దీపావళికి ’14 లక్షల కోట్ల’ మెరుపులు – ఊహించని స్థాయిలో బిజినెస్

  • 70 కోట్ల మంది కొనుగోళ్లు చేస్తారని అంచనా
  • అందులో రూ. 2 లక్షల కోట్లు కొత్త వాహనాలకే
  • రూ. 3 లక్షల కోట్లు బట్టలు, చెప్పులకు ఖర్చు
  • జీఎస్‌టీ, ఆదాయపు పన్ను తగ్గింపు కారణం
  • అమెజాన్, ఫ్లిప్‌కార్టుల్లో 80 శాతం డిస్కౌంట్లు

సహనం వందే, హైదరాబాద్:
ఈ దీపావళి పండుగ కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కావడం లేదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చే ఉత్సవంగా మారింది. బ్యాంక్ ఆఫ్ బరోడా అంచనాల ప్రకారం… ఈ ఫెస్టివ్ సీజన్‌లో దేశవ్యాప్తంగా జరిగే మొత్తం ఖర్చు రూ.12 లక్షల కోట్ల నుంచి రూ.14 లక్షల కోట్ల మధ్య ఉండనుంది. జీఎస్‌టీ తగ్గింపులు, ఆదాయపు పన్ను ఉపశమనం, తక్కువ వడ్డీ రేట్లు, కోవిడ్ తర్వాత పెరిగిన కొనుగోలు డిమాండ్ వంటి అంశాలు భారీ బిజినెస్ కు ప్రధాన కారణాలుగా నిలిచాయి. దసరా నుంచి క్రిస్మస్ వరకు ఈ జోరు కొనసాగుతూ వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, వాహనాలు, ప్రయాణం, బహుమతుల రంగాల్లో అనూహ్య వృద్ధిని చూపిస్తోంది.

ఆటో మొబైల్ రంగంలో జీఎస్‌టీ 2.0 సర్ప్రైజ్.
జీఎస్‌టీ 2.0 సంస్కరణలు ముఖ్యంగా ఆటోమొబైల్ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. వ్యక్తిగత ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలపై పన్నులు తగ్గడంతో వినియోగదారులు నేరుగా లబ్ది పొందుతున్నారు. ఈ సీజన్‌లో ఆటో రంగంలో రూ.1.5 లక్షల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల విక్రయాలు జరగవచ్చని అంచనా. మారుతి సుజుకి వంటి పెద్ద కంపెనీలు ధరలు తగ్గించి ఆఫర్లు ఇవ్వడంతో షోరూమ్‌లకు కస్టమర్లు పోటెత్తుతున్నారు. పన్ను తగ్గింపు వల్ల ఆదా అయిన డబ్బు వాహనాల కొనుగోలుకే వెళుతూ ఆటో రంగానికి పెద్ద పండుగగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎస్‌యూవీలకు డిమాండ్ పెరగడం విశేషం.

పన్ను ఉపశమనంతో వస్త్ర, ఫుట్‌వేర్ జోష్
ఆదాయపు పన్నులో లభించిన ఉపశమనం మధ్యతరగతి కుటుంబాల కొనుగోలు శక్తిని పెంచింది. దీని ఫలితంగా వస్త్రాలు, పాదరక్షల (ఫుట్‌వేర్) విభాగంలో రూ. 2.8 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్ల విక్రయాలు జరగనున్నాయి. ఈ పెరుగుదలకు ఆన్‌లైన్ అమ్మకాల విస్తరణ, వినియోగదారుల అలవాట్లలో మార్పులు దోహదపడ్డాయి. పన్ను తగ్గింపు నేరుగా ప్రజల జేబుల్లో డబ్బును మిగిల్చి షాపింగ్‌ను మరింత ప్రోత్సహిస్తోంది.

ఈ-కామర్స్… ఎలక్ట్రానిక్స్ బూమ్
తక్కువ వడ్డీ రేట్లు, పెరిగిన కొనుగోలు శక్తి వల్ల ప్రయాణం (ట్రావెల్) రంగంలో రూ.60 వేల కోట్ల నుంచి రూ.70 వేల కోట్ల మేర వ్యాపారం జరగచ్చని అంచనా. అదే సమయంలో ఎలక్ట్రానిక్స్ విభాగం మొత్తం ఖర్చులో 8 శాతం వాటాతో కీలకంగా మారింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలు ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించి స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాల (హోమ్ అప్లయన్స్‌లు) విక్రయాలను భారీగా పెంచాయి. ఈ-కామర్స్ రంగం ఏకంగా 23 శాతం వృద్ధి సాధించి రూ.32 వేల కోట్ల విక్రయాలను దాటింది.

స్వీట్లు, బహుమతులతో రికార్డు షాపింగ్
కోవిడ్ సమయంలో ఆగిపోయిన కొనుగోళ్లు, పండుగ ఉత్సాహం పెరగడంతో బహుమతులు (గిఫ్టింగ్), స్వీట్ల విభాగాలలో భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఆహారం, కిరాణా (ఫుడ్, గ్రాసరీలు) 13 శాతం, బహుమతి వస్తువులు 8 శాతం వాటా పొందాయి. డ్రై ఫ్రూట్స్, స్నాక్స్, ఇంటి అలంకరణ వస్తువుల విక్రయాలు పెరిగాయి. దీపావళి, వివాహాల సీజన్ కారణంగా దాదాపు 70 కోట్ల మంది కొనుగోలుదారులు మార్కెట్‌కు వస్తారని సీఏఐటీ అంచనా వేసింది. ఇది కేవలం ఒక్కసారిగా వచ్చే కొనుగోలు ధోరణి కాదని, నిలకడైన వృద్ధికి సంకేతమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ రికార్డు స్థాయి షాపింగ్ దేశ ఆర్థిక వృద్ధికి సరికొత్త బూస్ట్ ఇవ్వనుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *