- 500 రెట్లు అధికంగా డైథిలీన్ గ్లైకాల్ వాడకం
- భారతీయ కంపెనీలపై డబ్ల్యుహెచ్ఓ ఫైర్
- విదేశాలకు పంపిన వాటిపైనా అనుమానాలు
- మరో రెండు బ్రాండ్లలోనూ కల్తీపై మండిపాటు
- ఇప్పటివరకు ఇండియాలో 17 మంది మృతి
- గతంలో పలు దేశాల్లో మన దగ్గు మందు తాగి వందల మంది మృతి
- గాంబియా, ఉజ్బెకిస్థాన్, కామెరూన్ దేశాలలో వందలాది చిన్నారుల బలి
సహనం వందే, న్యూఢిల్లీ:
భారతదేశంలో తయారైన విషపూరితమైన దగ్గు మందు కారణంగా 17 మంది చిన్నారులు కన్నుమూశారు. ఈ ఘోరం జరిగి నెల రోజులు దాటినా ఇంకా మన డ్రగ్ కంట్రోలర్ల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మృతులంతా ఐదేళ్ల లోపు వారే కావడం గుండెలవిసేలా చేస్తోంది
‘కోల్డ్రిఫ్’ అనే ఈ సిరప్‌లో డైథిలీన్ గ్లైకాల్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనం అనుమతించిన పరిమితికి ఏకంగా 500 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు పరీక్షల్లో తేలడం సంచలనం సృష్టిస్తుంది. ఈ విష రసాయనం కిడ్నీలు దెబ్బతీయడం, నరాల సమస్యలు, చివరకు మరణానికి కూడా దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


మరో రెండు బ్రాండ్లలోనూ మళ్లీ అదే విషం…
నిన్నటి విషాదం కళ్లముందే ఉండగానే తెలంగాణ, గుజరాత్ సహా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు మరో రెండు దగ్గు సిరప్‌లను నిషేధించాయి. రెస్పిఫ్రెష్, రిలైఫ్ అనే ఈ సిరప్‌లలో కూడా మృత్యువుకు కారణమైన డైథిలీన్ గ్లైకాల్ ఉన్నట్లు తేలడంతో అధికారులు తక్షణ హెచ్చరికలు జారీ చేశారు. ఒక సిరప్ తయారీదారు సరుకు కేవలం స్థానికంగానే అమ్ముడైందని ప్రభుత్వం చెప్పగా, మిగతా రెండు సిరప్‌లు ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయించినట్టు తెలుస్తోంది. ఇంతటి పెను ప్రమాదం దేశవ్యాప్తంగా విస్తరించినా డ్రగ్ రెగ్యులేటరీ సంస్థలు స్పందించడంలో మాత్రం జాప్యం చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిలదీత
భారతీయ ఔషధాల నాణ్యతను ఈ ఘటన మరోసారి ప్రపంచ దేశాల ముందు పాతాళానికి తోసేసింది. కల్తీ దగ్గు సిరప్ విదేశాలకు కూడా ఎగుమతి అయ్యిందా లేదా అనే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) భారత ప్రభుత్వాన్ని తక్షణమే వివరణ కోరింది. గతంలో గాంబియా, ఉజ్బెకిస్థాన్, కామెరూన్ దేశాలలో వందలాది మంది చిన్నారులు మన దేశ సిరప్‌ల వల్లే మరణించిన చేదు అనుభవం మనకు ఉన్నా ఈసారి కూడా మన ఔషధ తయారీదారులు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించారు. కోల్డ్రిఫ్ సిరప్‌పై ప్రపంచవ్యాప్త ఉత్పత్తిపై హెచ్చరిక జారీ చేయాలా వద్దా అనే దానిపై డబ్ల్యూహెచ్‌ఓ భారత అధికారుల ధ్రువీకరణ కోసం చూస్తోందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
పరీక్షలు చేయకుండానే మార్కెట్‌లోకి…
ఔషధ తయారీదారులు ప్రతి ఒక్క ముడి పదార్థం బ్యాచ్‌ను, తుది ఉత్పత్తిని తప్పనిసరిగా పరీక్షించాలి. కానీ ఇక్కడి తయారీదారులు ఆ నిబంధనలను బేఖాతరు చేశారని డ్రగ్ కంట్రోలర్ జనరల్ రాజీవ్ రఘువంశీనే స్వయంగా ఒప్పుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై చర్యలు తీసుకోకపోగా నాణ్యత లేని మందులు తయారుచేస్తున్న కర్మాగారాలపై మొక్కుబడిగా తనిఖీలు చేపట్టడం ఏమాత్రం సరికాదని ఔషధ రంగ నిపుణులు మండిపడుతున్నారు.
పిల్లల మరణాలకు కారణమైన శ్రేసన్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్ కార్యాలయం, కర్మాగారం మూసివేసి ఉంది. సిరప్ తయారీదారు ఆచూకీ లేకుండా పోయాడు. తమిళనాడులో శిథిలావస్థలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో పడి ఉన్న సిరప్ సీసాలు, కాలిన మందులు, ఘాటైన రసాయన వాసన… మన డ్రగ్ రెగ్యులేషన్ వ్యవస్థ ఎంతటి నిర్లక్ష్యంతో ఉందో తెలియజేస్తున్నాయి. మన దేశ ఔషధ పరిశ్రమ విలువ 50 బిలియన్ డాలర్లకు చేరినా, దాని కీర్తి ప్రతిష్టలు ఇలాంటి సంఘటనలతో పాతాళానికి పడిపోవడం అత్యంత విచారకరం.