విడాకుల సంబరం… పాలతో స్నానం – కేక్ కట్ చేసిన యువకుడు

  • హ్యాపీ డివోర్స్… జెన్ జెడ్ ఐసోలేట్
  • ఒంటరి జీవితానికి యువత ఘనస్వాగతం!
  • స్వేచ్ఛా జీవితం వర్సెస్ ఆర్థిక భారం
  • బాధ్యతాయుత స్వేచ్ఛ అవసరమన్న చర్చ

సహనం వందే, న్యూఢిల్లీ:
విడాకులు అంటే విషాదం… విచారం అనే పాత భావనలు ఇప్పుడు కొత్త తరం యువత ఆలోచనల్లో చెరిగిపోతున్నాయి. వైవాహిక బంధం నుంచి విముక్తి పొందిన ఒక వ్యక్తి కేక్ కట్ చేసి పాల స్నానం చేసి పెళ్లికొడుకు వేషంలో తన ఒంటరి జీవితాన్ని పండుగలా జరుపుకోవడం మారుతున్న పోకడకు సజీవ సాక్ష్యం. ఈ విడాకుల సంబరం సోషల్ మీడియా లో వైరల్‌గా మారడం, భిన్నమైన అభిప్రాయాలకు తావివ్వడం గమనార్హం. స్వేచ్ఛ, వ్యక్తిగత ఆనందం అనే భావనలు యువతలో ఎంత బలంగా పాతుకుపోయాయో ఈ సంఘటన నిరూపిస్తోంది. ఒకప్పుడు జీవిత వైఫల్యంగా చూసిన విడాకులను, ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభానికి స్వాగత కార్యక్రమంగా పరిగణిస్తోంది.

స్వేచ్ఛా జీవితం వర్సెస్ ఆర్థిక భారం
ఈ విడాకుల వేడుక సామాజిక మాధ్యమాల్లో చర్చల సునామీ సృష్టించింది. ఒకవైపు ఆ వ్యక్తి స్వేచ్ఛా జీవితాన్ని సమర్థిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతుంటే… మరోవైపు ఈ ఆనందం వెనుక ఉన్న ఆర్థిక ఒత్తిళ్లు ఏంటి? భార్యకు చెల్లించాల్సిన భరణం భారం ఎంతకాలం ఈ సంబరాన్ని నిలబెడుతుంది? అని పదునైన ప్రశ్నలు సంధిస్తున్నారు. విడాకుల తర్వాత పురుషులు భరణం చెల్లించడానికి ఏకంగా రుణాలు చేయాల్సి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. పురుషులు రుణాలు చేసి భృతి చెల్లిస్తున్న పరిస్థితుల్లో విడాకులను సంబరంగా జరుపుకోవడం కేవలం సమాజం దృష్టిని ఆకర్షించే ప్రయత్నమా లేక నిజమైన ఆనందమా అనేది ప్రశ్నార్థకమే.

పెళ్లిపై యువతి యువకుల్లో భయాలు…
విడాకుల కారణంగా ఎదురయ్యే ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి కారణంగా యువతరం వివాహ వ్యవస్థపైనే భయాన్ని పెంచుకుంటోంది. ప్రేమ వివాహాలు చేసుకుంటున్నా విడాకుల సమయంలో ఆస్తి, భరణం వంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ప్రీనప్షియల్ అగ్రిమెంట్‌లు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ ధోరణి భారతదేశంలోని సాంప్రదాయ వివాహ వ్యవస్థకు కొత్త పోకడ. ఒక సర్వే ప్రకారం అధిక శాతం పురుషులు విడాకుల ఖర్చుల కోసం రుణాలు తీసుకోవడం, మహిళలు కూడా ఆర్థిక ఆధారం లేక కెరీర్‌లో ఇబ్బందులు పడటం చూస్తే ఈ వివాహాల పతనం ఎంత తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుందో అర్థం చేసుకోవచ్చు.

బాధ్యతాయుత స్వేచ్ఛ అవసరం…
విడాకులను సంబరంగా జరుపుకోవడం యువతలో పెరుగుతున్న వ్యక్తివాదానికి, స్వేచ్ఛా ధోరణికి అద్దం పడుతోంది. పాతతరంలాగా సామాజిక ఒత్తిళ్లకు తలొగ్గకుండా తమ నిర్ణయాలను ధైర్యంగా ప్రకటించడంలో ఈ తరం ముందుంది. విడాకులు ఎప్పుడూ విషాదకరంగా ఉండాల్సిన అవసరం లేదని,హ అది కూడా జీవితంలో ఒక అధ్యాయం ముగిసిపోవడమేనని యువత నమ్ముతోంది. అయితే ఈ ఆనందం, స్వేచ్ఛ వెనుక ఉన్న భావోద్వేగాలు, ఆర్థిక, సామాజిక బాధ్యతలను విస్మరించకూడదు. విడాకులు కేవలం భార్యాభర్తల మధ్య ముగింపు కాదు. అది కుటుంబాలు, పిల్లలు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే సంక్లిష్టమైన అంశం. అందుకే విడాకులను ఒక సమాజ సమస్యగా గుర్తించి చట్టాలు, సమాజం రెండూ లింగ సమానత్వం, న్యాయం ఆధారంగా మారాల్సిన అవసరం ఉంది. కేవలం సంబరం ఒక్కటే సరిపోదు, బాధ్యతాయుతమైన స్వేచ్ఛ అవసరం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *