బ్రిటీషర్ల కంటే ఇస్లామీస్ డేంజర్ – యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు

  • రాజకీయ ఇస్లాం దాడుల చరిత్ర విస్మరణ
  • దేశ చరిత్రనే తిరగరాయాలనే వాదనపై చర్చ

సహనం వందే, లక్నో:
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన సంచలన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గోరఖ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం ఆయన రాజకీయ ఇస్లాంను బ్రిటిష్, ఫ్రెంచ్ సామ్రాజ్యవాదంతో పోల్చడమే కాకుండా… సనాతన ధర్మాన్ని బలహీనపరిచేందుకు దాని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందనే ఆరోపణలు చేశారు. గోరఖ్‌పూర్ వేదికగా యోగి సంధించిన ఈ విమర్శనాస్త్రాలు దేశ ప్రజల దృష్టిని మతపరమైన విభజనల వైపు మళ్లిస్తున్నాయనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో మొదలైంది. బ్రిటిష్, ఫ్రెంచ్ సామ్రాజ్యవాదంపై చర్చలు జరుగుతున్నా… రాజకీయ ఇస్లాం దాడుల చరిత్రను విస్మరించడం సమాజానికి దుర్మార్గం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏకంగా దేశ చరిత్రనే తిరగరాయాల్సిన అవసరం ఉందనే ప్రమాదకర సంకేతాలు ఇస్తున్నాయి. చత్రపతి శివాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్ వంటి వీరులు రాజకీయ ఇస్లాం దాడులను ఎదుర్కొన్నారనే ప్రస్తావన… చరిత్రను కేవలం మత కోణం నుంచే చూడాలనే బలవంతపు వాదనను తెరపైకి తెచ్చింది.

రామమందిరంలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర అమోఘం
అయోధ్యలోని రామమందిర నిర్మాణాన్ని ప్రస్తావించిన యోగి ఆదిత్యనాథ్, ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ నిబద్ధతను పొగడటం వెనుక స్పష్టమైన రాజకీయ కోణం కనిపిస్తోంది. కాంగ్రెస్, సమాజవాదీ పార్టీ, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు నిర్మాణాన్ని వ్యతిరేకించినప్పటికీ… ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు లాఠీ దెబ్బలను, తూటాలను ఎదుర్కొని ముందుకు సాగారంటూ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆలయ నిర్మాణంలో ఆర్‌ఎస్‌ఎస్ పరిత్యాగం, సంకల్పం ఉన్నాయని పేర్కొనడం ద్వారా యోగి ఆర్‌ఎస్‌ఎస్‌కు, దాని అనుబంధ సంస్థలకు రాజకీయ మైలేజీనిచ్చే ప్రయత్నం చేశారనేది సుస్పష్టం. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హిందూ ఓటు బ్యాంకును ఏకీకృతం చేసే ప్రయత్నంలో ఈ వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా భాగమైనట్లు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

హలాల్ నిషేధం… ఆర్థిక-మత క్రీడ
రాజకీయ ఇస్లాం ప్రభావం మతమార్పిడి, లవ్ జిహాద్, ఉగ్రవాదం వంటి రూపాల్లో ఇంకా కొనసాగుతోందంటూ హలాల్ ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయం వీటికి ఉపయోగపడుతోందనే యోగి ఆదిత్యనాథ్ ఆరోపణలు మరో తీవ్రమైన వివాదానికి తెరలేపాయి. ఉత్తరప్రదేశ్‌లో హలాల్ ధ్రువీకరణ ఉత్పత్తుల అమ్మకంపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని చట్టం, సామాజిక సామరస్యం కాపాడేందుకు చేసిన చర్యగా ఆయన సమర్థించుకోవడం ముస్లిం సమాజాన్ని ఆర్థికంగా అణగదొక్కే ప్రయత్నంగా కనిపిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఒక నిర్దిష్ట మత సమూహాన్ని లక్ష్యంగా చేసుకుని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం, ఆ ఆదాయాన్ని ఉగ్రవాదంతో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న తలెత్తుతోంది. ఇది పూర్తిగా ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా మైనారిటీలపై జరుగుతున్న దాడి అని విమర్శకులు దుయ్యబడుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *