- విజయనగరం ఎంపీపై సీఎం ప్రశంసల జల్లు
- సామాన్యుడిని ఎంపీ చేసిన ఘనత మాదే
- సభా వేదికగా కొనియాడిన ముఖ్యమంత్రి
- చప్పట్లతో మారుమోగిన సభా ప్రాంగణం
- ఇటీవల ప్రధానమంత్రి మోడీ నుంచీ ప్రశంసలు
- సైకిల్ పై పార్లమెంట్ కు వెళుతున్న ఏకైక ఎంపీ
- దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతున్న నేత
సహనం వందే, విజయనగరం:
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. దత్తి గ్రామంలో బుధవారం పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు… ఎంపీ అప్పలనాయుడు పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న విధానం ప్రశంసనీయమని కొనియాడారు. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలను శక్తివంతంగా నిర్వహిస్తూ తెలుగుదేశంను ప్రాణంగా చూసుకుంటున్నారని సభా వేదికగా ప్రశంసించారు. ఈ కామెంట్లతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగిపోయింది.
సేవ చేసే వారికే టీడీపీలో స్థానం…
ఒక సాధారణ కార్యకర్తను ఎంపీగా నిలబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని చంద్రబాబు గర్వంగా ప్రకటించారు. ఇది కేవలం మాట మాత్రమే కాదు… తమ పార్టీ విధానమని ఆయన స్పష్టం చేశారు. అప్పలనాయుడును ఉద్దేశిస్తూ… ‘మేము సేవ చేసే వాళ్లకు గుర్తింపు ఇస్తాం. ఆ సేవా ప్రతిరూపం అప్పలనాయుడ’ని ముఖ్యమంత్రి గతంలో చెప్పిన మాటలు ఈ సందర్భంగా మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. అప్పలనాయుడి నిజాయితీ, నిబద్ధతకు ఈ ప్రశంసలు గొప్ప నిదర్శనం.
ఏడాదిలోనే సమర్థ నాయకుడిగా గుర్తింపు…
ఎన్నికల ముందు కేవలం మామూలు కార్యకర్తగా ఉన్న అప్పలనాయుడు… ఎన్నికల అనంతరం కేవలం ఒక సంవత్సరం కాలంలోనే సమర్థవంతమైన ప్రజాప్రతినిధిగా గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ఆయనలోని నిబద్ధత కనిపిస్తుంది. కష్టపడి పనిచేసే తత్వం, ప్రజల సమస్యల పట్ల చూపిన అనుభూతి, వినయం, సాధారణత ఆయన రాజకీయ ప్రయాణానికి బలాన్నిచ్చాయి. రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన అవకాశాన్ని ఆయన విశ్వాసంగా నిలబెట్టుకుంటూ, ప్రజాసేవనే తన జీవన విధానంగా మార్చుకున్నారు.
ప్రధాని ప్రశంసలతో విజయనగరానికి కీర్తి…
విజయనగరం జిల్లాకు ప్రతిష్ట తీసుకువస్తూ, జాతీయ స్థాయిలో శక్తివంతమైన నాయకుడిగా అప్పలనాయుడు ఎదుగుతున్న తీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, యువతకు గొప్ప ప్రేరణగా మారింది. అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అప్పలనాయుడు పనితీరును ప్రశంసించిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్టీ గుర్తు అయిన సైకిల్ పై పార్లమెంటుకు వెళుతున్న ఏకైక ఎంపీ అప్పలనాయుడు. దీంతో ఆయన దేశవ్యాప్తంగా అందరి మన్ననలు పొందారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.