తల తిరుగుడు… బ్యాలెన్స్ తప్పుడు – అకస్మాత్తుగా కళ్లు తిరుగుతున్నాయా?

  • డ్రైవింగ్ చేస్తుంటే బ్యాలెన్స్ తప్పుతుందా?
  • ప్రమాదాలకు కారణం అవుతున్న సిండ్రోమ్
  • అదే మోటరిస్ట్ వెస్టిబ్యులర్ డిస్ఓరియంటేషన్
  • 50% వరకు రోడ్డు ప్రమాదాలకు ఇదే కారణం
  • మెదడు బ్యాలెన్స్ సిస్టంలో చిన్న లోపాలు
  • కళ్లు తిరుగుతున్నట్టు… వాంతుల ఫీలింగ్
  • ఈ సమస్య ఉంటే స్టీరింగ్ వదిలేస్తారు
  • దీన్ని మద్యం తాగి నడపడం అని అనుకోవద్దు
  • డాక్టర్ లాస్య సింధుతో ‘సహనం వందే’ ప్రత్యేక ఇంటర్వ్యూ

సహనం వందే, హైదరాబాద్:
మీరు వాహనం నడిపేటప్పుడు ఒక్కసారిగా కళ్లు తిరిగినట్టుగా అనిపించిందా? కారు అదుపు తప్పి ఏదో ఒక వైపు వెళ్లినట్లుగా అనిపించిందా? స్టీరింగ్ మీద పట్టు కోల్పోయి ప్రమాదానికి గురైనప్పటికీ మీకు ఏం జరిగిందో అర్థం కాలేదా? ఇలాంటి సమస్యలు ఎదురైతే అది కేవలం అలసటనో, నిద్రలేమినో అనుకోవడానికి లేదు. మీ మెదడులోని సమతుల్యత (బ్యాలెన్స్) వ్యవస్థలో ఏదో లోపం ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్నే ‘మోటరిస్ట్ వెస్టిబ్యులర్ డిస్ఓరియంటేషన్ సిండ్రోమ్’ అని పిలుస్తారు.

రోడ్డు ప్రమాదాల్లో సుమారు 50 శాతం వరకు ఈ మెదడు లోపం వల్లే జరుగుతున్నాయని అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. డ్రైవింగ్ చేసేప్పుడు కళ్ల నుంచి మెదడుకు సరైన సమన్వయం (కోఆర్డినేషన్) లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని హైదరాబాద్ సిటీ న్యూరో ఆసుపత్రి ఈఎన్ టీ న్యూరో ఆటాలజిస్ట్ డాక్టర్ లాస్య సాయి సింధు అంటున్నారు. ఈ విషయంపై ఆమె ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే…

డ్రైవర్లలో పెరుగుతున్న బ్యాలెన్స్ సమస్యలు…
సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే డ్రైవర్ మద్యం తాగి ఉంటాడనో, అనుభవం లేని వాడనో భావిస్తాం. కానీ నిజానికి చాలామంది డ్రైవర్లు తమలో ఉన్న ఈ బ్యాలెన్స్ సమస్యను గుర్తించలేరు. కళ్లు తిరిగితే అలసట అనుకుంటారు. వాంతులు వస్తే గ్యాస్ట్రిక్ సమస్య అనుకుంటారు. తమలో బ్యాలెన్స్ లోపం ఉందని చాలామందికి తెలియదు.

మానసిక సమస్యలు, డిప్రెషన్, భయంతో బాధపడేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వేగంగా వెళ్లేప్పుడు (66%), మల్టిపుల్ లేన్స్ ఉన్నప్పుడు (58%), మలుపులు తిరిగేప్పుడు (58%) ఈ సమస్య తలెత్తుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా ఇతర వాహనాలను చూసినప్పుడు (40%), వంతెనల పైనుంచి లేదా పల్లానికి వెళ్లేటప్పుడు (25%) కూడా చాలామంది డ్రైవర్లు కళ్లు తిరిగినట్లుగా ఫీల్ అవుతుంటారు.

మెదడులోని రహస్య వ్యవస్థ…
వాహనం నడిపేటప్పుడు మనకు స్పష్టత అవసరం. దీన్నే ‘స్పేషియల్ కాగ్నిటివ్ ఎబిలిటీ’ అని పిలుస్తారు. మన మెదడు, కొన్ని నరాలు చేతులు, కాళ్ల మధ్య సమన్వయం సాధిస్తాయి. ఆప్టిక్ నర్వ్ మనం చూడటానికి, ఆక్యులో మోటార్ నర్వ్ కళ్లను కదపడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ‘వెస్టిబులో కాక్లియర్ నర్వ్’ మన శరీరం సమతుల్యతను నియంత్రిస్తుంది. దీనితోపాటు మెదడులోని ‘మోటార్ సెరెబెల్లార్ సిస్టం’, ‘ఎక్స్‌ట్రా పిరమిడల్ సిస్టం’ కూడా డ్రైవింగ్‌కు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ వెస్టిబులో కాక్లియర్ నర్వ్‌లో సమస్య వస్తే డ్రైవింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతాయి. అకస్మాత్తుగా ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారో అర్థం కాని పరిస్థితి (డిస్ఓరియంటేషన్) ఏర్పడుతుంది. ఈ సమస్య ట్రక్కు, లారీ డ్రైవర్లలో ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యతో బాధపడేవారిలో 55 శాతం మంది కళ్లు తిరగడం, వాహనంపై నియంత్రణ కోల్పోవడం వంటివి జరుగుతాయని డాక్టర్ లాస్య సింధు తెలిపారు.

మందులు లేదా వ్యాయామంతో చికిత్స
చాలామంది ఈ సమస్యను గుండెపోటు లక్షణాలుగా భావించి భయపడుతుంటారు. చెమటలు పట్టడం, కాళ్లు, చేతులు చల్లగా అయిపోవడం, గుండె దడదడ కొట్టుకోవడం వంటివి ఈ సిండ్రోమ్ లక్షణాలు. కానీ ఈసిజి వంటి పరీక్షలు చేస్తే ఫలితాలు సాధారణంగానే ఉంటాయి. దురదృష్టవశాత్తూ, డ్రైవర్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేప్పుడు వారి బ్యాలెన్స్ సిస్టంను ఎవరూ పరీక్షించరు. ఈ సమస్యకు చికిత్స ఉంది. ఈఎన్టీ న్యూరో ఆటాలజిస్ట్ డాక్టర్లు దీనిని సరిగ్గా నిర్ధారించి, మందులు లేదా వ్యాయామంతో చికిత్స అందిస్తారు. ముఖ్యంగా 30-45 సంవత్సరాల మధ్య వయస్సులో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. 60 శాతం మందిలో మైగ్రేన్, 50 శాతం మందిలో వాంతులు వంటి సమస్యలు కూడా ఉంటాయి. ఈ సిండ్రోమ్ గురించి సరైన అవగాహన కల్పించడం ద్వారా ఎన్నో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. వీటికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే 80086 94369 నెంబర్ కు ఫోన్ చేయవచ్చు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *