- మెడికో అత్యాచార సంఘటనపై గళం
- సీఎం మమత వ్యాఖ్యలపై విమర్శల వెల్లువ
- ఎవరి రక్షణ వారిదేనన్న సీఎం వ్యాఖ్యల జ్వాల
సహనం వందే, కోల్ కతా:
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కొరవడ్డాయంటూ బీజేపీ నేతలు మమతా బెనర్జీ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా బీజేపీ మహిళా కార్యకర్తలు వినూత్న నిరసనకు తెరతీశారు.
దుర్గాపూర్ మెడికల్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను అస్త్రంగా చేసుకుని కోల్‌కతా సాల్ట్ లేక్ మెట్రో స్టేషన్ వద్ద మహిళలకు ఎర్ర మిరప పొడి ప్యాకెట్లు పంచారు. ఈ ఆపరేషన్ లాల్ మిర్చి పేరుతో చేపట్టిన ఈ ఆందోళన మమతా పాలనలో మహిళా భద్రత ఎంతగా దిగజారిపోయిందో కళ్లకు కట్టింది. ప్రభుత్వం మహిళల భద్రతను విస్మరించిందని ఇక ఆత్మరక్షణే వారికి దిక్కని బీజేపీ శ్రేణులు నిప్పులు చెరిగారు.

ముఖ్యమంత్రి నోట దుర్బల వ్యాఖ్యలు!
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహిళలు రాత్రి వేళల్లో బయటకు వెళ్లకూడదంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకున్నట్టేనని… ఒక మహిళా ముఖ్యమంత్రి స్వయంగా మహిళల స్వేచ్ఛను పరిమితం చేయాలని సూచించడం హాస్యాస్పదమని బీజేపీ విమర్శించింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను వక్రీకరించారనే వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా బీజేపీ దాన్ని పట్టువిడవకుండా దుయ్యబట్టింది. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని, ముఖ్యమంత్రి మాటలు మమతా పాలనలో మహిళల దయనీయ స్థితిని బహిర్గతం చేస్తున్నాయని ఆరోపించారు.
దుర్గాపూర్ అత్యాచారం… రాజకీయ దుమారం
దుర్గాపూర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారాన్ని సృష్టించింది. ఈ దారుణంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేసినప్పటికీ బాధితురాలికి హాస్టల్ నియమాలు పాటించాలని సూచించడం బీజేపీకి మరో అస్త్రంగా మారింది. ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించడానికి బదులు బాధితులనే నిందించడం దారుణమని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటన మమతా పాలనలో మహిళల భద్రత శూన్యమనే విషయాన్ని స్పష్టం చేస్తోందని విమర్శలు గుప్పించారు.
ఐటీ ఉద్యోగినుల ఆందోళన…
మహిళలు రాత్రి బయటకు వెళ్లకూడదనే మమతా సూచనలు ఉద్యోగినుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. రాత్రి పదిన్నర వరకు పనిచేసే ఐటీ ఉద్యోగినులు ఈ సూచనలను ఎలా పాటించాలని ప్రశ్నిస్తున్నారు. మమతా ప్రభుత్వం వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలని సూచించడం ప్రభుత్వ బాధ్యతను తప్పించుకునే ప్రయత్నంగా బీజేపీ విమర్శించింది. మహిళల స్వేచ్ఛను హరించి సామాజిక సమస్యలపై ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వహించడం రాజకీయంగా బీజేపీకి బలమైన ఆయుధంగా మారింది. టీఎంసీ పాలనలో అత్యాచారాలు, సామాజిక అన్యాయాలు పెరిగిపోయాయని బీజేపీ నిరసనలతో రాజకీయ ఒత్తిడి మరింత పెరిగింది. ఈ మొత్తం వ్యవహారం మమతా ప్రభుత్వానికి రాజకీయ సవాలుగా మారింది.