- పర్ ప్లెక్సిటీ ఫౌండర్ అరవింద్ శ్రీనివాస్ జర్నీ
- బిలియనీర్ జాబితాలో అంబానీ పక్కన చోటు
- షారుఖ్ ఖాన్ సంపద కంటే డబుల్
- పదేళ్ల క్రితం ఐఐటీ మద్రాస్ విద్యార్థి
సహనం వందే, హైదరాబాద్:
దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు ఒక యువ భారతీయ పారిశ్రామికవేత్త. కేవలం 31 ఏళ్ల వయసుకే రూ. 21,190 కోట్ల నికర సంపదతో మెరిసి ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2025లో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా నిలిచారు. ఆయనే అరవింద్ శ్రీనివాస్. ఏఐ రంగంలో తనదైన ముద్ర వేసిన ఈ చెన్నై యువకుడు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో… గౌతమ్ ఆదాని రెండో స్థానంలో ఉన్నారు. వారితోపాటు ఒక యువ ఐఐటీయన్ ఉండటం విశేషం. ఆయన తర్వాత షారుక్ ఖాన్ సంపద రూ. 12,490 కోట్లుగా ఉంది.
ఐఐటీ నుండి ఓపెన్‌ఏఐ దాకా…
అరవింద్ శ్రీనివాస్ 1994 జూన్ 7న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఐఐటీ మద్రాస్‌లో చదువుతున్నప్పుడే విద్యార్థులకు రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ కోర్సులు బోధించారు. ఆ తర్వాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కెలీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆయన కంప్యూటర్ విజన్, ఇమేజ్ జనరేషన్ వంటి అత్యాధునిక అంశాలపై పరిశోధనలు చేశారు. విద్య పూర్తి కాకముందే ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ దిగ్గజాలలో పని చేసి అపారమైన అనుభవాన్ని సంపాదించారు. ఓపెన్ ఏఐలో రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌పై, డీప్‌మైండ్‌లో కాంట్రాస్టివ్ లెర్నింగ్‌పై పని చేశారు. అలాగే గూగుల్‌లో విజన్ మోడళ్లను అభివృద్ధి చేసి తిరిగి ఓపెన్ ఏఐకి వచ్చి టెక్స్ట్-టు-ఇమేజ్ జనరేషన్ మోడల్ అయిన డాల్-ఈ 2 అభివృద్ధికి సహకరించారు. ఆయన ప్రయాణం ఒక అద్భుతమైన మేధో పరుగులా సాగింది.
సంచలనం సృష్టించిన ‘పర్ ప్లెక్సిటీ’…
అరవింద్ శ్రీనివాస్, డెనిస్ యారట్స్, ఆండీ కొవిన్స్కితో కలిసి 2022 ఆగస్టులో పర్ ప్లెక్సిటీ ఏఐని స్థాపించారు. ఈ సంస్థ ఏఐ ఆధారిత చాట్-సెర్చ్ ఇంజిన్ ద్వారా వినియోగదారుల ప్రశ్నలకు వేగవంతమైన, కచ్చితమైన, విశ్వసనీయమైన సమాధానాలను అందించే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ ఏఐ-ఆధారిత సెర్చ్ ఇంజిన్ ప్రపంచ దిగ్గజాలకు గట్టి పోటీనిస్తూ అరవింద్‌కు ప్రపంచస్థాయి ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది. నిపుణుడిగా, వ్యవస్థాపకుడిగా ఆయన విజయం భారతీయ డీప్-టెక్, ఏఐ ఆవిష్కరణలు ప్రపంచంలో ఎంత వేగంగా ఎదుగుతున్నాయో స్పష్టంగా చూపిస్తోంది.
ఇండియాపై అరవింద్ దృష్టి…
పర్ ప్లెక్సిటీ ఏఐకి సంబంధించిన వినియోగదారుల సంఖ్య ప్రపంచంలోనే భారత్‌లో అత్యధికంగా పెరిగింది. ఈ ఆదరణను గుర్తించిన అరవింద్ భారతదేశాన్ని తమ కంపెనీ వృద్ధి వ్యూహంలో ముఖ్యమైన కేంద్రంగా నిర్ణయించారు. బెంగళూరు లేదా హైదరాబాద్‌లో ఏఐ ఇంజనీరింగ్ టీంను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇది కేవలం ఆయన వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. భారతదేశం జ్ఞాన-ఆధారిత ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న విధానాన్ని, యువ మేధావులకు లభిస్తున్న అద్భుతమైన అవకాశాలను సూచిస్తోంది.