అభిమానంతో కోట్ల వ్యాపారం – ఫ్యాన్స్ టిక్కెట్లే… పవన్ కల్యాణ్ కు కోట్లు

  • ఓజీ సినిమాకు రూ.100 కోట్ల రెమ్యూనరేషన్
  • ఇతర నటులవి కలుపుకుంటే అంతుండవు
  • సినిమా ఖర్చుల్లో దాదాపు సగం ఆయనకే

సహనం వందే, హైదరాబాద్:
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా ఇప్పుడు అభిమానం, వ్యాపారం మధ్య చిక్కుకుంది. కేవలం అభిమానుల క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకుని భారీ మొత్తాలను జేబులో వేసుకుంటున్నారని సినీ వర్గాల్లో ఒక కొత్త చర్చ మొదలైంది. ఈ సినిమాకు పవన్ ఏకంగా 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని వస్తున్న వార్తలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. 250 కోట్ల రూపాయల బడ్జెట్‌లో దాదాపు అటు ఇటుగా సగం పవన్ రెమ్యునరేషనే కావడం గమనార్హం. కేవలం అభిమానులు టికెట్ కొంటే వచ్చే డబ్బులతోనే కోట్లు గడించే ఈ వ్యాపార వ్యూహంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రెమ్యూనరేషన్ల రచ్చ… లాభాల లెక్కలు
ఓజీ బడ్జెట్‌లో పవన్ పారితోషికం ఒక భాగం మాత్రమే కాదు… అదే ప్రధాన భాగం. ఇమ్రాన్ హష్మీ రూ.5 కోట్లు, ప్రియాంక మోహన్ రూ.2 కోట్లు, దర్శకుడు సుజీత్ రూ.6 నుంచి 8 కోట్లు, సంగీత దర్శకుడు తమన్ రూ.5 కోట్లు… ఇలా అందరి రెమ్యూనరేషన్లనూ కలిపినా పవన్ మొత్తంలో సగభాగం కూడా ఉండదు. ఒక సినిమా నిర్మాణ ఖర్చులో దాదాపు సగం డబ్బు ఒక్క హీరోకే ఇస్తే సినిమా నాణ్యతపై అది ఎంత ప్రభావం చూపుతుందనేది ప్రశ్నార్థకం. ఈ భారీ ఖర్చులన్నీ ఎవరిపై మోపుతారు? చివరికి సినిమాను చూడటానికి టికెట్లు కొనే సామాన్య అభిమానుల మీదే ఈ భారం పడుతుంది. బెనిఫిట్ షోలు, ఆ తర్వాత పది రోజులు ప్రత్యేక ధరల భారం అభిమానులు భరించాల్సిందే. అభిమానుల్లో ఎక్కువమంది బడుగు బలహీన వర్గాలే అన్నది గమనించాల్సిన విషయం.

బాక్సాఫీస్ గర్జన…
పవన్ కల్యాణ్‌కు ఉన్న అపారమైన ప్రజాదరణ, ఆయన అభిమానుల ఉత్సాహం ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇప్పటికే రూ. 50 కోట్లు తెచ్చిపెట్టింది. పవన్ తన రాజకీయ జీవితంలో రైతు బిడ్డగా, ప్రజల పక్షపాతిగా నిలబడ్డారు. కానీ అభిమానం పేరుతో కోట్లు పోగేసుకుంటున్నారనే ఆరోపణలు ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశం ఉంది. రాజకీయ జీవితంలో ఒక మాట, సినిమా జీవితంలో మరో మాట ఉంటుందా అని ఆయన ప్రత్యర్థులు ఈ అంశాన్ని బలంగా ఎత్తి చూపుతున్నారు. చివరికి సినిమా విజయాల కన్నా, డబ్బుల లెక్కల చర్చే ఎక్కువ కావడం ఒక మచ్చగా మిగిలిపోయింది. తన వృత్తి కాబట్టి నటిస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు. 100 కోట్ల రూపాయలు తీసుకుంటూ ప్రజాసేవ అంటే ఎలా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *