‘రాజీవ్’ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) – 1984 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు

  • ఇందిరా గాంధీలో హిందుత్వం చూసిన సంఘ్
  • ‘ఇండియా టుడే’ సంచలనాత్మక కథనం
  • ఆర్ఎస్ఎస్ మద్దతుతోనే హస్తానికి 414 సీట్లు
  • ఎమర్జెన్సీలో నిషేధం… తర్వాత ఇందిరా సాఫ్ట్

సహనం వందే, న్యూఢిల్లీ:
1984 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రికార్డు స్థాయిలో 414 సీట్ల విజయాన్ని అందించింది కేవలం ఇందిరా గాంధీ సానుభూతి మాత్రమే కాదు… ఆ విజయం వెనుక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మద్దతు ఉందన్న తాజా సమాచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బీజేపీని పక్కనబెట్టి ఇందిర హత్య తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీకి ఆర్ఎస్ఎస్ నాయకత్వం రహస్యంగా చేయూతనిచ్చిన వైనం ఆసక్తికరమైన రాజకీయ మలుపు. బీజేపీ పుట్టి అప్పటికి నాలుగేళ్లు కూడా కాకముందే ఆర్ఎస్ఎస్ ఎందుకు కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది? ఆ రహస్య ఒప్పందం కథేమిటి? ఈ విషయంపై ప్రముఖ జాతీయ మీడియా ‘ఇండియా టుడే’ శుక్రవారం సంచలనాత్మక కథనం ప్రచురించింది.

ఆర్ఎస్ఎస్ అగ్రనేతలతో రాజీవ్ భేటీలు
ఇందిరా గాంధీ హత్యతో దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో యువ కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ గాంధీ ఆర్ఎస్ఎస్ అగ్ర నాయకత్వాన్ని రహస్యంగా ఆశ్రయించారు. అప్పటి సర్‌ సంఘచాలక్ బాలాసాహెబ్ దేవరస్, ఆయన సోదరుడు భావురావు దేవరస్‌తో రాజీవ్ ఏకంగా ఆరు రహస్య సమావేశాలు నిర్వహించారు. వాటిలో ఒకటి ఢిల్లీలోని ఒక వ్యాపారవేత్త నివాసంలో జరగడం గమనార్హం. ఈ చర్చల ఫలితంగానే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలంతా ఒక్కటై కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. ఆ సంఘ్ మద్దతుతోనే కాంగ్రెస్ ఏకంగా 49 శాతం ఓట్లతో అత్యధిక మెజారిటీని సొంతం చేసుకుంది. 1980లో ఏర్పాటైన సొంత రాజకీయ వింగ్ భారతీయ జనతా పార్టీని కూడా ఆర్ఎస్ఎస్ ఏమాత్రం పట్టించుకోకపోవడం అప్పటి రాజకీయాల్లో ఓ సంచలనం.

సంఘ్ మనసు మార్చిన ఇందిర ‘హిందుత్వ’
వాస్తవానికి ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్-ఆర్ఎస్ఎస్ సంబంధాలు ఎప్పుడూ సరిగా లేవు. ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్‌పై నిషేధం ఉన్నప్పటికీ బాలాసాహెబ్ దేవరస్ ఇందిరతో సఖ్యత కొనసాగించారు. 1971 యుద్ధ విజయం తర్వాత ఆర్ఎస్ఎస్ గురు గోల్వాల్కర్ సైతం ఇందిరాను అభినందించారు. ఇందిరా తరచూ ఆలయాలు సందర్శించడం, తన రాజకీయాల్లో హిందూ భావజాలాన్ని ప్రదర్శించడం ఆర్ఎస్ఎస్‌కు ఆమెను హిందూ నాయకురాలిగా చూపించింది. ఆమె హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త నానాజీ దేశ్‌ముఖ్ సైతం రాజీవ్ గాంధీకి మద్దతు ఇవ్వాలని బహిరంగంగా పిలుపునివ్వడం, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహంలో అత్యంత కీలక మలుపుగా మారింది.

వాజ్‌పేయి సెక్యులర్ పంథాతోనే ఇలా…
ఆర్ఎస్ఎస్ సొంత సిద్ధాంతాలకు అనుగుణంగా నడవకపోవడమే 1984లో బీజేపీని విస్మరించడానికి ప్రధాన కారణం. బీజేపీ అగ్రనాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి అంతకుముందే 1979లో ఆర్ఎస్ఎస్ హిందూ రాష్ట్ర భావజాలాన్ని బహిరంగంగా విమర్శించారు. ఆయన బీజేపీని హిందుత్వ పార్టీగా కాకుండా సెక్యులర్ గా ముందుకు తీసుకెళ్లాలని గట్టిగా ప్రయత్నించారు. దీనికి విరుద్ధంగా ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ నెమ్మదిగా హిందూ ఆధారిత రాజకీయాల వైపు మళ్లింది. ఈ రాజకీయ లెక్కల మధ్యే ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్లు ఆ కథనం పేర్కొంది.

రాజీవ్ తడబాటు: బాబ్రీ మసీదు
ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్-ఆర్ఎస్ఎస్ సంబంధాలను దెబ్బతీశాయి. 1985 షా బానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును రాజీవ్ ప్రభుత్వం చట్టం ద్వారా రద్దు చేయడం హిందువులను కాంగ్రెస్‌కు దూరం చేసింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికే రాజీవ్ ప్రభుత్వం బాబ్రీ మసీదు తాళాలు తెరిచేందుకు అనుమతినిచ్చింది. ఈ చర్య తాత్కాలికంగా హిందువులను శాంతింపజేసినా రామ జన్మభూమి ఉద్యమానికి బీజం వేసి బీజేపీ అనూహ్యంగా బలపడటానికి దోహదపడింది. ఈ రాజకీయ ఒడిదొడుకులు క్రమంగా కాంగ్రెస్-ఆర్ఎస్ఎస్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోవడానికి కారణమయ్యాయి. 1984లో ఆర్ఎస్ఎస్ మద్దతుతో ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ నేడు అదే సంస్థపై నిషేధం విధించాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *