- ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఫ్రాన్స్ పరారు
- నేపాల్ లో మొదలైన ఉద్యమం విశ్వవ్యాప్తి
- ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, పెరూ, కెన్యాల్లోనూ
- అవినీతి, పేదరికంపై డిజిటల్ తిరుగుబాటు
- కోట్ల విలువైన ఖనిజాలున్నా పేదరికంలో జనం
సహనం వందే, మడ్ గాస్కర్:
‘జెన్ జెడ్’ మంటల్లో మడ్ గాస్కర్ అధ్యక్షుడు తిరుగుబాటుతో మడ్ గాస్కర్ అధ్యక్షుడు అండ్రీ రాజోయెలినా దేశం విడిచి పారిపోవడం ప్రపంచ రాజకీయాలను ఉలికిపాటుకు గురి చేస్తున్నాయి. వేలాది మంది యువకులు అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు ఉద్ధృతం చేయడంతో ఆర్మీ కూడా సహకరించింది. సైన్యం మద్దతు కోల్పోయిన రాజోయెలినా రహస్యంగా దేశం వదిలి వెళ్లిపోయాడు. రాజోయెలినా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఒప్పందం చేసుకుని ఫ్రెంచ్ సైనిక విమానంలో పారిపోవడం గమనార్హం. దీంతో ఆ దేశంలో తాత్కాలికంగా సెనేట్ అధ్యక్షుడు జీన్ ఆండ్రే ఎన్‌డ్రెమంజరీ పాలన ప్రారంభమైంది.

జెన్ జెడ్ ఆగ్రహం… పేదరికంపై తిరుగుబాటు
సెప్టెంబర్ 25న మొదలైన ఈ ఉద్యమం కేవలం విద్యుత్, నీటి కొరతల నుంచి అకస్మికంగా అవినీతి, పాలనా వైఫల్యాలు, పేదరికంపై పోరాటంగా మారింది. మడ్ గాస్కర్ లో మూడు కోట్ల మంది జనాభాలో 75 శాతం మంది పేదలు ఉన్నారు. యువతలో నిరుద్యోగం, ఆకలి మంటలు ఈ తిరుగుబాటుకు ప్రధాన ఆయుధమయ్యాయి. 13 ఏళ్ల పాలనలో ఈ ప్రభుత్వం తమవారిని ధనవంతులను చేసుకుంటూ ప్రజలను పేదలుగా మార్చిందని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
1960లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జీడీపీ 45 శాతం పడిపోవడం… వెనిలా, నికెల్, కోబాల్ట్ వంటి ఖనిజాల ద్వారా ఆదాయం వచ్చినా ప్రజలకు చేరకపోవడంతో యువత రోడ్లపైకి వచ్చింది. ఈ పోరాటంలో 22 మంది మరణించినా… యువత వెనక్కి తగ్గకుండా పోరాడి అధ్యక్షుడిని దింపేసింది.
జెన్ జెడ్ తిరుగుబాట్లు…
మడ్ గాస్కర్ లో మొదలైన ఈ జెన్ జెడ్ తిరుగుబాటు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలకు ఊపిరి పోస్తోంది. ఇంతకుముందు నేపాల్‌లో ప్రధానమంత్రి రాజీనామాకు దారితీసిన ఆందోళనలు… మొరాకోలో ప్రజాగ్రహం వంటి సంఘటనలతో ఈ జెన్ జెడ్ తరం ఉద్యమాలు ముడిపడి ఉన్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సమన్వయం చేసుకుంటూ స్థానిక నాయకత్వం లేకుండానే ఈ తిరుగుబాట్లు బలంగా తయారవుతున్నాయి. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, పెరూ, కెన్యా వంటి దేశాల్లో కూడా యువత అవినీతి, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. మడ్ గాస్కర్ తిరుగుబాటు ప్రపంచ రాజకీయాల్లో యువత శక్తిని, డిజిటల్ తిరుగుబాటు సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసింది.