందే: వ్యాధిని ముందుగా గుర్తించడానికి, పునరావృతం కాకుండా నిరోధించడానికి ఎంఎన్ జే ఆసుపత్రిలో జరుగుతున్న పరిశోధనల గురించి తెలుసుకోవచ్చా?

డాక్టర్ రమేష్: ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో పరిశోధన అనేది చాలా ముఖ్యమైన భాగం. వ్యాధిని ముందుగా గుర్తించడంలో, అది మళ్లీ రాకుండా నిరోధించడంలో సహాయపడుతుందో లేదో చూడటానికి మేము హైదరాబాద్ విశ్వవిద్యాలయంతో కలిసి ‘సీటీడీఎన్ఏ’ అనే ప్రసరణ క్యాన్సర్ కణాలపై ఒక అధ్యయనాన్ని ప్రారంభించాము. అలాగే మా క్యాన్సర్ రోగుల పిల్లలకు భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా రక్షించడానికి, జన్యువులలో లోపాలను గుర్తించడంలో సహాయపడటానికి రొమ్ము క్యాన్సర్ రోగులపై జన్యు అధ్యయనాన్ని కూడా చేస్తున్నాము.

సహనం వందే: పోలియో నిర్మూలనలో ప్రభుత్వ నిబద్ధత గొప్ప విజయం సాధించింది. అదే తరహాలో క్యాన్సర్ ముప్పును నియంత్రించడానికి ఎలాంటి చొరవ అవసరమని భావిస్తున్నారు?

డాక్టర్ రమేష్: పోలియో నిర్మూలనకు ప్రభుత్వ నిబద్ధత ఒక గొప్ప విజయాన్ని సాధించింది, ప్రణాళికాబద్ధమైన పరిపాలన ఏమి చేయగలదో అది చూపించింది. అదే స్ఫూర్తితో రొమ్ము క్యాన్సర్ వంటి ముప్పును నియంత్రించడానికి కూడా ఇలాంటి ప్రణాళికాబద్ధమైన ప్రభుత్వ కార్యక్రమాలు, చొరవ అవసరం. ప్రభుత్వ ఆధ్వర్యంలో విస్తృతమైన స్క్రీనింగ్ కార్యక్రమాలు, అత్యాధునిక చికిత్సలను ఉచితంగా అందరికీ అందించడం వంటివి చేస్తేనే ఈ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించగలం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *