- సాధారణ ధరలు ఉన్నప్పుడే చూడండి
- ఐపీఎల్ కు తగలేస్తారు… దీనికి అడ్డొస్తారు?
- ఐపీఎల్ మ్యాచ్ టికెట్ రూ.1500 ఉంటే…
- దాన్ని 200 చేయాలని ఎందుకు అడగరు?
- సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యల సంచలనం
సహనం వందే, హైదరాబాద్:
‘ఓజీ’ సినిమా టికెట్ రేట్లపై శుక్రవారం హైకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. ఆ సినిమా నిర్మాత తరపున వాదించిన సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. ‘సినిమా టికెట్ ధరలపై మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తే రూ.100, రూ.150 పెంచుకోమని ఉత్తర్వులు ఇచ్చారు. రూ.150 కూడా పిటిషనర్‌కు కష్టం అనుకుంటే సాధారణ రేటు ఉన్నప్పుడే సినిమా చూడాలి. పిటిషనర్ మొదటి రోజు సినిమా చూడాలంటారు. కానీ ఆయనకు నచ్చిన ధరతోనే చూడాలనుకుంటే ఎలా?’ అంటూ న్యాయవాది వాదనలు వినిపించారు.
ఐపీఎల్ టికెట్ తగ్గించమని కోరరెందుకు?
‘ఫైవ్ స్టార్ హోటల్‌లో కాఫీ రూ. 500 ఉంటుంది. దిల్జిత్ షో అంటే టికెట్ ధర వేలల్లో ఉంటుంది. ఆ ధరలపై నిర్వాహకులకే అధికారం ఉంటుంది. హైదరాబాద్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ షో ఏర్పాటుచేయాలనుకుంటే అతడికి నచ్చిన రేట్‌లో నిర్వహిస్తాడు. సినిమా టికెట్ ధరలను మాత్రం ప్రభుత్వం రెగ్యులేట్ చేస్తుంది. ఇదే ఓజీ సినిమాను ఢిల్లీలో చూడాలంటే రూ.1500 టికెట్ ధర ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ రూ.1500 ఉంటుంది. అదే టికెట్ రూ. 200కు కావాలని పిటిషనర్ కోర్ట్‌కు ఎందుకు రారు? దిల్జిత్ షో రూ. 10 వేలు ఉంటే రూ. 200కే కావాలని ఎందుకు రారు? కేవలం సినిమా టికెట్ ధరలపై మాత్రమే ఇలాంటి పిటిషన్‌లు వేస్తున్నార’ని న్యాయవాది అసహనం వ్యక్తం చేశారు.
ఓజీ టికెట్ ధరలు పెంచొద్దన్న హైకోర్టు…
పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ఓజీ మూవీ టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. రివ్యూ పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు… టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదని మరోసారి స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. తదుపరి విచారణను అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేసింది. టికెట్ ధరలు ఎందుకు పెంచాలనుకుంటున్నారో తెలియజేస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో సినిమా నిర్మాత నిరాశకు గురైనట్లు తెలిసింది.
తొలి రోజు రూ. 154 కోట్లకు పైగా…
మరోవైపు ఓజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.154 కోట్లకు పైగా వసూలు చేసిందని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు పవర్‌ఫుల్ పోస్టర్ విడుదల చేసింది. ‘ఇది పవన్ కల్యాణ్ సినిమా. చరిత్రను ఓజీ తిరగరాసింద’ని క్యాప్షన్ పెట్టింది. ప్రీమియర్స్‌లోనూ అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఓజీ నిలిచింది. ఫస్ట్ డే అత్యధిక వసూలు చేసిన టాప్-10 భారతీయ సినిమాల జాబితాలో చోటు దక్కించుకుందని ప్రకటించింది.