విదేశాల్లో విద్యార్థనాదాలు – ఆరేళ్లలో 842 మంది భారత విద్యార్థుల మృతి

  • అత్యధికంగా అమెరికాలో 141 మరణాలు
  • తాజాగా హైదరాబాద్ విద్యార్థిపై కాల్పులు

సహనం వందే, హైదరాబాద్:
విదేశాల్లో ఉన్నత విద్య… మంచి ఉద్యోగం… మెరుగైన జీవితం అనే కలల రెక్కలు కట్టుకుని కడలి దాటిన భారతీయ యువ హృదయాలు అక్కడి ప్రమాదాల్లో ఆరిపోతున్నాయి. 2018 నుంచి 2024 వరకు ఈ ఆరేళ్లలో ఏకంగా 842 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది. ప్రతి మరణం వెనుక ఒక కుటుంబం ఆశ… ఒక యువకుడి భవిష్యత్తు ఆధారపడి ఉంది.

కలల మాటున కన్నీళ్ల కథ
భారతీయ విద్యార్థులకు కలల గమ్యంగా భావించే అమెరికా ఇప్పుడు కన్నీళ్ల కథగా మారుతోంది. ఈ ఆరేళ్ల కాలంలో అమెరికాలో అత్యధికంగా 141 మంది భారతీయ విద్యార్థులు చనిపోయారు. వీరి మరణాలకు ఆరోగ్య సమస్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు ప్రధాన కారణాలుగా ఉన్నప్పటికీ… కాల్పుల ఘటనలు పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా తాజాగా డల్లాస్‌ కాల్పుల ఘటనలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు చంద్రశేఖర్ ను కోల్పోవడం విచారకరం. అమెరికాలో ఆయుధ నియంత్రణ లోపం కారణంగా ఇలాంటి దారుణాలు జరగడం గుబులు పుట్టిస్తోంది.

కాల్పుల్లో ఎల్బీనగర్ చంద్రశేఖర్ బలి…
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన పోలే చంద్రశేఖర్ ది కలల ప్రయాణం. 2023లో బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత విద్య కోసం అమెరికా గడ్డపై అడుగుపెట్టాడు. తన ఖర్చుల కోసం డల్లాస్‌లోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. కానీ ఈ నెల 4వ తేదీన ఓ దుండగుడు పెట్రోల్ పోసుకునేందుకు వచ్చి తుపాకీతో కాల్పులు జరపడంతో చంద్రశేఖర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇలాంటి దారుణాలు చూస్తుంటే తమ పిల్లలను విదేశాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు.

ఇతర దేశాల్లోనూ ఆర్తనాదాలు…
అమెరికా మాత్రమే కాదు ఇతర దేశాల్లోనూ భారతీయ విద్యార్థుల ఆర్తనాదాలు ఆగడం లేదు. దుబాయ్‌లో 133 మంది, కెనడాలో 119 మంది, ఖతార్‌లో 57 మంది, ఆస్ట్రేలియాలో 56 మంది భారతీయ విద్యార్థులు ఈ ఆరేళ్లలో ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల్లో 96 శాతం ఆరోగ్య సమస్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాల వల్ల సంభవించాయని లెక్కలు చెబుతున్నాయి. దీనికి కారణం విదేశాల్లో చదువుకునే విద్యార్థులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం వంటి సమస్యలే. ఉన్నత చదువుల కోసం అప్పులు చేసి వెళ్లడం, ఖర్చుల కోసం పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయడం, అక్కడ సమాజంలో కలిసిపోలేకపోవడం వంటి కారణాలతో కొందరు ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

యువకుల భద్రతపై కేంద్రం దృష్టి…
విదేశాల్లో భారతీయ విద్యార్థుల భద్రత కోసం ఇప్పుడు తక్షణ చర్యలు తప్పనిసరి. ఈ విషాదాలను నివారించేందుకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాల ద్వారా చర్యలు చేపట్టింది. ప్రతి విద్యార్థి తమ వివరాలను రాయబార కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలని సూచనలిచ్చింది. ఇది ఎమర్జెన్సీ సమయంలో వెంటనే సాయం అందించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు రష్యా-ఉక్రెయిన్ వంటి సంక్షోభ సమయాల్లో తరలింపు చర్యలు చేపట్టినట్లుగానే ఇప్పుడు భద్రత, మానసిక స్థైర్యం కోసం రాయబార కార్యాలయాలు కౌన్సెలింగ్ సేవలు, భద్రతా మార్గదర్శకాలను పంపుతున్నాయి. విద్యార్థులు కూడా స్వీయ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, జీవిత బీమా తీసుకోవడం, మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు కౌన్సెలింగ్ సేవలు వాడుకోవడం ముఖ్యం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *