తెలంగాణ కలెక్టర్… ఏపీ మంత్రికి కనెక్ట్ – ఒక్క ఫోన్ తో పని చేసిపెట్టిన ఉన్నతాధికారి

  • అదే పనిచెప్పిన రాష్ట్ర మంత్రి విజ్ఞప్తి బేఖాతర్
  • ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక కలెక్టర్ తీరు
  • ఏపీ మంత్రి చెప్పారని పనిచేసిన అధికారి
  • కొందరు ఐఏఎస్ అధికారులపై మంత్రుల గరం

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో మంత్రుల ఆదేశాలను పట్టించుకోకుండా అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక జిల్లాలో జరిగిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా అధికారుల వైఖరిపై తీవ్ర చర్చకు దారితీసింది. సినీ పరిశ్రమకు చెందిన ఒక వ్యక్తి తన భూమి వివరాలు సరిచేయడానికి ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ఎన్ని రోజులు గడిచినా సొంత మంత్రి ఆదేశించినా స్పందించని కలెక్టర్… చివరకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రి చేసిన ఒక్క ఫోన్‌ కాల్‌తో వెంటనే పని పూర్తి చేయడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటన రాష్ట్రంలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న అంతరాలను, అధికార దుర్వినియోగాన్ని బహిర్గతం చేసింది. తెలంగాణ మంత్రుల మాటలు పనిచేయని చోట, రాష్ట్ర సరిహద్దు దాటి వచ్చిన ఆదేశానికి కలెక్టర్ ఉత్సాహం చూపడం వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ధరణి రచ్చ… తొలగని సమస్యలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం ధరణి పోర్టల్‌పై ఉన్న వివాదాలను మరింత పెంచింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన ఈ పోర్టల్ భూమి రికార్డులను ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి ఉద్దేశించినా దరఖాస్తుల ఆలస్యం, అవినీతి ఆరోపణలు, తప్పులతో గతంలోనూ రైతులు, పౌరులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధరణి పేరును భూమాతగా మార్చామని ప్రకటించినా క్షేత్ర స్థాయిలో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సొంత మంత్రి ఆదేశించినా స్పందించని కలెక్టర్… ఏపీ మంత్రి ఫోన్ రాగానే హుటాహుటిన పని పూర్తి చేయడం కొందరు ఐఏఎస్ అధికారుల అహంకారాన్ని, అలాగే తెలంగాణ మంత్రుల పట్టు లేమిని ఎత్తి చూపుతోంది. తెలంగాణ మంత్రులు చెప్పినప్పుడు అడ్డు వచ్చిన నిబంధనలు, ఏపీ మంత్రి ఫోన్‌తో అడ్డు రాలేదా అని కొందరు కలెక్టర్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీ ప్రజా ప్రతినిధుల పట్టు…
అధికారుల నిర్లక్ష్యం వల్ల సాధారణ ప్రజల పనులు పెండింగ్‌లో పడటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కలెక్టర్ పేషీలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నీ వెంటనే పరిష్కరించాలని, లేదంటే తమకు కూడా ఏపీ మంత్రితో ఫోన్ చేయించండంటూ ప్రజలు డిమాండ్ చేయడం అక్కడ పరిస్థితి ఎంత గందరగోళంగా ఉందో తెలియజేస్తోంది. అంతేకాదు అనేకమంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఇతర నాయకులు తెలంగాణలో తమ ప్రాబల్యాన్ని కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. హైదరాబాదులో తిష్ట వేసి పనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఐఏఎస్ స్థాయి అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అధికారులను నియంత్రించి, ధరణి సహా పెండింగ్ సమస్యలను పరిష్కరించకపోతే ఈ హాట్ టాపిక్ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ఠకు మరింత నష్టం కలిగించే ప్రమాదం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *