- ఎన్‌సీఆర్‌లో ఏకంగా 24 శాతం జంప్
- ముంబైలో చదరపు అడుగుకు రూ.17 వేలు
- సామాన్యుడి సొంతింటి కల గగనమే
- హైదరాబాదులో ఎకరం రూ. 177 కోట్లు
సహనం వందే, హైదరాబాద్:
దేశంలో రియల్ ఎస్టేట్ రంగం ఉరకలు వేస్తుంది. సామాన్యుడి సొంతింటి కలపై ఈ ధరల మంట తీవ్ర ప్రభావం చూపుతోంది. 2025 మూడో త్రైమాసికంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదలలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే ఇక్కడ ఇంటి ధరలు ఏకంగా 24 శాతం పెరిగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చదరపు అడుగు ధర రూ.7200 నుంచి రూ.8900కు చేరింది. గురుగ్రామ్, నోయిడా వంటి ఐటీ కేంద్రాలు ఉండటం, గేటెడ్ కమ్యూనిటీల పట్ల కొనుగోలుదారుల మోజు ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నా… ఈ దూకుడు సామాన్యుడికి భారంగా మారుతోందనేది జగమెరిగిన సత్యం.
ముంబైలో లగ్జరీ మంట…
దేశంలో అత్యంత ఖరీదైన గృహ మార్కెట్‌గా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇక్కడ సగటు ధర చదరపు అడుగుకు రూ.17,230. అంటే అత్యధికంగా పెరిగిన ఎన్‌సీఆర్ ధరతో పోలిస్తే దాదాపు రెండింతలు. గత ఏడాదితో పోలిస్తే ఇక్కడ ధరలు 6 శాతం పెరిగాయి. సౌత్ ముంబై, బాంద్రా వంటి ప్రాంతాల్లో ప్రీమియం ఇళ్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. ప్రవాస భారతీయుల ఆసక్తి… కీలకమైన ప్రాంతంలో పరిమిత భూమి ఉండటం వంటివన్నీ ధరలను మరింత అసాధారణ స్థాయికి నెట్టేస్తున్నాయి. ఈ ధరల పెరుగుదల చూస్తుంటే ముంబైలో సొంతింటి కల కేవలం సంపన్నులకే సాధ్యమనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ఐటీ నగరాల్లోనూ ఇదే పరిస్థితి…
దేశ ఐటీ రాజధానుల్లోనూ ధరల జోరు కనిపిస్తోంది. బెంగళూరులో గృహ ధరలు 10 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.8870కి చేరాయి. వైట్‌ఫీల్డ్, సర్జాపూర్ రోడ్లలో కొనుగోలుదారులు ఎగబడుతున్నారు. ఇక మన హైదరాబాద్ విషయానికొస్తే ఇక్కడ 8 శాతం పెరుగుదలతో చదరపు అడుగుకు రూ.7750కి ధర చేరింది. గచ్చిబౌలి, కోకాపేట వంటి పశ్చిమ ప్రాంతాలు ఐటీ కారిడార్ల వృద్ధి కారణంగా హాట్‌స్పాట్‌లుగా మారాయి.

సోమవారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దేశం దృష్టిని ఆకర్షించింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ప్రభుత్వ స్థలానికి జరిగిన వేలంలో ఊహించని రికార్డు ధరలు పలికాయి. టీజీఐఐసీ నిర్వహించిన ఈ వేలంలో ఎకరం భూమి ధర ఏకంగా రూ.177 కోట్లు పలకడం విశేషం. ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ 7.6 ఎకరాల భూమిని ఎకరాకు రూ.177 కోట్ల చొప్పున మొత్తం రూ.1357 కోట్లకు చేజిక్కించుకుంది. చెన్నైలోనూ 5 శాతం పెరుగుదల నమోదైంది. ఈ ఐటీ నగరాల్లోని నిపుణులు, ఉద్యోగుల అధిక కొనుగోలు శక్తి కారణంగానే ఈ ధరల పెరుగుదల అని కొందరు వాదిస్తున్నప్పటికీ… స్థిరంగా పెరుగుతున్న డిమాండ్, ధరల మధ్య ఉన్న అగాధం సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తోంది.
చిన్న నగరాల్లోనూ మార్కెట్ భూమ్…
పెద్ద నగరాలే కాకుండా పూణే, కోల్‌కతాలు సైతం రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో స్థిరమైన లాభాలను ఆర్జించాయి. పూణేలో ధరలు 4 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.7935కు చేరాయి. ఐటీ ఉద్యోగులు, విద్యార్థుల కారణంగా ఇక్కడ డిమాండ్ పెరిగింది. కోల్‌కతాలో 6 శాతం పెరుగుదలతో ధరలు రూ.6060కి చేరాయి. రోడ్డు కనెక్టివిటీ, మెట్రో ప్రాజెక్టుల వంటి మౌలిక వసతులు ఈ వృద్ధికి కారణమయ్యాయి. స్థూలంగా దేశవ్యాప్తంగా సగటు ధర చదరపు అడుగుకు రూ.9105కు చేరింది. గృహ కొనుగోలుదారులు కేవలం ఆస్తి కోసం కాకుండా ఆధునిక సౌకర్యాలు, మెరుగైన జీవనశైలి కోసం ఆసక్తి చూపుతున్నారనేది నిపుణుల అభిప్రాయం. రియల్ ఎస్టేట్ దీర్ఘకాలిక వృద్ధిని సాధిస్తుందని వారు చెబుతున్నా… ఈ ధరల పెరుగుదలపై నియంత్రణ లేకపోతే మధ్యతరగతికి సొంతిల్లు అనేది ఓ కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.