డాక్టర్లపై డాలర్ సెగ – భారతీయ వైద్యులకు హెచ్1బీ గుదిబండ

  • అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అండ
  • మినహాయింపు ఇవ్వాలని ట్రంప్ కు విన్నపం
  • లేకుంటే స్వదేశానికి వెళ్లేందుకు రంగం సిద్ధం

సహనం వందే, అమెరికా:
అమెరికా ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న విదేశీ వైద్యులకు హెచ్1బీ వీసా ఫీజు రూపంలో అకస్మాత్తుగా పెనుభారం పడింది. అగ్రరాజ్యం తాజాగా వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడంపై అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (ఏఎంఏ) అగ్గిమీద గుగ్గిలమైంది. ఈ భారీ ఫీజు వైద్య సేవలకు అడ్డంకిగా మారుతుందని, దీని ప్రభావం వల్ల దేశ ఆరోగ్య రంగం కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికన్ల ఆరోగ్య భద్రతకు అత్యవసరం అయిన వైద్యులను ఈ నిబంధన నుంచి మినహాయించాలని కోరుతూ యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్)కి ఏఎంఏ లేఖ రాసింది. ఈ ఫీజు నిర్ణయం వెనుక ఉన్న స్వార్థ ప్రయోజనాలు ఏవైనా ఉన్నా, అవి దేశ ఆరోగ్యానికి మరణశాసనం రాస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విదేశీ వైద్య నిపుణులకు భారం…
కొత్తగా విధించిన ఈ లక్ష డాలర్ల వీసా ఫీజు విదేశీ నిపుణుల్లో ముఖ్యంగా వైద్యుల్లో తీవ్ర ఆర్థిక ఒత్తిడికి కారణమవుతోంది. ఈ ఫీజు భారం ఆసుపత్రులు, క్లినిక్‌లు విదేశీ వైద్యులను నియమించుకోకుండా వెనకడుగు వేసేలా చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, నగరాల్లో సేవలు అందిస్తున్న విదేశీ వైద్యులే తగ్గిపోతే అక్కడి రోగులకు నాణ్యమైన చికిత్స అందడం మరింత కష్టమవుతుంది. ఇప్పటికే అమెరికాలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో వీసా ఫీజును పెంచడం అనేది విదేశీ వైద్యుల రాకను అడ్డుకుంటుంది. ఇది అటు రోగులకు, ఇటు విదేశీ వైద్య నిపుణులకు కూడా నష్టదాయకమైన నిర్ణయమని ఏఎంఏ నిప్పులు చెరిగింది.

పంతానికి పోతే స్వదేశానికి పయనం?
అమెరికా ఆరోగ్య వ్యవస్థలో భారతీయ వైద్యుల పాత్ర అత్యంత కీలకం. హెచ్1బీ వీసాపై పనిచేసే విదేశీ వైద్యుల్లో భారతీయుల సంఖ్యే గణనీయంగా ఉంటుంది. కొత్తగా లక్ష డాలర్ల ఫీజు భారం పడితే అమెరికాలో వైద్య సేవలు అందించడానికి వచ్చే భారతీయ వైద్యులు సంఖ్య తగ్గిపోతుంది. ఈ పెరిగిన ఫీజు కారణంగా వారంతా అమెరికాకు వచ్చే బదులు తిరిగి స్వదేశానికి వెళ్లిపోవడానికే మొగ్గు చూపవచ్చు. దేశం ఆరోగ్య సేవల్లో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, విదేశీ నిపుణులపై ఇలాంటి భారీ పన్నులు విధించడం అనేది ఏ మాత్రం సమంజసం కాదని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

మినహాయింపు కోసం ఏఎంఏ యుద్ధభేరి…
వైద్యులపై విధించిన ఈ అన్యాయమైన ఫీజును రద్దు చేయాలనే డిమాండ్‌తో ఏఎంఏ యుద్ధభేరి మోగించింది. వైద్యులు అమెరికా ఆరోగ్య వ్యవస్థలో అనివార్యమైన భాగమని, వారిని ఈ ఫీజు నుంచి మినహాయించాలని డీహెచ్‌ఎస్‌కు రాసిన లేఖలో ప్రస్తావించింది. ఈ మినహాయింపు లభిస్తేనే ఆసుపత్రులు విదేశీ వైద్యులను సులభంగా నియమించుకుని, ఆరోగ్య సేవలను మెరుగుపరచగలవని తేల్చిచెప్పింది. వైద్య సంఘాలు, ఆసుపత్రి సంస్థలు ఏకం కావడంతో ఈ ఫీజు నిర్ణయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డీహెచ్‌ఎస్ ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తుందా లేక నిరంకుశంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *