- డబ్బా కాలేజీకి కొత్తగా 50 ఎంబీబీఎస్ సీట్లు
- హైదరాబాద్ సమీపంలోని కాలేజీకి మంజూరు
- తూతూమంత్రంగా అధికారుల తనిఖీలు
- నకిలీ రోగులతోనే అనుమతులకు పచ్చజెండా
- సీబీఐ కేసులు పెట్టినా మారని తీరు
సహనం వందే, హైదరాబాద్:
అదొక డబ్బా మెడికల్ కాలేజ్… నగరానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందులో వసతులు లేవని లోకమంతా కోడై కూసింది. మూడేళ్ల క్రితం ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఒక బ్యాచ్ రద్దు కూడా చేశారు. అయినా దాని తీరు మారలేదు… జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అధికారుల అక్రమాలు ఆగలేదు. ఎన్ని ఆరోపణలు వచ్చినా… నకిలీ రోగులు ఉన్నారని తేలినప్పటికీ ఆ కాలేజీకి ఎన్ఎంసీ తాజాగా మరో 50 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేయడం పరాకాష్ట. దీంతో ఆ కాలేజీకి మొత్తం 200 సీట్లు నింపుకునే అవకాశం దొరికింది. అసలు ఎన్ఎంసీ తనిఖీలు కూడా ఆగమేఘాల మీద రహస్యంగా అయిపోయాయి.
నకిలీ రోగులు… తప్పుడు కేస్ సీట్లు
ఆ కాలేజీ మాయలు ఒకటీ రెండు కావు. నకిలీ రోగులు… వారికి లేనిపోని రోగాలు అంటగట్టి కేస్ సీట్లు తయారు చేయటం… ఘోస్ట్ ఫ్యాకల్టీని సిద్ధం చేసుకోవడం… ఇలా ఆ కాలేజీ యాజమాన్యం రాత్రీ పగలు అందులో బిజీలో పడిపోయింది. ఎన్ఎంసీ తనిఖీలు జరుగుతాయని తెలిసి సినిమా సెట్టింగులా కాలేజీని సిద్ధం చేశారు. కొన్ని పరికరాలను బయట నుంచి తెప్పించి తాత్కాలిక ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్ఎంసీ అధికారులు కొందరు ఆ కాలేజీ యాజమాన్యంతో కుమ్మక్కు అయినట్లు సమాచారం. అందుకోసం ఎన్ఎంసీ తనిఖీ బృందాలకు కోట్ల రూపాయల ముడుపులు అందినట్లు ప్రచారం జరుగుతుంది.
సీబీఐ కేసులు… అరెస్టులు… అయినా?
దేశవ్యాప్తంగా ఈ ఏడాది మెడికల్ కాలేజీలలో ఎన్ఎంసీ తనిఖీల ప్రక్రియలో అక్రమాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. దీంతో సీబీఐ కేసులు పెట్టింది. పరిస్థితి రచ్చ రచ్చ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఎన్ఎంసీ చైర్మన్ గంగాధర్ పైనే వేటు వేసింది. ఎన్ఎంసీ లంచాలకు మరిగి ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వటం సంచలనంగా మారింది. వైద్య విద్యా వ్యవస్థను కుదిపేసిన భారీ అవినీతి కుంభకోణం మూడు నెలల క్రితం బయటపడింది.
సీబీఐ దర్యాప్తులో ఎన్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలోని అధికారులు, దళారులు, వైద్య కళాశాలల నిర్వాహకులతో కలిసి కోట్ల రూపాయల లంచాలు మేసినట్లు తేలింది. ఏ మాత్రం వసతులు లేని కాలేజీలకు అనుమతులు కట్టబెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్ ఘడ్ లో తనిఖీ బృందంలో ఉన్న హైదరాబాద్ డాక్టర్ రజినీరెడ్డి పైన కూడా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇన్ని అక్రమాలు బయటపడినప్పటికీ ఎన్ఎంసీ అధికారులు మాత్రం ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి.