ప్రైవేట్ క్యాబ్… మహిళల ట్రాప్ – యూపీఐ చెల్లింపులతో లీకవుతున్న నంబర్లు

  • ఆ తర్వాత మహిళలకు డ్రైవర్ల మెసేజ్ లు
  • ప్రైవసీ లేని ప్రయాణం… మహిళల భయం
  • భద్రత కల్పించని యూపీఐ ఆన్ లైన్ సంస్థలు
  • ఏం మాత్రం పట్టించుకోని క్యాబ్ కంపెనీలు

సహనం వందే, న్యూఢిల్లీ:
క్యాబ్‌లలో ప్రయాణించే మహిళల భద్రత తీవ్ర ప్రమాదంలో పడింది. ఓలా, ఉబర్, ఇన్‌డ్రైవ్, రాపిడో వంటి ప్రైవేటు రవాణా యాప్‌లు ఎంత గొప్ప భద్రతా హామీలు ఇచ్చినా… డ్రైవర్ల వేధింపులు ఆ హామీల డొల్లతనాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ముఖ్యంగా యూపీఐ ద్వారా డబ్బు చెల్లించడం వల్ల మహిళల వ్యక్తిగత ఫోన్ నంబర్లు డ్రైవర్లకు లీక్ అవుతున్నాయి. దానిని అడ్డుపెట్టుకుని వారు వాట్సాప్ లేదా పేటీఎం వంటి వాటిలో అసభ్యకర సందేశాలు పంపడం… వేధించడం సమస్యగా మారింది. గుర్గావ్‌లో ఒక మహిళ తన క్యాబ్ డ్రైవర్‌కు కేవలం రూ.100 టిప్ ఇవ్వడం ద్వారా తన ప్రైవసీని పూర్తిగా కోల్పోవడం ఈ లోపానికి నిదర్శనం.

టిప్ ఇస్తే వేధింపుల బహుమతి
గుర్గావ్‌లో జరిగిన సంఘటన యూపీఐ వ్యవస్థలో ఉన్న భద్రతా లోపాన్ని ఎత్తి చూపుతోంది. రోడ్డు బ్లాక్ అయినా రీరూట్ చేసి సాయం చేసిన డ్రైవర్‌కు కృతజ్ఞతగా ఒక మహిళ యూపీఐ ద్వారా టిప్ ఇచ్చింది. కానీ ఆ కృతజ్ఞతకు ప్రతిఫలంగా డ్రైవర్ ఆమె నంబర్‌ను తెలుసుకొని నిత్యం వేధించడం మొదలుపెట్టాడు. డ్రైవర్‌ను ఆమె వాట్సాప్‌లో బ్లాక్ చేసినా అతను పేటీఎం ద్వారా వేధింపులను కొనసాగించాడు. ఇంటి వద్ద డ్రాప్ చేసినందున డ్రైవర్‌కు వ్యక్తిగత వివరాలు లీక్ కావడం వల్ల ఆమెలో భయం మరింత పెరిగింది. రెడ్డిట్ వంటి సామాజిక మాధ్యమాల్లో తమ అనుభవాలను పంచుకుంటున్న మహిళలు ఈ యాప్‌ల భద్రతా ఏర్పాట్లు ఎంత బలహీనంగా ఉన్నాయో తెలియజేస్తున్నారు.

డ్రైవర్ల పర్యవేక్షణ… నియంత్రణలో వైఫల్యం
క్యాబ్ యాప్‌లు కేవలం ఎమర్జెన్సీ బటన్, లైవ్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను ఇస్తూ భద్రతకు హామీ ఇస్తున్నాయి. కానీ వాటి ప్రధాన లోపం డ్రైవర్ల బ్యాక్‌గ్రౌండ్ సరిగా చెక్ చేయడం లేదు. కేరళలోని కోచిలో ఒక ఉబర్ డ్రైవర్ ప్రయాణం ముగిసిన తర్వాత మహిళా ప్రయాణికురాలికి వాట్సాప్‌లో… ‘మీరు నన్ను గుర్తు చేసుకుంటున్నారా?’ అని మెసేజ్ పంపి, ‘ఏ స్ప్రే ఉపయోగిస్తున్నార’ని అసభ్యంగా ప్రశ్నించడం యాప్‌ల వైఫల్యానికి తాజా ఉదాహరణ. నోయిడాలో రూట్ మార్చమని అడిగినందుకు డ్రైవర్ ఐదుగురు మహిళలను చంపేస్తానని బెదిరించడం, గుర్గావ్‌లో రాపిడో డ్రైవర్ అనుచిత మెసేజ్‌లు పంపడం వంటివి యాప్‌ల నియామక ప్రక్రియలో లోపాలున్నాయని స్పష్టం చేస్తున్నాయి.

ప్రైవసీ నిబంధనలు గాలికి…
యాప్ సేవలు వినియోగించిన తర్వాత కూడా డ్రైవర్లు మహిళల వ్యక్తిగత వివరాలను సులభంగా పొందగలుగుతున్నారంటే ఈ యాప్‌లలో ప్రైవసీ నిబంధనలు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థమవుతుంది. యూపీఐ ద్వారా చెల్లింపు చేసినప్పుడు మహిళల ఫోన్ నంబర్లు డ్రైవర్లకు చేరడం ప్రైవసీకి తీవ్ర ముప్పు. నిజానికి వ్యక్తిగత సంప్రదింపు సమాచారం లీక్ కాకుండా కేవలం యాప్‌లోనే చాట్ చేసుకునే సౌకర్యం మాత్రమే ఉండాలి. కానీ లాభాల కోసం మహిళల భద్రతను ఈ యాప్‌లు నిర్లక్ష్యం చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తక్షణ చర్యలు అనివార్యం
క్యాబ్ యాప్‌లు, పేటీఎం వంటి యూపీఐ సర్వీసులు ఈ భద్రతా లోపాలను తక్షణమే సరిదిద్దాలి. మహిళల ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి. వేధింపులకు పాల్పడిన డ్రైవర్లకు ప్లాట్‌ఫాం యాక్సెస్ రద్దు చేయడమే కాక వారిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చి మరే ఇతర క్యాబ్ యాప్‌లోనూ పని చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళల భద్రతకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం సైతం కఠిన రెగ్యులేషన్లను తీసుకురావాలి. ప్రైవసీ సెట్టింగ్‌లను మెరుగుపరచకపోతే రోజువారీ ప్రయాణాల్లో మహిళలు మరింత భయంతో బతకాల్సి వస్తుంది. ఈ విషయంలో యాప్‌లు, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే సమాజం మొత్తం వాటిని తిరస్కరించే పరిస్థితి రావడం ఖాయం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *