- పోరాట వ్యూహాలను పక్కన పెట్టిన నేతలు
- పరోక్షంగా అధికార పక్షానికి అండదండలు
- శాసనసభల్లో సమస్యలపై నిలదీసే నాధుడేడీ?
- ఓటమినే తలుచుకుంటూ ఇళ్ళకే పరిమితం
సహనం వందే, హైదరాబాద్/అమరావతి:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్… ఇద్దరూ ఒకే స్టైల్ రాజకీయాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అసెంబ్లీకి వెళ్లడానికి వీరిద్దరూ విముఖత చూపటంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కోలేక గైర్హాజరు అవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కీలక స్థానంలో ఉన్న ఈ ఇద్దరు ప్రజల పక్షాన అసెంబ్లీ వేదికగా ఎందుకు పోరాడడం లేదని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళని గెలిపిస్తే తమకు ఒరిగిందేంటని నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి ఉంటే తప్పా వీళ్లు అసెంబ్లీకి రారా అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఎక్కువ టైం ఇస్తే అసెంబ్లీకి వస్తా…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలకు మాట్లాడటానికి తగినంత సమయం ఇవ్వడం లేదని, కొన్ని నిమిషాల సమయంతో ప్రజల సమస్యలను పూర్తిగా వివరించడం సాధ్యం కాదని ఆయన వాదించారు. అందుకే తాము అసెంబ్లీకి వెళ్లడం లేదని, ఎక్కువ సమయం ఇస్తేనే సభకు వస్తామని చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఫరవాలేదని చెప్పడం చూస్తే ఇది ఓ మొండి వైఖరిగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక పార్టీ వ్యూహమా లేక ప్రజా సమస్యలపై నిజమైన ఆందోళనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ సైతం అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావడం గమనిస్తే ఇద్దరు మాజీ సీఎంలు ఒకే బాటలో పయనిస్తున్నారన్నది స్పష్టం. ఇది ప్రజల ప్రయోజనాలను పక్కనపెట్టి, సొంత రాజకీయ వ్యూహాలకే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శకులు భావిస్తున్నారు.
ప్రజాస్వామ్యంపై దెబ్బ…
జగన్ మరో ఆసక్తికరమైన అంశాన్ని లేవనెత్తారు. అసెంబ్లీలో ఎక్కువ సమయం ఇవ్వడం లేదని… అందుకే ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించామని వివరించారు. ఈ వాదనలు వారి అసౌకర్యాన్ని మాత్రమే తెలియజేస్తున్నాయి తప్ప, అసెంబ్లీలో ప్రజా ప్రతినిధిగా ఉండాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అధికార పార్టీని నిలువరించే శక్తి, ప్రజల పక్షాన గట్టిగా నిలబడే ధైర్యం లేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తూ సభకు దూరంగా ఉంటున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీలో ఉండి పోరాడటానికి బదులు బయట నుంచి మాత్రమే విమర్శలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని హెచ్చరిస్తున్నారు.
గైర్హాజరీపై బెదిరింపులు
శాసనసభకు నిర్దిష్ట సమయం నాటికి హాజరు కాకపోతే అనర్హత వేటు వేస్తారనే బెదిరింపులు ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. అయితే గతంలో చంద్రబాబు సభకు రానప్పుడు ఈ నిబంధనలు ఎందుకు అమలు కాలేదని ఆయన ప్రశ్నించారు. ఈ వైఖరి ప్రజా ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందని, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాసనసభాపక్ష సమావేశంలో జగన్ తన పార్టీ ఎమ్మెల్సీలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. మండలిలో పార్టీ బలాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని, ప్రజల కోసం గట్టిగా పోరాడాలని చెప్పారు. ఇది రాజకీయంగా ఎదగడానికి మంచి అవకాశమని, అందరి పనితీరును గమనిస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు జగన్ అసెంబ్లీని విస్మరించి, శాసనమండలిపైనే దృష్టి సారించారని స్పష్టం చేస్తున్నాయి.