బహుజన హక్కుల బలిదానం – బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చుక్కెదురు

  • అగ్రవర్ణాల కుట్రతో కోర్టులో ఆగిన వాటా
  • ఈడబ్ల్యూఎస్ కు లేని పరిమితి దీనికెందుకు?
  • తమిళనాడు తరహా రాజ్యాంగ సవరణ కీలకం
  • రాజకీయంగా బలపడితేనే భవిష్యత్తు

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై హైకోర్టు తాత్కాలిక స్టే విధించడం సామాజిక న్యాయానికి తీవ్ర విఘాతం కలిగించింది. రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న బహుజన సమాజానికి విద్య, ఉద్యోగం, రాజకీయం వంటి రంగాలలో సరైన అవకాశాలు దక్కకుండా చేయాలనే కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతున్నాయన్న సాంకేతిక అంశాన్ని సాకుగా చూపించి బహుజనుల రాజ్యాంగ హక్కులను అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ పరిణామం దేశంలోని అసమానతలను మరింత పెంచుతూ ప్రజాస్వామ్య సూత్రాలనే దెబ్బతీస్తోంది. ఇది కేవలం చట్టపరమైన సమస్య కాదు… బహుజన సమాజాన్ని వెనక్కి నెట్టాలనే ఆధిపత్య కుట్రలో భాగమే.

ఆధిపత్య శక్తుల ఎజెండా…
బీసీలకు రాజకీయ అండ లేకుండా చేయాలనే రహస్య ఎజెండా ఈ స్టే వెనుక ఉంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 జారీ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రకటించింది. అయితే అగ్రవర్ణ ఆధారిత పక్షాలు దీన్ని రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తూ కోర్టుకు వెళ్లాయి. ఈ స్టే వల్ల ఎన్నికలు నిలిచిపోవడం, బీసీ అభ్యర్థుల ఆశలు ఆవిరి కావడం జరిగింది. 50 శాతం సీలింగ్‌ పేరుతో బీసీల హక్కులను దోచుకునే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్లుఎస్) కోటాతో 60 శాతం రిజర్వేషన్‌ పరిమితి దాటినా దానికి లేని అభ్యంతరాలు బీసీల విషయంలోనే ఎందుకు?

పాలక పక్షాల వైఫల్యం…
రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక సమస్యను త్వరగా పరిష్కరించడంలో ఎందుకు ఆలస్యం చేసింది? ఎందుకు బలహీనంగా వ్యవహరించిందనే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర శాసనసభలో బిల్లులు… ఆర్డినెన్స్‌లు ఆమోదించి కేంద్రం వద్దకు పంపినా అవి నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అంశంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? గవర్నర్ ఆమోదం లేకుండా జీవోలు జారీ చేయడం వల్లే ఈ కోర్టు స్టే వచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఆలస్యం, బలహీన వాదనలు యావత్తు బహుజన సమాజాన్ని మోసం చేస్తున్నట్టే కనిపిస్తున్నాయి. తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్‌ను 9వ షెడ్యూల్‌లో చేర్చడానికి అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం బాధ్యతారాహిత్యం.

నిరసన జ్వాల… ఆత్మగౌరవ పోరాటం
హైకోర్టు స్టేకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. బహుజన సంఘాలు, శ్రామిక వర్గాలు ఏకమై ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ పోరాటాలు అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని ఇస్తున్నాయి. సామాజిక న్యాయ శక్తులు రాజకీయ పునరేకీకరణ ద్వారానే ఈ హక్కులను రక్షించుకోగలమని బలంగా విశ్వసిస్తున్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని రక్షించడానికి, దేశంలో ఉన్న అసమానతలను తొలగించడానికి ఈ నిరసనలు కీలకం. ప్రజలు ఐక్యంగా నిలబడితే ఈ కుట్రలు తప్పక విఫలమవుతాయి.

రాజకీయ బలమే కీలకం
ఈ సంక్షోభం యావత్తు బహుజన సమాజానికి ఒక తీవ్ర హెచ్చరిక. 42 శాతం రిజర్వేషన్‌ అమలుకు కేవలం చట్టపరమైన పోరాటాలు మాత్రమే సరిపోవు. 9వ షెడ్యూల్‌లో రిజర్వేషన్‌ను చేర్చడం, కులగణన సర్వేలు నిర్వహించడం, ముఖ్యంగా రాజకీయంగా బలపడడం అత్యవసరం. ఆధిపత్య పార్టీలకు పుట్టగతులు లేకుండా చేయాలి. ఈ పోరాటం ద్వారా మాత్రమే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. లేకపోతే బహుజనులు శాశ్వతంగా అణగారిన వారుగా మిగిలిపోతారు. ఇది కేవలం రిజర్వేషన్ కోసం పోరాటం కాదు… అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం పోరాటం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *