- జనాన్ని తొక్కి తొక్కి చంపేస్తున్న సినీస్టార్లు
- వీళ్ళేమైనా మహాత్ములా? ఎందుకంత బిల్డప్పు
- సినిమాల్లో డబ్బు… రాజకీయాల్లో పదవులు
- తెరపై నటనకే హీరోలు… సేవాలేదు ఏమీ లేదు
- తమ స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా ర్యాలీలు
- ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం
సహనం వందే, తమిళనాడు:
అభిమానుల పట్ల సినిమా తారల తీరు అత్యంత దారుణంగా ఉంటుంది. ఫ్యాన్స్ అమాయకత్వాన్ని తమ సినిమా రాజకీయ, అవసరాల కోసం ఉపయోగించుకుంటూ వందల కోట్లు గడిస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చిన అభిమానాన్ని రాజకీయాల వైపు మళ్ళించుకుని పదవులు పొందుతున్నారు. తమ స్వార్థం కోసం అభిమానుల రక్తం కళ్ళచూస్తున్నారు. పదవీకాంక్ష కోసం ఇష్టారాజ్యంగా ర్యాలీలు నిర్వహిస్తూ జనాన్ని తొక్కి చంపేస్తున్న ఈ ధోరణిని అభిమాన ఉగ్రవాదం అనకుండా ఎలా ఉండగలం? కరూరు జిల్లాలో నటుడు విజయ్ నిర్వహించిన రాజకీయ ర్యాలీలో జరిగిన ఘోర తొక్కిసలాటలో ఏకంగా 38 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. అనుమతి ఉన్నదానికంటే ఐదు రెట్లు ఎక్కువ జనాన్ని పోగేసి కనీస భద్రతా చర్యలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరించడం నిర్లక్ష్యం కాదా? ఈ సెలబ్రిటీలు మహాత్ములా? సినిమాల్లో సంపాదించిన డబ్బుతో రాజకీయాల్లో పదవులు పొందాలని ఆరాటపడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
ప్రాణాలకు విలువ ఎక్కడ?
పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను చంపితే దేశం యుద్ధానికి సిద్ధపడింది. వారి సింధూరాన్ని గౌరవించింది. మరి తమిళనాడులో విజయ్ ర్యాలీలో 31 మంది చనిపోతే దీనికి ఏమని పేరు పెట్టాలి? పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఎంత ముఖ్యమో, విజయ్ ర్యాలీలో కన్నుమూసిన కుటుంబాలు కూడా అంతే ముఖ్యం కదా. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉండటం ఈ దుర్ఘటన హృదయ విదారకతను చాటుతోంది. ఒకే బెడ్ మీద ఇద్దరు ముగ్గురిని ఉంచి చికిత్స అందిస్తున్న దృశ్యాలు ఆసుపత్రిలో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

అనేక ఘటనలు…
పుష్ప-2 సినిమా విడుదల సమయంలో అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చినప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోతే తెలంగాణ ప్రభుత్వం ఆ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని కేసు నమోదు చేసి, ఆయన్ను జైలుకు కూడా పంపింది. ఒక్క మహిళ ప్రాణం పోయినందుకే ఈ చర్యలు తీసుకుంటే, మరి తమిళనాడులో 31 మంది చనిపోతే నటుడు విజయ్‌ను ఏం చేయాలి? చట్టం కఠినంగా ఉంటేనే సెలబ్రిటీలు తమ ర్యాలీలు, ప్రమోషన్ల కోసం ప్రజలను ప్రమాదాల్లోకి నెట్టే ఈ నిర్లక్ష్యం ఆగుతుంది.
సంతాపాలతో ఆగుతుందా రక్తపాతం?
దేశవ్యాప్తంగా అనేక చోట్ల తొక్కిసలాట ఘటనలు జరుగుతున్నా నేతలు, సెలబ్రిటీలు మారడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ర్యాలీలో ఏడుగురు, ఆర్సీబీ విజయోత్సవంలో పదకొండు మంది చనిపోవడం, షారుఖ్ ఖాన్ రైలు ఘటనలోనూ ఒక మహిళ మరణించడం వంటివి ఈ నిర్లక్ష్యానికి నిదర్శనాలు. ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం, ప్రధాని మోదీ సంతాపం చెప్పడం, ఉన్నత స్థాయి విచారణకు కోరడం లాంటి చర్యలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే. మొదటి నుంచి భద్రతా మార్గదర్శకాలు పాటించి నిర్వాహకులు, ముఖ్యంగా సెలబ్రిటీలు బాధ్యత తీసుకుంటే ఈ దుర్ఘటనలు జరగవు.