- లండన్‌లో భారతీయులపై హేట్ క్రైమ్‌లు…
- గతేడాది వరకు 98 వేల జాతి విద్వేష నేరాలు
- మళ్లీ పురుడు పోసుకుంటున్న తెల్ల బలుపు
- దేశాన్ని దోపిడీ చేసి ఇప్పుడు మళ్ళీ వివక్ష
- విదేశీయులపై బ్రిటన్ జాతీయుల దాడులు
సహనం వందే, లండన్:
ఒకప్పుడు భారతదేశాన్ని రాచి రంపాన పెట్టి దోపిడీ చేసిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు… ఇప్పుడు మళ్లీ తమ అహంకారాన్ని అప్పుడప్పుడు బయట పెడుతున్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ల తర్వాత కూడా మన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా వదలడం లేదు. ఆ దేశంలో ఉన్న కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై అక్కడి భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లండన్‌లోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహ ధ్వంసాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు జాతి విద్వేషపూరిత నేరంగా పరిగణించి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ చర్య లండన్‌లోని ప్రవాస భారతీయులను కలచివేసింది. గాంధీజీ బోధనలను లెక్కచేయకుండా జరిగిన ఈ దాడి, సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించకపోతే ఇలాంటి సంఘటనలు మరింతగా జరిగే ప్రమాదం ఉందని విమర్శకులు ఆందోళన చెందుతున్నారు.

ఇండియన్స్ పై పెరిగిన హేట్ క్రైమ్‌లు…
లండన్ మహానగరంలో జాతి విద్వేష సంఘటనలు పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు చివరి వరకు మెట్రోపాలిటన్ పోలీసులు రెండు వేలకు పైగా విద్వేషపూరిత నేరాలను నమోదు చేశారు. జాతి, మత విద్వేషాలే ఈ దాడులకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. రోజువారీ జీవితంలో భయాన్ని అనుభవిస్తున్నామని భారతీయ సమాజంతో పాటు ఇతర మైనారిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్వేష ఘటనలు కేవలం సామాజిక సమస్యగా కాకుండా రాజకీయ కుట్రల ఫలితంగా పెరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వలస విధానాలపై రిఫామ్ పార్టీ వంటి పార్టీల ప్రకటనలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలు ఈ విద్వేష జ్వాలలకు ఆజ్యం పోస్తున్నాయి. గోల్డర్స్ గ్రీన్ వంటి ప్రాంతాలలో యూదు సమాజంపై దాడులు… ప్రార్థనా మందిరాలు, పాఠశాలలపై దాడులు భయాన్ని మరింత పెంచాయి. ఇవి కేవలం యూదు, పాలస్తీనా గుర్తింపు వివాదాలకు సంబంధించినవే కాకుండా సమాజంలో నెలకొన్న తీవ్రమైన విభేదాలకు అద్దం పడుతున్నాయి.
ప్రభుత్వ చర్యల వైఫల్యం
పోలీసు రికార్డుల ప్రకారం… ఇంగ్లండ్, వేల్స్‌లలో 2024 మార్చి వరకు 98 వేలకు పైగా జాతి విద్వేష నేరాలు నమోదు కావడం విస్మయం కలిగిస్తుంది. కేవలం లండన్‌లోనే 21 వేలకు పైగా సంఘటనలు జరగడం ప్రభుత్వ విధానాల వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే ఈ జాతి విద్వేష జ్వాలలు మరింత భయంకరంగా మారి సామాజిక ఐక్యతను దెబ్బ తీస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. విద్వేషాన్ని పెంచే రాజకీయాలపై నిఘా లేకపోవడం జాతి విద్వేష జ్వాల పెరగడానికి కారణమవుతున్నాయి.