- ఖమ్మం – దేవరపల్లి మీదుగా కొత్త రహదారి
- నాలుగైదు గంటల ప్రయాణ సమయం ఆదా
- జనవరి నుంచి అందుబాటులోకి ఈ రోడ్డు
సహనం వందే, హైదరాబాద్:
వందే భారత్ రైల్లో హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్లడానికి ఎనిమిదిన్నర గంటల సమయం పడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరితే రాత్రి 11:35 గంటలకు చేరుస్తుంది. ఇప్పుడు వందే భారత్ కు దీటుగా రోడ్డు పైనే కారు లేదా బస్సులో విశాఖకు చేరుకోవచ్చు. అందుకోసం వచ్చే సంక్రాంతి నుంచి కొత్త రహదారి అందుబాటులోకి రానుంది.
హైదరాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం తగ్గబోతోందని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రయాణికులకు ఇది నిజంగా ఓ మంచి కబురు. గతంలో 12 గంటలు పట్టే సుదీర్ఘ ప్రయాణం… ఇకపై కేవలం 8 గంటల్లోనే ముగియనుంది. అంటే దాదాపు 4 గంటల సమయం ఆదా అవుతుంది. దీనికి ప్రధాన కారణం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిర్మిస్తున్న ఒక అద్భుతమైన రహదారి.
నూతన గ్రీన్ ఫీల్డ్ హైవే…
ఖమ్మం – దేవరపల్లి మధ్య దాదాపు 4,609 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 162 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనులు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే జనవరి నాటికి ఈ రహదారి పూర్తిగా సిద్ధం కానుంది. ఈ హైవే ఖమ్మం, సూర్యాపేట జిల్లాల గుండా వెళ్తుంది. కొత్త రహదారి నిర్మాణంతో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య దూరం 125 కిలోమీటర్లు తగ్గుతుంది.
100 కిలోమీటర్ల వేగంతో…
ఈ కొత్త రహదారిలో వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి వీలుగా నిర్మాణం జరిగింది. ఈ మార్గంలో ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు కేవలం 11 ఎగ్జిట్ పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఇది అందుబాటులోకి వచ్చాక విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేదు. ఖమ్మం, సత్తుపల్లి మీదుగా నేరుగా దేవరపల్లి జంక్షన్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం సులభంగా చేరుకోవచ్చు.
ఖర్చు… సమయం ఆదా
ఈ రహదారి వల్ల కేవలం సమయమే కాకుండా ఇంధనం కూడా ఆదా అవుతుంది. కార్లు, బస్సులు, సరుకు రవాణా చేసే భారీ వాహనాలు, లారీలు వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. తద్వారా వాణిజ్యం, వ్యాపారం మరింత వేగవంతం అవుతాయి. ప్రస్తుతం ఉన్న మార్గం చాలా ఇరుకుగా గుంతలతో ఉండడంతో ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతోంది. ఈ కొత్త హైవేతో ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. హైదరాబాద్ – విశాఖపట్నం మధ్య దూరం తగ్గడంతో రెండు ప్రధాన నగరాల మధ్య వాహనాల రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయి.