- రాష్ట్రంలో కమలానికి తోడుగా పార్టీ
- జూబ్లీహిల్స్ ఎన్నికలో కాషాయంతోనే అడుగు
- అధినేతతో భేటీ… దిశానిర్దేశం లేక డీలా
సహనం వందే, అమరావతి/హైదరాబాద్:
తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం సుదీర్ఘ కాలం తర్వాత కదిలినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర టీడీపీ నేతలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఉండవల్లి నివాసంలో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని… ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదని పార్టీ నేతలే వ్యాఖ్యానించడం టీడీపీకి దిశానిర్దేశం లేకపోవడాన్ని స్పష్టం చేస్తోంది. ఈ సమావేశం తర్వాత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీడీపీ పోటీ చేయదని తేలిపోయింది. దీంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మద్దతు ఇవ్వడం తప్ప ఈ ఉపఎన్నికలో టీడీపీకి మరో పాత్ర లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.
తెలంగాణలో నాయకుడే లేని పార్టీ…
తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎంత గందరగోళంగా ఉందో ఈ సమావేశం వెల్లడిస్తోంది. కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా తర్వాత ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడిని నియమించలేదు. కేవలం మండల అధ్యక్షుల నియామకాలు వంటి సంస్థాగత నిర్మాణంపైనే ఇప్పటికీ కసరత్తు జరుగుతోంది. సుదీర్ఘకాలం తర్వాత అధినేతతో భేటీ అయిన నేతలు… రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలంటూ పదే పదే విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. పార్టీకి 1.78 లక్షల సభ్యత్వం ఉన్నా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పనిచేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నా… పార్టీని నడిపించే నాయకత్వంపై దృష్టి సారించకపోవడం టీడీపీ అధినాయకత్వపు నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది.
బీజేపీ భజన తప్ప వేరే దారి లేదా?
స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో కలిసి పోటీ చేయాలా లేక పూర్తిగా పోటీకి దూరంగా ఉండటమే మేలా అన్నదానిపై చంద్రబాబు సూచనలు ఇస్తారని నేతలు ఆశించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన టీడీపీకి ఇకపై జరిగే ప్రతి ఎన్నికల్లోనూ అదే పద్ధతిని అనుసరించడం తప్ప సొంతంగా ఎదిగే అవకాశం కనిపించడం లేదు. జూబ్లీహిల్స్‌లో గెలిచే అధికార పార్టీ విజయాన్ని గమనిస్తూ సహజంగానే బీజేపీ పక్కన నిలబడతామని టీడీపీ వెల్లడించడం… తెలంగాణలో టీడీపీ సొంత అజెండా లేదనే విమర్శలకు బలం చేకూరుస్తుంది.
మానసికస్థైర్యం కోల్పోయిన నేతలు…
తెలంగాణ టీడీపీ నేతలు క్షేత్ర స్థాయిలో నిరంతరం పనిచేస్తున్నా వారికి సరైన దిశానిర్దేశం లభించడం లేదు. స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున అధికారికంగా పోటీ చేయకపోయినా వ్యక్తిగతంగా వారు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబుతో జరిగిన సమావేశం తర్వాత తెలంగాణ నేతలు తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురయ్యారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇస్తామని అధినేత స్పష్టం చేసినప్పటికీ… ఆ నియామకం ఎప్పుడు జరుగుతుందనే స్పష్టత ఇవ్వకపోవడం తెలంగాణలో టీడీపీ భవిష్యత్తుపై సందేహాలను మరింతగా పెంచుతోంది. మొత్తంగా చెప్పాలంటే తెలంగాణలో బీజేపీకి అనుబంధ శక్తిగా టీడీపీ మారడానికి సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.