- పింక్ వెలుగుల్లో మెరిసిన ప్రసిద్ధ కట్టడాలు
- బుద్ధ విగ్రహం… కేబుల్ బ్రిడ్జి పైన పింక్ లైట్లు
- అక్టోబర్ క్యాన్సర్ నివారణ అవగాహన నెల
- ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ నిర్వహణ
సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్ నగరం మంగళవారం అర్ధరాత్రి గులాబీమయం అయింది. ప్రముఖ భవనాలపై పింక్ రంగు మెరిసిపోయింది. అక్టోబర్ క్యాన్సర్ నివారణ నెల నేపథ్యంలో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రపంచంలో వైట్ హౌస్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఐఫిల్ టవర్ వంటి ప్రపంచ ప్రసిద్ధ కట్టడాలతో పాటు మన దేశంలో హైదరాబాదులో మాత్రమే పెయింట్ ది సిటీ పింక్ నిర్వహిస్తుండడం విశేషం.
చార్మినార్, బుద్ధ విగ్రహం, టీ-హబ్, ప్రసాద్ ఐమ్యాక్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, కిమ్స్ హాస్పిటల్స్ వంటి ఆరు ప్రముఖ ప్రాంతాలు ఒకే రాత్రి పింక్ విద్యుత్ కాంతుల్లో వెలిగిపోవడం విశేషం. ప్రముఖ భవనాలను ఇలా పింక్ రంగులోకి మార్చడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించి రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన పెంచడం దీని ప్రధాన లక్ష్యమని ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సీఈఓ, డైరెక్టర్ డాక్టర్ పి. రఘురామ్ వెల్లడించారు.


ముందస్తు గుర్తింపే ఆయుధం…
ఈ సందర్భంగా డాక్టర్ పి. రఘు రామ్ మాట్లాడుతూ… పెయింట్ ది సిటీ పింక్ కార్యక్రమం రొమ్ము క్యాన్సర్‌ను జయించిన వారికి ధైర్యం, ఆశను అందిస్తుందన్నారు. 40 ఏళ్లు పైబడిన ప్రతి మహిళ తప్పనిసరిగా ఏటా స్క్రీనింగ్ మమ్మోగ్రామ్ చేయించుకోవాలని ఆయన సూచించారు. వైట్ హౌస్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఐఫిల్ టవర్ వంటి ప్రపంచ ప్రసిద్ధ కట్టడాలు అక్టోబర్ లో పింక్ రంగులో వెలిగి ఈ అవగాహనలో పాలుపంచుకుంటాయని తెలిపారు.
ప్రస్తుతం భారతదేశంలో మహిళలను ఎక్కువగా పీడిస్తున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ అగ్రస్థానంలో ఉంది. భయంకరమైన విషయం ఏమిటంటే దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల కొత్త కేసులు నమోదవుతుంటే, అందులో ఏకంగా లక్ష మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రతి ఇద్దరిలో ఒకరు మృత్యువాత పడుతున్నారు. ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అవుతుంటే, ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మహిళ ఈ వ్యాధితో మరణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.