- బెంగాల్, బెంగుళూరుల్లో అమ్మాయిల బెంగ
- కోల్ కతాలో మెడికో… బెంగళూరులో ఇంజనీర్
- బెంగాల్, యూపీలలో అత్యధికంగా కేసులు
- శిక్షల నుంచి తప్పించుకుంటున్న మృగాళ్లు
సహనం వందే, న్యూఢిల్లీ:
వారం రోజుల క్రితం కోల్ కతాలో మెడికో పై అత్యాచారం… ఆ సంఘటన మరువకముందే బెంగళూరులో తాజాగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక విద్యార్థినిపై క్యాంపస్ టాయిలెట్స్ లోనే అత్యాచారం చేసిన ఘటన నివ్వెర పరుస్తుంది. అంతకుముందు ఆరు నెలల క్రితం కోల్ కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో రేప్… హత్య జరిగింది. ఇలా కాలేజీ క్యాంపస్ లు అత్యాచారాలకు నిలయాలుగా మారడంపై దేశం యావత్తు ఉలిక్కిపడింది. ఇంత జరుగుతుంటే నిందితులు మాత్రం భయం లేకుండా దర్జాగా తిరుగుతున్నారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండటం దురదృష్టం.

టాప్ లో ఉత్తరప్రదేశ్...
దేశంలో మహిళలపై నేరాలకు సంబంధించి పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అగ్రస్థానాల్లో కొనసాగడం అత్యంత ఆందోళనకరం. ఉత్తరప్రదేశ్‌లో 2023లో 66,381 కేసులు నమోదై దేశంలోనే తొలి స్థానంలో నిలవగా… పశ్చిమ బెంగాల్‌లో ప్రతి ఏటా ఈ సంఖ్య 30 వేలు దాటుతోంది. ఈ రాష్ట్రాల్లో దేశంలోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. బెంగాల్‌లో 2021 నుంచి 2023 వరకు యాసిడ్ దాడులు, అత్యాచార యత్నాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ అత్యాచారాలు, దోపిడీలు, భర్తల వేధింపుల వంటి దారుణ చర్యలతో దేశంలో 15 శాతం కేసులను తన ఖాతాలో వేసుకుంది.
మచ్చుకైనా లేని శిక్ష… నేరగాళ్లకు అభయం
ఒకవైపు మహిళలపై నేరాలు పెరుగుతుంటే… మరోవైపు నేరగాళ్లకు శిక్ష పడే శాతం అసాధారణంగా పడిపోవడం న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లేలా చేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో 2017 నుంచి 2023 వరకు సగటు శిక్ష రేటు కేవలం ఐదు శాతం మాత్రమే. 2023లో దాదాపు 19 వేల కేసుల్లో దోషులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఇది దేశంలోనే అత్యధికం. 36 రాష్ట్రాల్లో ఈ రాష్ట్రం 35వ స్థానంలో ఉండటం పాలనకు మాయని మచ్చ. అత్యధిక కేసులు నమోదవుతున్నా శిక్షలు పడకపోవడం నేరగాళ్లకు మరింత ధైర్యాన్ని ఇస్తోంది.
3 లక్షల మహిళా నేరాల కేసులు పెండింగ్…
న్యాయం ఆలస్యం అయితే న్యాయం నిరాకరించినట్లే. ఈ సూత్రానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ రెండు రాష్ట్రాల్లోని పెండింగ్ కేసుల సంఖ్య ఉంది. 2023 చివరి నాటికి పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై నేరాలకు సంబంధించి ఏకంగా 3.07 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది దేశంలోనే అత్యధికం. ఉత్తరప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. విచారణలు ముందుకు సాగకపోవడం, శిక్షలు అమలు కాకపోవడం వల్ల ఈ కేసులు ఏళ్ల తరబడి మూలుగుతున్నాయి.
దళిత మహిళలపై రెట్టింపు హింస
సాధారణ మహిళల కంటే దళిత మహిళల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వీరు కుల వివక్షతో పాటు లింగ వివక్షనూ ఎదుర్కొంటున్నారు. షెడ్యూల్డ్ కులాలపై నేరాల్లో అత్యాచారాలు, అవమానాలు ప్రధానమైనవి. దళిత మహిళలపై నేరాల్లో ఉత్తరప్రదేశ్ 14,311 కేసులతో మొదటి స్థానంలో ఉంది. 2018 నుంచి 2022 వరకు ఈ నేరాలు 35 శాతం పెరిగాయి. దళిత మహిళలపై నేరాల శిక్ష రేటు 28.35 శాతం కంటే తక్కువగా ఉండటం దారుణం.
మాటలకే పరిమితమైన సీఎంలు…
ఇటీవల బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలు మహిళల భద్రతను రాజకీయ ఆయుధంగా మార్చాయి. దుర్గాపూర్ అత్యాచార ఘటన తర్వాత మహిళలు రాత్రి బయటికి వెళ్లకూడదని చెప్పడం ఆమె బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోనూ యోగీ ప్రభుత్వం హత్రాస్, లఖ్నౌ ఘటనల్లో వ్యవహరించిన తీరు… మహిళలు రాత్రి కోచింగ్ సెంటర్లకు వెళ్లకూడదని జారీ చేసిన మార్గదర్శకాలు వారి ఉదాసీన వైఖరిని స్పష్టం చేశాయి.