దసరా హీట్… టూర్ ట్రీట్ – లాంగ్ వీకెండ్ కు టూరిస్టుల ప్లాన్

  • గతేడాదితో పోస్తే 25% బుకింగ్స్ పెరుగుదల
  • హోటల్స్ ధరలు 30 శాతం వరకు అధికం
  • రెండు మూడ్రోజుల వీకెండ్ గెటవేలకు మొగ్గు
  • పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం టూర్స్

సహనం వందే, హైదరాబాద్:
దసరా పండుగ సందర్భంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా పర్యాటక డిమాండ్ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే లాంగ్ వీకెండ్ కోసం బుకింగ్‌లు గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 20 నుంచి 25 శాతం పెరిగాయి. హోటల్ రిజర్వేషన్లు సైతం 14 నుంచి 16 శాతం పెరిగాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం పని ఒత్తిడి నుంచి కాస్తంత ఉపశమనం కోరుకోవడమే. కుటుంబాలు, యువత రెండు మూడు రోజుల వీకెండ్ గెటవేలకు మొగ్గు చూపుతుండటంతో ట్రావెల్ కంపెనీలు ప్రత్యేక ప్యాకేజీలను రూపొందిస్తున్నాయి. ఈ ట్రెండ్ దీపావళి, క్రిస్మస్ వరకు కొనసాగుతుందని ట్రావెల్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈజీ బుకింగ్ సౌలభ్యం ఈ డిమాండ్‌ను మరింత బలోపేతం చేసింది.

బాలి, శ్రీలంక వంటి ప్రాంతాలకు…
దసరా సెలవుల్లో ఇండియాలోని లీజర్ హాట్‌స్పాట్లు, దక్షిణ తూర్పు ఆసియా దేశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. దేశీయంగా గోవా, కేరళ బీచ్‌లు, రాజస్థాన్ రిసార్ట్‌లు బుకింగ్‌లలో ముందున్నాయి. ఇక హైదరాబాద్ నుంచి అరకు, స్పాటెడ్ డీర్ పార్క్ లేదా తిరుపతి దర్శనాలు వంటి షార్ట్ ట్రిప్‌లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. విదేశీ పర్యటనలో బాలి, శ్రీలంక వంటి ప్రాంతాలకు డిమాండ్ ఉంది. తెలుగు కుటుంబాలు తరచుగా మైసూరు దసరా ఉత్సవాలను చూసేందుకు మొగ్గు చూపుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి, బెంగళూరు నుంచి కోడైకనాల్ హిల్ స్టేషన్లు, విశాఖపట్నం బీచ్‌లు పండుగ మూడ్‌ను రెట్టింపు చేస్తున్నాయి.

పెరిగిన ధరలు… వ్యాపారుల హుషారు!
ట్రావెల్ డిమాండ్‌లో వచ్చిన ఈ దూకుడు కారణంగా పర్యాటక ప్రాంతాల్లో ధరలు పెరిగాయి. ప్రసిద్ధ లీజర్ హాట్‌స్పాట్లలో హోటల్ ధరలు 15 నుంచి 30 శాతం మేర పెరిగాయి. అదే స్థాయిలో ఎయిర్‌ఫేర్‌లు కూడా పెరిగాయి. ఈ ధరల పెరుగుదల పర్యాటక రంగానికి సానుకూల సంకేతంగా మారింది.

ఆనందకర ప్రయాణానికి చిట్కాలు!
కుటుంబంతో వెళ్లేవారు పిల్లలకు సౌకర్యాలున్న ప్యాకేజీలు ఎంచుకోవడం మంచిది. ప్రయాణంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, రోడ్డు పక్కన ఆహారం తినకుండా ఉండటం, కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. పిల్లలకు ఐడీ కార్డులు, ఫోన్ నంబర్లు తెలియజేయడం సురక్షిత ప్రయాణానికి ఎంతో ముఖ్యం. దసరా సందర్భంగా స్థానిక మార్కెట్లలో స్వీట్లు, జ్ఞాపికలు కొనుగోలు చేయడం, బీచ్‌లలో పిక్నిక్, హిల్ స్టేషన్లలో ట్రెక్కింగ్ కుటుంబ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *