క్రిస్మస్ సెలబ్రేట్… దీపావళి రిగ్రెట్ – టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీల తీరుపై ఆగ్రహం

  • దీపావళిలో ‘ఐటీ’ సెలవుల దహనం
  • క్రిస్మస్ కు ప్రాధాన్యం… మన పండుగలకు నో

సహనం వందే, న్యూఢిల్లీ:
భారతీయ అతిపెద్ద ఐటీ దిగ్గజాలు తమ ఉద్యోగులపై పండుగల వేళ ఒత్తిడి పెంచుతూ ఆధునిక బానిసత్వానికి పాల్పడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో దీపావళి సెలవులు ఇచ్చేందుకు నిరాకరించడంపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీపావళి సమయంలో టీమ్ సభ్యులందరూ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, సెలవులు మంజూరు చేసేది లేదని మేనేజర్ గ్రూప్ చాట్‌లో స్పష్టం చేసినట్లు ఒక టెక్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.

క్రిస్మస్ ఒకలా… దీపావళి మరోలా
పాశ్చాత్య క్లయింట్ల కోసం పనిచేసే టీసీఎస్ వంటి కంపెనీలు క్రిస్మస్ వంటి విదేశీ పండుగలకు సెలవులు ఇస్తూ… దీపావళి వంటి స్వదేశీ పండుగలకు సెలవులు నిరాకరించడం ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోంది. డిసెంబర్‌లో క్లయింట్లు సైతం తమ పండుగల కారణంగా ప్రాజెక్టులు చేపట్టరు. కాబట్టి ఉద్యోగులకు కూడా సెలవులు సులభంగా లభిస్తాయి. కానీ దీపావళి సమయంలో క్లయింట్లు పని చేయాలని ఆశించడాన్ని కంపెనీలు సాకుగా చూపడం భారతీయ సంస్కృతిని అవమానించినట్టుగా ఉంది. గాంధీ జయంతి రోజున కూడా ఉద్యోగులతో పని చేయించి… అమెరికన్ పండుగలకు కంపెన్సేషన్ ఇవ్వడం ఆధునిక బానిసత్వమేనని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఈ వైఖరి భారతీయ ఉద్యోగులను రెండో తరగతి పౌరులుగా చూస్తున్న తీరును సూచిస్తోంది.

ఇన్ఫోసిస్‌లోనూ అదే తంతు…
టీసీఎస్ తో పాటు ఇన్ఫోసిస్ లోనూ దీపావళి వేళ ఉద్యోగులకు సెలవులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఏడాదికి 15 నుంచి 20 రోజుల పెయిడ్ లీవ్‌లు ఉన్నా పండుగల సమయంలో ప్రాజెక్ట్ అవసరాల పేరుతో సెలవులు మంజూరు చేయడం… తర్వాత రద్దు చేయడం సర్వసాధారణంగా మారింది. 11 ప్రభుత్వ సెలవులతో పాటు 2 ఆప్షన్ హాలిడేస్ మాత్రమే ఉన్నందున పండుగలకు ముందు సరైన ప్రణాళిక లేకపోతే ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రాజెక్ట్ గడువుల కారణంగా సెలవులను కట్టడి చేయడం ఉద్యోగుల వ్యక్తిగత జీవితాన్ని ఛిద్రం చేస్తోంది. పని జీవిత సమతుల్యతను దెబ్బతీసే ఈ విధానాలపై ఉద్యోగులు విమర్శలు గుప్పిస్తున్నారు.

అనారోగ్యంతో ఉన్నా వదలకుండా ఒత్తిడి…
సెలవుల నిరాకరణతో పాటు మేనేజర్ల ఒత్తిడి ఇంకో స్థాయిలో ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులను సైతం కాల్ చేసి పని చేయాలని మేనేజర్లు ఆదేశిస్తున్నారని… టీమ్ సభ్యుల సాయంతోనైనా పనులు పూర్తి చేయించాలని నిబంధనలు పెట్టారని రెడ్డిట్ పోస్ట్ వెల్లడించింది. ఇది కేవలం పండుగలను మాత్రమే కాదు ఉద్యోగుల ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేసే ఒక అమానవీయమైన వైఖరి. ఈ వ్యవహారంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ రంగంలో ఉద్యోగులను కేవలం ఆటగాళ్లుగా, ఉత్పాదక యంత్రాలుగా మార్చేస్తున్న పని సంస్కృతిలోని దారుణానికి ఈ ఘటనలు నిదర్శనం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *