‘కోట్ల’ విలువలు… కలిశెట్టి కలలు – విజయభాస్కర్ రెడ్డి ఆదర్శాలకు ఫిదా

  • కోట్ల స్వగ్రామం వెళ్లిన ఎంపీ అప్పలనాయుడు
  • రాజకీయ వారసత్వానికి యువ శక్తి నివాళి
  • చదువుకునే రోజుల నుంచే కలిశెట్టి ఆకర్షణ…

సహనం వందే, కర్నూలు:
మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నిబద్ధతతో కూడిన రాజకీయ ప్రస్థానం యువ నాయకులకు ఇప్పటికీ ఒక పాఠ్యపుస్తకమే. విజయనగరం పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు అదే స్ఫూర్తితో అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన కోట్ల స్వగ్రామం లద్దగిరిలో పర్యటించి ఆ మహానాయకుడికి ఘన నివాళులు అర్పించారు. డోన్ శాసనసభ్యుడు కోట్ల జై సూర్యప్రకాష్ రెడ్డి నివాసానికి వెళ్లి కోట్ల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కోట్ల రాజకీయ జీవితం తనకు అత్యంత స్ఫూర్తిదాయకం అని… ఆయన నిజాయితీ, నిబద్ధతలే తన రాజకీయ ఆశయాలకు పునాది వేశాయని ఈ సందర్భంగా కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు.

చదువుకునే రోజుల నుంచే ఆకర్షణ…
ఆనాటి ముఖ్యమంత్రిగా కోట్ల ధర్మపరిపాలన కలిశెట్టి అప్పలనాయుడును విద్యార్థి దశలోనే బలంగా ప్రభావితం చేసింది. మాజీ మంత్రి గొర్లె శ్రీరాములు నాయుడు వంటి పెద్దల ద్వారా కోట్ల నిజాయితీ, ధైర్యం గురించి విన్న మాటలు ఆయన మనసులో నాటుకుపోయాయి. ఆ స్ఫూర్తి పుణ్యమా అని విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్న కలిశెట్టి.. నేడు విజయనగరం ఎంపీగా ప్రజాసేవ చేస్తున్నారు. కోట్ల వంటి గొప్ప నాయకులు తనకు మార్గదర్శకులుగా నిలవడం గొప్ప విషయమని ఆయన నొక్కి చెప్పారు.

లద్దగిరిలో సేవా తత్వ సందేశం…
లద్దగిరి గ్రామంలోని కోట్ల నివాసం, ఆయన జీవన విధానాన్ని చూసిన ఎంపీ కలిశెట్టి తీవ్ర ఆలోచనలో పడ్డారు. కోట్ల జీవితంలోని ఒడిదుడుకులు, విజయాలు, ఆనందకర క్షణాలను జై సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబంతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్శన తనలో కొత్త శక్తిని నింపిందని ఆయన వ్యాఖ్యానించారు. గొప్ప నాయకుల సేవా తత్వాన్ని యువ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని కలిశెట్టి ఆకాంక్షించారు. కోట్ల చూపిన బాటలో ప్రజాసేవ చేయడమే తన తుది లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

గ్రామీణ నేపథ్యమే అసలైన బలం…
లద్దగిరి పర్యటనలో భాగంగా అక్కడి పాడి పంటలు, పశుసంపద, ధాన్యాగారాలను పరిశీలించిన కలిశెట్టి అప్పలనాయుడు… తెలుగు సంప్రదాయాలు, పూర్వీకుల జీవన విధానం గుర్తుకు రావడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి జాతీయ స్థాయి నాయకత్వం వహించిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రస్థానం యువతకు గొప్ప ఆదర్శమని తెలిపారు. ఈ పర్యటన తన రాజకీయ దృక్పథాన్ని మరింత బలోపేతం చేసిందని విజయనగరం ఎంపీ వెల్లడించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *