- ముంబై, ఢిల్లీలలోని అగ్రశ్రేణి బ్రాండ్లు తయారీ
- దీపావళికి సరికొత్త స్వీట్ సొబగు
సహనం వందే, న్యూఢిల్లీ:
దీపావళి పండుగకు సాంప్రదాయ భారతీయ మిఠాయిలు తమ పాత రూపాన్ని వదిలి సరికొత్త శైలిలో మెరుస్తున్నాయి. ఈసారి మార్కెట్లోకి వచ్చిన శ్రేష్ఠమైన మిఠాయిలు కేవలం రుచిని మాత్రమే కాక అపారమైన విలాసాన్ని కూడా అందిస్తున్నాయి. ముంబై, ఢిల్లీలలోని అగ్రశ్రేణి బ్రాండ్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టి ‘స్వర్ణ ప్రసాదం’, గులాబీ కాజు కత్లీ, హాజెల్‌నట్ బేసన్ లడ్డూ వంటి సృజనాత్మక రుచులతో దీపావళి సంబరాలకు ప్రత్యేక టచ్ ఇస్తున్నాయి.

‘లక్ష’ణమైన స్వర్ణ ప్రసాదం…
సాధారణ స్వీట్ల రోజులు ఇక ముగిశాయి. దీపావళి మిఠాయి ఇప్పుడు శ్రేష్ఠమైన స్థాయికి చేరింది. ముఖ్యంగా కిలోకు ఏకంగా రూ.1.11 లక్షల విలువైన స్వర్ణ ప్రసాదం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మిఠాయి కేవలం రుచి కోసం మాత్రమే కాదు… దాని అద్భుతమైన తయారీ విధానం… అరుదైన పదార్థాల ఎంపికతో ప్రత్యేకతను సంతరించుకుంది.
కాజు కత్లీకి గులాబీ వాసన…
తరతరాలుగా ఇష్టపడే కాజు కత్లీ ఈసారి గులాబీ రుచితో సరికొత్త ఆకర్షణగా మారింది. గులాబీ రుచి అద్దిన ఈ కాజు కత్లీ నోటిలో వేయగానే కరిగిపోతూ రుచి ప్రియులను కొత్త ఆనందంలో ముంచెత్తుతోంది. అదేవిధంగా హాజెల్‌నట్ బేసన్ లడ్డూ ఈ దీపావళికి మరో కొత్త రుచిని పరిచయం చేసింది. సంప్రదాయ బేసన్ పిండి రుచికి విదేశీ హాజెల్‌నట్ సుగంధాన్ని జోడించి తయారుచేసిన ఈ లడ్డూ రుచి ప్రియులను కట్టిపడేస్తోంది.
సంప్రదాయానికి ఆధునిక టచ్…
ముంబై, ఢిల్లీలోని ఖోయా, మనం,టాటా స్టార్‌బక్స్ వంటి ప్రముఖ బ్రాండ్లు దీపావళి మిఠాయిలకు ఆధునిక శైలిని అద్ది సరికొత్త రూపం ఇస్తున్నాయి. కుంకుమ లాటె, వైట్ చాక్లెట్ ఆమ్ పాపడ్ బర్ఫీ వంటి ప్రత్యేకమైన రుచులు పండుగ స్వీట్లకు ఆధునికతను జోడిస్తున్నాయి. ఈ విభిన్న రుచులు దీపావళి వేడుకలను మరింత రంగులమయంగా మార్చి సంప్రదాయ రుచులకు కొత్త ఒరవడిని అందిస్తున్నాయి.
రుచుల సమ్మోహనంలో మునిగిపోవడమే…
దీపావళి అంటే దీపాలు, టపాసుల వెలుగుల సంబరం మాత్రమే కాదు… రుచికరమైన మిఠాయిల ఉత్సవం కూడా. ఈ సంవత్సరం మార్కెట్‌ను ముంచెత్తిన శ్రేష్ఠమైన మిఠాయిలు ఈ వేడుకను మరింత ఉత్కంఠభరితం చేశాయి. సంప్రదాయం, ఆధునికత కలగలిసిన ఈ స్వీట్లు దీపావళి శోభను ఇనుమడింపజేస్తున్నాయి. మరి ఈ సరికొత్త రుచుల సమ్మోహనంలో మునిగిపోవడానికి ఇంకా ఆలస్యం ఎందుకు?