బీ’హోర్’లో తేజస్వీ(ప్) – ఆర్జేడీ, కాంగ్రెస్ మహాకూటమికే మెజారిటీ

  • లోక్ పోల్ సర్వే ఫలితాల్లో వెల్లడైన జనం నాడి
  • రాహుల్ ఓటు చోరీ యాత్రతో మారిన సీన్
  • మహాకూటమికి 118 నుండి 126 సీట్ల ఛాన్స్
  • కాబోయే సీఎం యంగ్ డైనమిక్ తేజస్వి

సహనం వందే, న్యూఢిల్లీ:
బీహార్ రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు తాజాగా వెలువడిన లోక్ పోల్ సర్వే ఫలితాలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఈ సర్వే తీవ్ర హెచ్చరికగా మారింది. బీహార్‌లో రాజకీయం వేగంగా మారుతున్నట్లు ఈ సర్వే స్పష్టం చేస్తోంది. ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి 118 నుండి 126 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తుందని అంచనా. మరోవైపు అధికార ఎన్డీఏ కూటమి మాత్రం 105 నుండి 114 సీట్లకే పరిమితం కావచ్చని సర్వే చెబుతోంది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో ఈ సీట్ల తేడా తేజస్వి యాదవ్ కు విజయాన్ని కట్టబెట్టేలా కనిపిస్తోంది.

ఓట్ల తేడా బహు స్వల్పం…
ఓట్ల వాటా పరంగా చూస్తే మహా కూటమి 39 శాతం నుండి 42 శాతం పొందవచ్చని, ఎన్డీఏ 38 శాతం నుండి 41 శాతం ఓట్లను దక్కించుకోవచ్చని లోక్ పోల్ సర్వే అంచనా వేసింది. ఈ రెండు కూటముల మధ్య కేవలం ఒకటి లేదా రెండు శాతం ఓట్ల తేడా మాత్రమే ఉన్నప్పటికీ… సీట్ల లెక్కింపులో ఈ స్వల్ప వ్యత్యాసమే మహా కూటమికి తిరుగులేని ఆధిక్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఎన్డీఏ నాయకులకు ముఖ్యంగా నితీష్ కుమార్ కు ఆందోళన కలిగించే అంశం. రాహుల్ గాంధీ నిర్వహించిన ఓట్ చోరీ యాత్ర, ఎన్డీఏ నాయకులపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఓటర్ల మనోభావాలను బలంగా ప్రభావితం చేసినట్లు సర్వే విశ్లేషిస్తోంది.

తేజస్వి వైపు యువత మొగ్గు…
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం ఇటీవల వృద్ధులు, వితంతువులకు పెన్షన్… నిరుద్యోగ యువతకు నెలవారీ ఆర్థిక సాయం, ఉచిత విద్యుత్ వంటి భారీ సంక్షేమ పథకాలను ప్రకటించినప్పటికీ వాటి ప్రభావం పరిమితంగానే ఉందని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ ఉచితాల కోసం ప్రభుత్వం ఏటా రూ. 40,000 కోట్లకు పైగా ఖర్చు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు వీటిని ప్రకటించడం వల్ల ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా యువ ఓటర్లు, తొలిసారి ఓటు వేసేవారు మహా కూటమి వైపు బలంగా మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం తేజస్వి యాదవ్ ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం అనే వాగ్దానమే. సుదీర్ఘకాలంగా కులం, వర్గం ఆధారంగా నడిచిన బీహార్ రాజకీయ సమీకరణాలు 2025 ఎన్నికలలో మారుతున్నట్లు సర్వే స్పష్టం చేస్తోంది. యువత, మహిళలు ఈసారి మహా కూటమికి అనుకూలంగా నిలవడం నితీష్ కుమార్ నాయకత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది.

కాబోయే సీఎం తేజస్వీనే…
సర్వే అంచనాల ప్రకారం మహా కూటమి విజయం సాధిస్తే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన బీజేపీకి కూడా ఒక పెద్ద దెబ్బ. యువత మార్పు కోరుకుంటున్నట్లు లోక్ పోల్ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సంచలన సర్వే తర్వాత ఎన్డీఏ కూటమి తన ఎన్నికల వ్యూహాన్ని ఎలా మారుస్తుంది? నితీష్ నాయకత్వాన్ని బలపరుస్తుందా లేక కొత్త మార్గాన్ని అనుసరిస్తుందా అనేది వేచి చూడాలి. బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు తేజస్వి యాదవ్ దూకుడు, నితీష్ కుమార్ పతనం హాట్ టాపిక్‌గా మారాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *