కరోనా విపత్తు… రెమెడెసివిర్ రాకెట్ – హరీష్ రావును టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ విమర్శ

  • రెమెడెసివిర్ అవినీతిపై ర’గడల’ రాజకీయం
  • అసలు సూత్రధారి ఒక ముఖ్యమైన అధికారి
  • ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి కోట్లు వసూళ్లు
  • రోగులను పీడిస్తుంటే యాజమాన్యాలకు అండ
  • డబ్బులు ఇచ్చిన వారిపై చర్యలు శూన్యం
  • అలాంటి అధికారిపై చర్యలు తీసుకోని దుస్థితి
  • అనేక ఆరోపణలు వచ్చినా వదిలేసిన వైనం

సహనం వందే, హైదరాబాద్:
కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని కుదిపేసిన సమయంలో రెమెడెసివిర్ ఇంజెక్షన్ల చుట్టూ జరిగిన అవినీతి దారుణాలు ఇప్పటికీ ప్రజలను కలవరపరుస్తున్నాయి. అప్పటి తెలంగాణ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖను శాసించిన మాజీ మంత్రి హరీష్ రావును పాలనలో ఈ అవినీతి జరిగినట్లు కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అతని నియంత్రణలో వైద్య వ్యవస్థ అవినీతి మయమైందని ఆరోపిస్తుంది. కాంగ్రెస్ సోషల్ మీడియా ద్వారా ఈ దారుణాలను ఎండగడుతూ హరీష్ రావును నిలదీస్తోంది. మందుల సరఫరా నుంచి వ్యాక్సిన్ల పంపిణీ వరకు అన్నింటిలోనూ కమీషన్లు కొట్టేసిన చరిత్ర గత ప్రభుత్వాన్నిదేనని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

ఆ వైద్యాధికారి మాఫియా సామ్రాజ్యం…
కరోనా సమయంలో రెమెడెసివిర్ ఇంజెక్షన్ల కొరత భారీగా ఉండేది. రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఈ ఇంజెక్షన్లు కీలకమైనవి కాగా, బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో ఇంజెక్షన్ లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు అమ్ముడైన సందర్భాలు ఉన్నాయి. ఈ కొరతను ఆసరాగా చేసుకుని వైద్యశాఖలోని కీలక అధికారి ఆసుపత్రులకు ఈ ఇంజెక్షన్లను సరఫరా చేసి భారీగా కమీషన్లు పొందాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల నుంచి లక్షలు వసూలు చేసినప్పటికీ వాటిపై చర్యలు తీసుకోకుండా నోటీసులతో సరిపెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో పేరుగాంచిన ఒక ప్రముఖ ఆసుపత్రికి నోటీసు జారీ చేసి ఘోర తప్పిదాలు జరిగాయని పేర్కొన్నప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ ఆసుపత్రి నుంచి ఆ అధికారికి కోట్ల రూపాయలు చేరాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా ఆ అధికారి కరోనా కాలంలో పెద్ద మాఫియా వ్యవస్థనే తయారు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఆసుపత్రులపై నియంత్రణ ఆయనదే…
అప్పటి వైద్య ఆరోగ్య శాఖలో కీలక పదవిలో ఉన్న ఆ అధికారి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడు. అతనికి అప్పటి ప్రభుత్వం అసాధారణ ప్రాధాన్యం ఇవ్వడంతో వ్యాక్సిన్ల సరఫరా, మందుల పంపిణీ, ఆసుపత్రుల నిర్వహణలో అతని ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు అతని ఆదేశాల కోసం ఎదురుచూసేవి. ఆసుపత్రులు రోగుల నుంచి అధిక రుసుములు వసూలు చేసినా అతను కేవలం నోటీసులతో సరిపెట్టి వాటిని విడిచిపెట్టాడని విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో అతను వందల ఆసుపత్రుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడని, కొన్ని ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేస్తామని బెదిరించి డబ్బు గుంజాడని ఆరోపణలు ఉన్నాయి.

కరోనా తెచ్చిన కనక వర్షం…
కరోనా కాలంలో ఈ అధికారి సంపాదించిన సంపద అతని జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. బస్తాల కొద్దీ కరెన్సీ నోట్లను దాచడానికి రెండు వేర్వేరు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కొన్నాడని, ఆ ఫ్లాట్లు డబ్బుతో నిండిపోయాయని సమాచారం. వైద్య ఆరోగ్య శాఖలో ఆయన కేవలం ఒక విభాగానికి అధికారి మాత్రమే. అతని జీతంతో ఆయన జీవిత కాలంలో హైదరాబాదులో ఒక మంచి ఇల్లు కొనుక్కోగలరు.

కానీ ఇప్పుడు వందల కోట్లకు పడగలెత్తాడు. ఒక దేశంలో సొంతంగా కార్పొరేట్ ఆసుపత్రి కూడా పెట్టారని ప్రచారం. హైదరాబాద్ విజయవాడ తిరిగినంత ఈజీగా ఆయన విదేశాలను చుట్టి వస్తాడు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా సాధ్యం కాని జీవనాన్ని అనుభవిస్తున్నాడు. ఈ సంపద వెనుక రెమెడెసివిర్ దందా, వ్యాక్సిన్ కుంభకోణం, ఆసుపత్రుల నుంచి వసూళ్లు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఇలాంటి విషయాలపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రచార అస్త్రంగా చేసుకుంటుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *