- బెదిరింపులు… సెటిల్మెంట్లు… కంప్లైంట్లు
- మంత్రి సురేఖ ఓఎస్డీ సుమంత్ లీలలు
- అతని అక్రమాలపై ప్రభుత్వ వర్గాల విస్మయం
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాజకీయాల్లో సుమంత్ ఎదుగుదల అధికార దుర్వినియోగానికి, ప్రభుత్వంలోని లొసుగులకు నిలువెత్తు సాక్ష్యం. కాలుష్య నియంత్రణ మండలిలో కాంట్రాక్టు పద్ధతిపై చేరిన ఈయన… మంత్రి కొండా సురేఖ సిఫారసుతో ఏకంగా ఆమె కార్యాలయంలోనే ఓఎస్‌డీగా డిప్యూటేషన్‌పై చేరాడు. కేవలం ఒక్క సంవత్సరంలోనే ఐఏఎస్ అధికారులకు సైతం ఆదేశాలు ఇచ్చే స్థితికి రావడం ఆయన చేతిలో మంత్రి కార్యాలయం మొత్తం బందీ అయిందనడానికి నిదర్శనం. అటవీ శాఖలో బదిలీలు, పదోన్నతుల్లో భారీగా లంచాలు వసూలు చేయడం, సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడడం అతని పెత్తనానికి పరాకాష్ట. సుమంత్, మంత్రి కుమార్తె సుస్మిత పటేల్ క్లాస్‌మేట్ కావడం ఈ అధికార దుర్వినియోగానికి ప్రధాన కారణమైంది.
విలాసవంతమైన జీవితం…
సుమంత్‌పై ఆరోపణలు సామాన్యమైనవి కావు. అవి అవినీతి రంధ్రాలు ఎంత లోతుకు పాతుకుపోయాయో సూచిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులను ఏకంగా గన్‌తో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణ అత్యంత తీవ్రమైంది. కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయాల్లో అక్రమంగా జోక్యం చేసుకోవడం, స్టోన్ క్రషర్ ఆపరేటర్ల నుంచి లంచాలు తీసుకోవడం, మేడారం జాతర నిధుల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడడం వంటి ఫిర్యాదులకు అంతేలేదు. అలాగే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఒక రౌడీ షీటర్ తో కలిసి సెటిల్మెంట్లు చేస్తున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంపల్లిలో విలాసవంతమైన ఇల్లు, ఆడి కారు వంటివి అక్రమ సంపాదనకు రుజువులని భావిస్తున్నారు. ఈ ఆరోపణలు ఉన్నా ఏడాదిపాటు మంత్రి కార్యాలయంలో కొనసాగించడం ప్రభుత్వ నిఘా వైఫల్యానికి నిదర్శనం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలనొప్పులు…
సుమంత్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్గత విచారణ చేశారు. తర్వాత ఉద్యోగం నుంచి తీసేశారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ బృందం అర్ధరాత్రి మంత్రి నివాసానికి చేరుకోవడం తెలిసిందే. అరెస్టు ప్రయత్నానికి వారెంట్ లేకపోవడం, అర్ధరాత్రి దాడి వంటి చర్యలపై మంత్రి కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి సురేఖ కుమార్తె సుష్మిత పటేల్ ఈ చర్యను బీసీలపై రెడ్డి ఆధిపత్య కుట్రగా పేర్కొనడం, ముఖ్యమంత్రి సహా ఇతర మంత్రులు సురేఖను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించడం పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయనడానికి సంకేతం. ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పులుగా తయారయ్యాయి. కాగా గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు కావడం ఈ కలకలాన్ని మరింత పెంచింది. రాబోయే రోజుల్లో సురేఖపై ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న చర్చ జరుగుతుంది.