- గుడిలో పూజలు చేసినందుకు అవమానం
- అధికార నివాసం కేటాయింపులో నిర్లక్ష్యం
- పురాణ్ కుమార్ ఆత్మహత్యపై ఆగ్రహజ్వాలలు
- ఉన్నత స్థాయి వ్యక్తులపై అంతులేని వివక్ష
- మొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి
- ఇలాగైతే సామాన్య దళితుడి పరిస్థితి ఏంటి?
సహనం వందే, న్యూఢిల్లీ:
దేశంలో కులం అనే విషం ఎంత లోతుగా పాతుకుపోయిందో మరోసారి నిరూపించే దారుణ ఘటన ఇది. హర్యానాలో సీనియర్ ఐపీఎస్ అధికారి వై.పురాణ్ కుమార్ ఆత్మహత్య కేవలం ఒక వ్యక్తి విషాదాంతం కాదు. ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ ఒక దళిత అధికారి తన తోటి అధికారుల చేతిలో మానసిక హింసకు, జాతి వివక్షకు ఎలా బలైపోయాడో తెలిపే పచ్చి నిజం. చండీగఢ్‌లోని తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన బలవన్మరణం చెందడం దేశంలోని దళితులు ఎదుర్కొంటున్న అన్యాయానికి పరాకాష్ట. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దీనిని సామాజిక విషంగా అభివర్ణించారు.

డీజీపీ స్థాయి అధికారిపైనే దళిత వివక్ష…
2001 బ్యాచ్ అధికారి రోథక్ రేంజ్ ఐజీగా పనిచేసిన పురాణ్ కుమార్ ఆత్మహత్యకు ముందు రాసిన ఎనిమిది పేజీల లేఖ పోలీసు వ్యవస్థలోని కుల చిత్తడిని బట్టబయలు చేసింది. హర్యానా డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్, రోథక్ ఎస్‌పీ నరేంద్ర బిజర్నియా సహా 11 మంది అధికారులు తనను ఎలా హింసించారో ఆయన వివరంగా రాశారు. 2020లో ఒక గుడిలో పూజలు చేసినందుకు అవమానించడం నుంచి మొదలు అధికారిక వాహనం, అధికారిక నివాసాన్ని రద్దు చేయడం వరకు ప్రతి చిన్న విషయంలోనూ కులం పేరిట తనను అణచివేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటన చూస్తే చట్టాలను అమలు చేయాల్సిన ఉన్నత పోలీసు వ్యవస్థలోనే కుల వివక్ష ఓ నిబంధనగా మారిపోయిందని అర్థమవుతోంది.
పదోన్నతులు… సౌకర్యాల్లో కుల విషం
పురాణ్ కుమార్ తన లేఖల్లో కేవలం అవమానాలను మాత్రమే కాదు… ఎస్సీ అధికారుల పదోన్నతులు, ప్రమోషన్లు, అధికారిక సౌకర్యాల విషయంలో తీవ్ర వివక్ష చూపించారని ఆరోపించారు. 2024లో ముఖ్యమంత్రికి రాసిన లేఖలోనూ ఆయన ఈ కుల వివక్ష గురించి హెచ్చరించారు. ఆ దళిత అధికారికి రావాల్సిన న్యాయమైన గుర్తింపును, అధికారాలను అగ్ర కులాల అధికారులు అడ్డుకున్నారు. దీనివల్ల పోలీసు వ్యవస్థలో పనిచేసే దళిత అధికారులకు ఎంతటి మానసిక ఒత్తిడి ఉంటుందో అర్థమవుతుంది. ఉన్నత పదవి దళితులకు భద్రత ఇవ్వలేకపోతున్నప్పుడు… ఇక సామాన్య దళితుల పరిస్థితి ఊహకందనిది.
న్యాయం కోసం పోరాటం తప్పదు…
పురాణ్ కుమార్ భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారి అమ్నీత్ పి కుమార్ తన భర్త ఆత్మహత్యకు కుట్రపూరిత హింస, ఎస్సీ-ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు చేశారు. చండీగఢ్ పోలీసులు వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు. జాతీయ ఎస్సీ కమిషన్ సైతం ఈ ఘటనపై స్వయంగా విచారణ చేపట్టి నివేదిక కోరింది. ఈ ఆత్మహత్య దేశంలోని దళిత సంఘాలు, రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చాయి. న్యాయం కోసం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిపై ఒత్తిడి చేస్తున్నారు. పురాణ్ కుమార్ మరణం జాతి వివక్షను అంతం చేయడానికి, భారత రాజ్యాంగ విలువలను కాపాడటానికి ప్రతి పౌరుడికి ఒక పిలుపుగా మారాలి.