- మౌలిక సదుపాయాలు లేకున్నా మరిన్ని సీట్లు
- డబ్బా కాలేజీలు… ప్రొఫెసర్లు లేని చదువులు
- కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువ
- సీట్ల అనుమతులకు ప్రైవేటు కాలేజీల లంచం
- ఈ ఏడాది అనేక కాలేజీలపై సీబీఐ దర్యాప్తు
- ముడుపులు తీసుకున్న కొందరు డాక్టర్ల అరెస్ట్
- ఈ పరిస్థితుల్లో సీట్ల పెంపు సమంజసమా?
సహనం వందే, న్యూఢిల్లీ:
దేశంలో వైద్య విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 5,000 పీజీ, 5,023 ఎంబీబీఎస్ సీట్లను పెంచేందుకు ఆమోదం లభించింది. మారుమూల ప్రాంతాల్లో వైద్య నిపుణుల కొరతను ఈ సీట్ల పెంపు తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే వైద్య విద్యలో నాణ్యతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే లక్షకు పైగా ఉన్న సీట్లకు తోడు మరిన్ని సీట్లు పెంచడం ద్వారా వైద్య విద్య నాణ్యత మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మౌలిక వసతుల లేమి… ఫ్యాకల్టీ కొరత
జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీల్లో అనేక ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కనీస మౌలిక వసతులు, తగినంత మంది అధ్యాపకులు లేరని వెల్లడైంది. అయినప్పటికీ రాజకీయ ఒత్తిడి, అవినీతి కారణంగా నాణ్యత ప్రమాణాలను పట్టించుకోకుండా సీట్లకు అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. మెడికల్ కాలేజీలలో బోధనా సిబ్బంది, మౌలిక వసతులు లేనప్పటికీ ముడుపులు ఇచ్చి అనుమతులు పొందుతున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ చేపట్టి పలువురిని అరెస్ట్ కూడా చేసింది. తెలంగాణలో అనేక ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కనీసం రోగులు వచ్చే పరిస్థితి లేక… చదువు చెప్పే అధ్యాపకులు లేక విద్యార్థులు దిక్కులు చూస్తున్నారు.
ఆశావహ ప్రకటనలు…
గత పదేళ్లలో వైద్య విద్యా రంగం అద్భుతమైన వృద్ధిని సాధించిందని కేంద్రం చెబుతోంది. ప్రస్తుతం దేశంలో 808 వైద్య కళాశాలలు ఉండగా… ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1,23,700కు చేరింది. గత దశాబ్దంలోనే 69,352 కొత్త ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇది 127 శాతం వృద్ధిని సూచిస్తుంది. అదేవిధంగా, పీజీ సీట్ల సంఖ్యలో 143 శాతం వృద్ధి నమోదైంది. ఈ వృద్ధి ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో వైద్య విద్య అవకాశాలను మరింత పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తుంది.
చేదు వాస్తవాలు…
ఈ అంకెలు పైకి ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ వాటి వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం విస్మరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో వైద్యుల కొరత తీరుతుందని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ లోపాలను పరిష్కరించకుండా సీట్ల సంఖ్యను మాత్రమే పెంచడం వల్ల ప్రయోజనం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో వైద్య విద్య, శిక్షణలో నాణ్యత పెరిగే బదులు… కేవలం సంఖ్యాపరమైన వృద్ధిపై దృష్టి పెట్టడం భవిష్యత్తులో దేశ వైద్య రంగానికి పెను సవాళ్లు సృష్టించవచ్చని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.