రైతు బలి… రఘునందన్ బదిలీ – రుణమాఫీ… యూరియా కొరత ఎఫెక్ట్

  • అకస్మాత్తుగా బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • రైతుల్లో బద్నాం అవుతున్న సీఎం రేవంత్
  • వ్యవసాయశాఖ వల్లే అని సన్ని’హితులు’
  • రెండు పథకాలు అమలు చేయడంలో వైఫల్యం
  • మరికొందరు అధికారులపైనా చర్యలు?

సహనం వందే, హైదరాబాద్:
సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్ రావును తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కార్యదర్శి బాధ్యతల నుంచి తొలగించి బదిలీ చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఎక్కువకాలం వ్యవసాయశాఖలో ఉన్నందున బదిలీ చేశారని కొందరు అంటుంటే… కీలకమైన పంటల సీజన్లో అకస్మాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని మరికొందరు అంటున్నారు. అయితే ఆయన హయాంలో జరిగిన రెండు ప్రధాన వైఫల్యాలే ఈ పరిస్థితికి కారణమని సచివాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

రుణమాఫీ అమలులో గందరగోళం…
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన రెండు లక్షల రూపాయల రుణమాఫీ పథకం వల్ల అనుకున్నంత స్థాయిలో ప్రభుత్వానికి పేరు రాలేదు. వేల కోట్లు కేటాయించినప్పటికీ సక్రమంగా అమలు చేయడంలో వ్యవసాయశాఖ ఘోరంగా విఫలమైందని ప్రభుత్వం భావించింది. రూ. 21 వేల కోట్లతో 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసింది. రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.12 వేల చొప్పున సాయం చేసింది. అయితే ఈ పథకాల అమలు సక్రమంగా జరగకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రుణమాఫీలో రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న కొందరు రైతులకు కూడా లబ్ధి జరగలేదు. రేషన్ కార్డులు లేకపోవడం, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో వివరాలు తప్పుగా ఉండటం వంటి కారణాలతో రైతులు నష్టపోయారు. కొర్రీలతో కూడిన మార్గదర్శకాలే ఈ పరిస్థితికి కారణం అన్న విమర్శలు ఉన్నాయి.

మూడు నెలలుగా యూరియా తలనొప్పి…
రాష్ట్ర ప్రభుత్వానికి యూరియా అంశం పెద్ద తలనొప్పిగా తయారైంది. కేంద్ర ప్రభుత్వం వద్ద మన అవసరాలకు తగ్గట్టు యూరియాను తెప్పించుకునేందుకు ఏర్పాటు చేయడంలో వ్యవసాయశాఖ వైఫల్యం చెందిందన్న విమర్శలు ఉన్నాయి. సీజన్ కు ముందు ఢిల్లీలో కూర్చుని యూరియాను కేటాయించుకునేలా ప్రయత్నించడంలో యంత్రాంగం వైఫల్యం కనిపిస్తుంది. మార్చి నెలలోనే వ్యవసాయ కీలక అధికారులు ఢిల్లీకి వెళ్లి ఎందుకు ప్రయత్నం చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. మనం ప్రయత్నం చేయకుండా కేంద్రం కేటాయించలేదని చెప్పుకోవడం వల్ల రైతులకు ఒరిగేది ఏమీ ఉండదని అంటున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ వద్దకు వెళ్లి ప్రయత్నిస్తే చాలా పనులు జరుగుతాయి. కానీ హైదరాబాదు నుంచి కాలు బయట పెట్టకుండా యూరియా కొరత అంటూ గగ్గోలు పెడితే వచ్చే ప్రయోజనం ఏముంటుంది? ఈ విషయంలో ఎవరు చొరవ చూపాలో అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను అమలు చేయడంలో ఆ శాఖ విఫలం అయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. వ్యవసాయ సీజన్ లో అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని రేవంత్ రెడ్డి హెచ్చరించినా నిర్లక్ష్యం చేశారు.

అధికారులదే కీలక బాధ్యత…
గత ప్రభుత్వం రుణమాఫీని విడతల వారీగా అమలు చేసినప్పటికీ, రైతుబంధు పథకం ద్వారా రైతుల ఆగ్రహాన్ని చల్లార్చగలిగింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించినా, ఆశించిన ఫలితాలు రావడం లేదు. సరైన మార్గదర్శకాలు లేకపోవడం, పంపిణీలో తీవ్ర జాప్యం వంటి కారణాల వల్ల రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ వైఫల్యాలపై సీఎం తీవ్ర అసహనంతో ఉన్నారు. రెండు ప్రధాన కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల రైతుల్లో బద్నాం కావాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం డబ్బులు ఇస్తే వాటిని యంత్రాంగం సక్రమంగా లబ్ధిదారులకు చేర్చాలి. ఏదైనా కొరత ఉంటే దాన్ని అధికారులు సక్రమంగా పర్యవేక్షించి సంబంధిత వర్గాలను సంతృప్తిగా ఉంచేలా చేయాలి. కానీ రుణమాఫీ, యూరియా విషయంలో వ్యవసాయ శాఖ దారుణంగా విఫలమైందని ప్రభుత్వం భావించింది. కాగా యూరియా వైఫల్యానికి కారణమైన మరికొందరు అధికారుల పైన కూడా చర్యలు ఉంటాయా అన్న చర్చ జరుగుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *