- బీసీలు లేని చోట ఆ కేటగిరీకి రిజర్వేషన్
- ఎస్టీలు ఎక్కువ ఉన్నచోట బీసీలకు…
- ప్రజాస్వామ్య ప్రక్రియ అపహాస్యం
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్ల కేటాయింపులో జరిగిన తప్పులు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం సృష్టిస్తున్నాయి. ఓటరు లేని చోట పదవుల రిజర్వేషన్లు కల్పించడం వెనుక దాగి ఉన్న రాజకీయం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సామాజిక న్యాయం ప్రధాన లక్ష్యంగా రూపొందిన రిజర్వేషన్లు అస్తవ్యస్తమైన డేటా ఆధారంగా కేటాయించడం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియే అపహాస్యం అవుతోందని విమర్శకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ తప్పిదాల కారణంగా పలు గ్రామాల్లో ఎన్నికలు జరగకముందే ఏకగ్రీవాలు ఖాయమవుతున్నాయి. వలసల కారణంగా జనాభా స్వరూపం మారినా 2011 నాటి పాత జనాభా లెక్కలపై ఆధారపడి తయారుచేసిన రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ వల్ల ఈ తప్పిదాలు జరిగాయని చెప్పడం నిర్లక్ష్యానికి, అనాలోచిత విధానాలకు నిదర్శనం. తాజా సర్వేలు నిర్వహించకుండా ఎన్నికల ప్రక్రియను చేపట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం.
చిత్ర విచిత్ర రిజర్వేషన్లకు సాక్షాలు ఇవీ…
- ఉమ్మడి నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని జైత్రతండా, బండావత్ తండా, గోన్యతండా, బాలాజీనగర్ తండా, మాన్ తండా, నూనావత్ తండా.. అడవిదేవులపల్లి మండలంలోని చాంప్లాతండాలో సర్పంచ్ స్థానాలు బీసీలకు రిజర్వ్ కాగా… అక్కడ బీసీ ఓటర్లే లేరు
- మాడుగుల పల్లి మండలంలోని అభంగాపూర్.. తిరుమలగిరి (సాగర్) మండలంలోని చింతలపాలెం గ్రామాల సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ కాగా.. ఆ గ్రామాల్లో ఎస్టీ వారు ఒక్కరు కూడా లేరు
- అనుముల మండలం పేరూర్ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కాగా… అక్కడ ఒకే ఒక్క ఎస్టీ పురుషుడు ఓటరుగా ఉన్నాడు
- నేరేడుగొమ్ము మండలం బచ్ఛాపురం సర్పంచ్ బీసీకి రిజర్వ్ కాగా… అక్కడ బీసీలే లేరు
- వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లి గ్రామంలో ఎస్టీ జనరల్‌కు రిజర్వు కాగా… అక్కడ ఎస్టీ ఓటర్లే లేరు. అదే మండలంలోని ఆశాలపల్లిలో ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా… అక్కడ వంగరి మల్లమ్మ ఒక్కరే ఎస్సీ ఓటరు ఉండడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమే,
- మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం శంకరాయపల్లి తండాలో సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కాగా… ఇక్కడ ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేరు
- నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కల్ములోని పల్లి, కుమ్మరోని పల్లి, వంగురోని పల్లి, ప్రశాంత్ నగర్ సర్పంచ్ స్థానాలు ఎస్టీ మహిళకు రిజర్వ్ కాగా… ఆ గ్రామాల్లో ఎస్టీలే లేరు.
- నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం పెర్కపల్లి ఎస్సీలకు రిజర్వ్ కాగా.. ఇక్కడ ఎస్సీ ఓటర్లే లేరు.
- కుబీర్ మండల పరిధిలోని ఫకీర్ నాయక్ తండా, దావూజీ నాయక్ తండాలో బీసీలకు రిజర్వ్ కాగా… ఆ గ్రామాల్లో గిరిజనులే ఓటర్లు ఉన్నారు.
- పెంబి మండలం వేణునగర్ గ్రామంలో బీసీ జనరల్‌కు రిజర్వ్ కాగా అక్కడ ఎస్టీలే ఎక్కువ.
- వేమనపల్లి మండలం రాజారం గ్రామం ఎస్సీ రిజర్వు కాగా… అక్కడ ఎస్పీలు ఎవరూ లేరు.
- సారంగాపూర్ మండలం హనుమాన్ తండా, పెండల్ దరి గ్రామంలో బీసీ ఓటర్లు లేరు. ఈ గ్రామాలు బీసీలకు రిజర్వ్ అయ్యాయి.
- కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం తుమ్మలగూడ గ్రామంలో బీసీ జనరల్ రిజర్వ్ కాగా… ఎస్సీలే ఉన్నారు.
- ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం సావర్గం, పీచర, ఆరేపల్లి గ్రామాలు బీసీలకు రిజర్వ్ కాగా... అక్కడ బీసీ ఓటర్లే లేరు.
- మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం ఏజెన్సీ గ్రామం ఎస్టీలకు రిజర్వ్ కాగా… ఇక్కడ ఎస్టీ ఓటర్లే లేరు.
- ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామ పంచాయతీ ఎస్టీ మహళకు రిజర్వ్ కాగా… అక్కడ ఎస్టీ ఓటర్లే లేరు.
- రఘునాథపాలెం మండలంలోని ఎన్.వి. బంజర, రాములు తండాలో బీసీలే లేకున్నా సర్పంచ్ పదవులు బీసీలకు రిజర్వ్ అయ్యాయి.