- బీసీ రిజర్వేషన్ల అమలుపై ఉత్కంఠ
- ఎలాగైనా ముందుకు వెళ్లాలని కృతనిశ్చయం
- సామాజిక న్యాయానికి చారిత్రక అడుగు
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) సామాజిక న్యాయాన్ని అందించే దిశగా చారిత్రక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఏకంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఈ రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
న్యాయపరమైన చిక్కులపై ఆందోళన…
ఈ చారిత్రక నిర్ణయం వెనుక న్యాయపరమైన చిక్కులు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. రిజర్వేషన్లపై కేంద్రం నుంచి అనుమతి లేకపోవడం, సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ల గరిష్ఠ పరిమితిని ఈ నిర్ణయం దాటిపోయే అవకాశం ఉండటంతో ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఏమవుతుందన్న భయం ప్రభుత్వాన్ని వెన్నాడుతోంది. గతంలో సైతం కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయత్నాలు న్యాయస్థానాల్లో నిలబడని పరిస్థితి తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కోర్టు తీర్పు అనే అగ్నిపరీక్షను దాటుతుందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
చట్టబద్ధతకు కమిషన్ల పునాది…
అయితే ప్రభుత్వం ఈ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. భారత రాజ్యాంగ నిబంధనలకు లోబడి బీసీ రిజర్వేషన్ల నిర్ధారణ కోసం గతంలోనే విశ్రాంత ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు అధ్యక్షతన ప్రత్యేక బీసీ కమిషన్ (డెడికేటెడ్ బీసీ కమిషన్)ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ క్షేత్రస్థాయి పరిశోధనతో పాటు లోతైన అధ్యయనం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కుల సర్వే నివేదికలను సైతం పరిగణనలోకి తీసుకున్నారు.
కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 56.33 శాతం ఉంది. ఈ జనాభా వెనుకబాటులో ఉన్నందున స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వవచ్చని కమిషన్ మార్చిలో... ఆ తర్వాత ఆగస్టులో సమర్పించిన నివేదికల్లో సిఫారసు చేసింది. ఈ సిఫారసుల ఆధారంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 243 ఈ(6), 243 టీ(6)లలో గ్రామ పంచాయతీలు, పురపాలక సంస్థల్లో బీసీలకు సీట్ల కేటాయింపు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏదిఏమైనా న్యాయస్థానాలలో ఈ రిజర్వేషన్లు నిలబడతాయా లేదా అనే అంశంపైనే తెలంగాణ బీసీల భవిష్యత్తు ఆధారపడి ఉంది.
మా నోటికాడి ముద్ద లాక్కోవద్దు: మంత్రి పొన్నం
ఈ అంశంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీసీ రిజర్వేషన్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని ఆయన స్పష్టం చేశారు. ‘కోర్టులకు వెళ్లేవారు మా నోటికాడి ముద్ద లాక్కోవద్దు’ అంటూ మంత్రి రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అమలవుతున్న రిజర్వేషన్ల మాదిరిగానే ఇక్కడ కూడా అర్హత ప్రకారం ఇవ్వాలని కోరుతున్నామని, ఎవరిదీ గుంజుకోవడం లేదని మంత్రి పేర్కొన్నారు.