సీపీఐలో పల్లాకు పెద్దపీట – జాతీయ కార్యదర్శిగా అత్యున్నత అవకాశం

  • జాతీయ కార్యవర్గంలోకి పద్మ, కూనంనేని
  • కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా నారాయణ

సహనం వందే, హైదరాబాద్:
చండీగఢ్‌లో జరిగిన సీపీఐ జాతీయ 25వ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రానికి సముచిత స్థానం లభించింది. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గంలో తెలంగాణ నుంచి పల్లా వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా తప్పుకోవడంతో… నల్లగొండ నేత పల్లాకు జాతీయస్థాయిలో అత్యున్నత పదవి దక్కింది. దీంతో తెలంగాణకు చెందిన పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఏఐఎస్ఎఫ్ నుంచి జాతీయ కార్యదర్శి వరకు…
నల్లగొండ జిల్లాకు చెందిన పల్లా వెంకట్ రెడ్డి ప్రస్థానం ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలైంది. ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీపీఐకి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా గతంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో మునుగోడు నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. అలాగే సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఇన్ని స్థాయిల్లో అనుభవం ఉన్న పల్లాకు ఇప్పుడు జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడం తెలంగాణ నాయకత్వానికి దక్కిన గొప్ప గౌరవంగా భావించవచ్చు.

కార్యవర్గంలో మళ్లీ పద్మ, కూనంనేని…
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మరోసారి సీపీఐ జాతీయ కార్యవర్గంలోకి ఎన్నికయ్యారు. ఆయనతోపాటు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ సైతం జాతీయ కార్యవర్గంలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అలాగే పార్టీ క్రమశిక్షణ, నియంత్రణ చూసే కంట్రోల్ కమిషన్ సభ్యులుగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎం.డి.యూసుఫ్ ఎన్నికయ్యారు. ఆయన కంట్రోల్ కమిషన్ సభ్యులుగా జాతీయ సమితికి శాశ్వత ఆహ్వానితులుగా వ్యవహరిస్తారు.

సమితిలో పది మంది కొత్తవారికి అవకాశం…
తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం పది మంది నేతలకు సీపీఐ జాతీయ సమితిలో స్థానం దక్కింది. వీరిలో కూనంనేని సాంబశివరావు, పశ్య పద్మ, పల్లా వెంకట్ రెడ్డితో పాటు తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు, ఇ.టి.నర్సింహా, బాగం హేమంతరావు, కలవేన శంకర్, ఎం.బాలనర్సింహా, ఎస్.కె.సాబీర్ పాషా ఉన్నారు. వీరిలో ఎస్.కె.సాబీర్ పాషా తొలిసారిగా జాతీయ సమితికి ఎన్నికయ్యారు. ఇక పాల్మాకుల జంగయ్య క్యాండిడేట్ సభ్యులుగా ఎంపిక కాగా, ఆయన కూడా కొత్తగా ఈ స్థానాన్ని దక్కించుకున్నారు.

కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా నారాయణ…
సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా డాక్టర్ కె.నారాయణ ఎన్నికయ్యారు. 11 మంది సభ్యులను సెంట్రల్ కంట్రోల్ కమిటీకి ఎన్నుకున్నారు. ఈ కమిటీలో డాక్టర్ కె.నారాయణ (ఆంధ్రప్రదేశ్), ఎం.డి.యూసుఫ్ (తెలంగాణ), పి.దుర్గా భవాని (ఆంధ్రప్రదేశ్) సహా వివిధ రాష్ట్రాల నుంచి సభ్యులు ఉన్నారు. అనంతరం కమిటీ సమావేశమై చైర్మన్‌గా డాక్టర్ కె.నారాయణను, కార్యదర్శిగా రామ్ బహేతిని ఎన్నుకుంది. ఈ ఫలితాలతో సీపీఐ జాతీయ రాజకీయాల్లో తెలంగాణ నాయకత్వం గళం మరింత బలంగా వినిపించనుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *